ఫోన్ లేకుండా జనాలు ఇప్పుడు ఒక్క సెకను కూడా ఉండలేకపోతున్నారు. 99 శాతం మంది ఫోన్ ను పక్కన పెట్టుకొనే పడుకుంటున్నారు. సహజంగా మధ్య రాత్రిలో ఒకటి రెండు సార్లు మెలుకువ వస్తుంది. అప్పుడు కూడా ఫోన్ ను వదలిపెట్టడం లేదు.ఇలా మొబైల్ ఫోన్ తలగడ పక్కన పెట్టుకుని పడుకుంటే ఎన్నో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. సెల్ ఫోన్ వాడటం వల్ల మానసిక, శారీరక సమస్యలు వస్తున్నాయి. మొబైల్ ఫోన్ వాడడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారింది. చాలా మందికి చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే ఏమి తోచదు. పడుకునే ముందు మొబైల్ ఫోన్ పక్కనే పెట్టుకొని నిద్రపోతే అనేక ఆరోగ్య సమస్యలకు మీకు మీరే స్వాగతం పలికినట్టేనని వైద్యలు చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు మొబైల్ ఫోన్ చూడకూడదు. ఫోన్ నుంచి వచ్చే నీలికాంతి నిద్ర రాకుండా అడ్డుకుంటుంది. అలాగే మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని వల్ల నిద్రలేమి సమస్య రావచ్చు. మొబైల్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ విడుదల చేస్తూ ఉంటుంది. ఈ రేడియేషన్ క్యాన్సర్ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరిస్తోంది. అందుకే మొబైల్ ఫోన్ దగ్గరలో పెట్టుకోకండి. ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు తలకు దగ్గరగా మొబైల్ ఫోన్ ఉంచకండి.
మొబైల్ ఫోన్ తల పక్కనే పెట్టుకొని పడుకోవడం వల్ల నిద్ర నాణ్యత కూడా తగ్గిపోతుంది. దీంతో ఇతరుల సాధారణ విషయాలు కూడా సరిగా అర్ధం కావు. ఇదిలా ఉంటే మొబైల్ ఫోన్లు పేలుతున్న సంఘటనలు కూడా చాలానే జరుగుతున్నాయి. మొబైల్ ఫోన్ తల పక్కనే పెట్టుకొని పడుకోవడం వల్ల పేలితే పెద్ద ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఫోన్ దూరంగా పెట్టుకుని పడుకోవాలి.
మొబైల్ ఎక్కువగా వాడడం వల్ల కళ్ళకు సంబంధించిన అనేక సమస్యలు వస్తున్నాయి. దృష్టి కూడా మసకబారుతుంది. సెల్‌ఫోన్ నుంచి వచ్చే లైటింగ్ వల్ల కంటి చూపు దెబ్బతింటుందని డాక్టర్లు చెబుతున్నారు. నిద్ర సరిగా నిద్రపట్టక కంటి నరాలు కూడా దెబ్బతింటాయి. మెడ నొప్పులు నడుము నొప్పి రావడం మొదలవుతాయి. కాబట్టి వీలైనంత వరకు మొబైల్ కు దూరంగా ఉంటే మంచిది.
మొబైల్ ఫోన్ లో గంటల తరబడి మాట్లాడితే క్యాన్సర్ తో సహవాసం చేసినట్లే. అయితే పదేళ్లు మొబైల్ ఫోన్ అధికంగా వాడితే యుక్త వయస్సులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఐదు రెట్లు ఎక్కువగా ఉంటాయని స్వీడన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మెదడులో కణాలు పెరిగి ప్రాణాంతకమైన గ్లియోమా అనే కణితులు ఏర్పడి మెదడు క్యాన్సర్ కు దారితీస్తాయని తెలిపారు. అంతే కాకుండా క్యాన్సర్ కణాలు ఉత్పత్తి కావడానికి రేడియేషన్ ప్రేరేపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో భాగమైన ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ వెల్లడించింది.
మొబైల్ వాడకం పెరిగిన కొద్దీ జీవన నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఏ క్షణంలో మొబైల్ మోగుతుందో అన్న భయంలో కొందరు నిద్ర పోతుంటారు . వేరే శబ్దాలకు కూడా మొబైల్ రింగ్ అనుకొని నిద్ర లేస్తుంటారు. దీని వల్ల నిద్ర తగ్గుతుంది.
చిన్న పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్లు వాడడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారు. గేమ్స్ ఆడటం, పాటలు వినడం కోసం సెల్ ఫోన్లను ఎక్కువ వాడుతున్నారు. తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సెల్‌ఫోన్లు దూరంగా ఉంచాలి. సెల్ ఫోన్ రిసీవ్ చేసుకునే సిగ్నల్స్ ,రేడియో ధార్మికత వల్ల చిన్నపిల్లలకు మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.