అమలకి ఏకాదశిని రంగ్బరీ ఏకాదశి అని కూడా పిలుస్తారు. హోలీకి ముందు వచ్చే ఏకాదశిని అమలకి ఏకాదశి అంటారు. విష్ణువుతో పాటు శివపార్వతులను కూడ పూజిస్తారు. ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.
హోలీకి ముందు వచ్చే ఏకాదశిని రంగ్బరి ఏకాదశి ( మార్చి20) అంటారు. దీన్నే అమలకి ఏకాదశి అని కూడా పిలుస్తారు. వివాహం జరిగిన తర్వాత పార్వతీ సమేతంగా శివుడు కాశీ వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. ఆరోజునే రంగ్బరీ ఏకాదశి జరుపుకుంటారు. కాశీలో ఈ వేడుక రోజు బూడిదతో హోలీ వేడుక నిర్వహించుకుంటారు. కాశీలో ఈ వేడుక ఘనంగా జరుగుతుంది.
అమలకి ఏకాదశి ఎప్పుడు?
ఈ ఏడాది (2024)అమలకి ఏకాదశి మార్చి 20వ తేదీ వచ్చింది. ఆరోజు పుష్యమి నక్షత్రం కూడా ఉంది. అమలకి ఏకాదశి రోజున భక్తులు విష్ణుమూర్తితో పాటు ఉసిరి చెట్టుకి పూజలు చేస్తారు. విష్ణుమూర్తి ఈ చెట్టులో కొలువు తీరాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువుతో పాటు లక్ష్మీదేవి, కుబేరుడు ఈరోజు (మార్చి 20) ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారని భక్తుల విశ్వాసం. అలాగే రాధాకృష్ణులు కూడా ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద సంతోషంగా గడిపారని పురాణాలు చెబుతున్నాయి.
అమలకి ఏకాదశి ముహూర్తం
ఏకాదశి తిథి ప్రారంభం మార్చి 20వ తేదీ బుధవారం అర్థరాత్రి 12.21 గంటల(తెల్లవారితే గురువారం) నుంచి
ఏకాదశి తిథి ముగింపు మార్చి 21 తెల్లవారుజాము 2. 21 గంటల వరకు ఉంటుంది.
పూజా విధానం
అమలకి ఏకాదశి రోజు విష్ణువుని లక్ష్మీ సమేతంగా పూజిస్తారు. అలాగే పార్వతిదేవి శివుడిని కూడా పూజిస్తారు. పొద్దునే నిద్రలేచి పవిత్ర నదీ స్నానం ఆచరించాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ గదిలో దీపం వెలిగించి విష్ణుమూర్తికి నైవేద్యం సమర్పిస్తారు. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. అలాగే ఉసిరి చెట్టు కింద నవరత్నాలతో కూడిన ఒక కలశం ప్రతిష్టించడం మంచిది. ఉసిరి చెట్టు కింద నెయ్యితో దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలి. ఒకవేళ ఉసిరి చెట్టు అందుబాటులో లేకపోతే ఉసిరికాయను విష్ణువుకు ప్రసాదంగా సమర్పించవచ్చు. అమలకి ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల తీర్థయాత్రలు సందర్శించడం, యజ్ఞం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. మోక్షాన్ని పొందుతారు. ఉపవాసం చేయలేని వారు ఉసిరికాయను నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మీరు దాన్ని తీసుకోవచ్చు.
అమలకి ఏకాదశి వ్రతం కథ
పూర్వం చిత్రసేనుడు అనే రాజు ఉండేవాడు. అతని రాజ్యంలో ఏకాదశి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండేవారు. ఒకరోజు రాజు ఏకాదశి రోజు అడవిలో వేటకు వెళ్ళాడు. అక్కడ కొందరు బందిపోట్లు రాజును చుట్టుముడతారు. ఆయుధాలతో రాజుపై దాడి చేస్తారు. కానీ దైవ అనుగ్రహం వల్ల ఆయుధాలు పూలగా మారిపోతాయి.
బందిపోట్ల సంఖ్య ఎక్కువ కావడం, దీంతో పాటు రాజు ఉపవాసం ఉండటం వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు రాజు శరీరం నుంచి ఒక దివ్య శక్తి ఆవిర్భవించి రాక్షసులందరినీ సంహరించి కనిపించకుండా పోతుంది. రాజు స్పృహలోకి వచ్చిన తర్వాత రాక్షసులందరూ చనిపోయి కనిపిస్తారు. వాళ్ళని చూసి దొంగలని ఎవరు చంపారు అని ఆశ్చర్యపోతాడు.అప్పుడు ఆకాశం నుంచి ఒక దివ్యమైన వెలుగు వచ్చి ఓ రాజా! మీరు అమలక ఏకాదశి నాడు ఉపవాసం ఉండడంతో దైవానుగ్రహంతో రాక్షసులందరూ హతమయ్యారు. మీ శరీరం నుంచి వైష్ణవ శక్తి ప్రత్యక్షమై రాక్షసులను సంహరించి మళ్లీ మీ శరీరంలోకి ప్రవేశించిందని చెబుతుంది. రాజ్యానికి తిరిగి వచ్చిన రాజు అందరికీ ఏకాదశి ప్రాముఖ్యత చెప్పాడు.