ముడా కేసులో సిద్ధరామయ్యకు ..హైకోర్టులో తాత్కాలిక ఊరట

  • ఆయనపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవద్దు
  • కర్నాటక హైకోర్టు ఆదేశాలు.. విచారణ 29కి వాయిదా

బెంగళూరు: మైసూర్​ అర్బన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ (ముడా) కేసులో కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు తాత్కాలిక ఊరట లభించింది. ఈ కేసులో సిద్ధరామయ్యను విచారించాలంటూ గవర్నర్​ థావర్​చంద్​ గెహ్లాట్​ ఇచ్చిన ఆదేశాలపై ఆయన సోమవారం కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సిద్ధరామయ్యపై ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29కి విచారణను వాయిదా వేసింది. అప్పటి వరకు కోర్టు ఆర్డర్స్​ అమలులో ఉండనున్నాయి.  సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం ముడా సేకరించిందని, దీనికి ప్రతిఫలంగా ఖరీదైన స్థలాలను సిద్ధరామయ్య ఫ్యామిలీ దక్కించుకుందన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణ జరపాలంటూ బీజేపీ సహా ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్​ ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలను సవాల్​ చేస్తూ  సీఎం సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించగా తాత్కాలిక ఊరట లభించింది. 

గవర్నర్, బీజేపీ, జేడీఎస్ కుట్ర: సిద్ధరామయ్య

తన జీవితం తెరిచిన పుస్తకమని, తాను ఎలాంటి తప్పు చేయలేదని కర్నాటక సీఎం సిద్ధరామయ్య​అన్నారు. ‘‘నాకు న్యాయవ్యవస్థపై  పూర్తి నమ్మకం ఉంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఇన్నేండ్ల నా రాజకీయ జీవితంతో ఒక్క మచ్చ కూడా లేదు.  రాజ్​భవన్, బీజేపీ, జేడీఎస్​ కలిసి నాపై కుట్ర చేస్తున్నాయి. నా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినా భయపడను” అని ఆయన మీడియాతో చెప్పారు. గవర్నర్​ ఇచ్చిన ఆదేశాల వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని, దీనిపై లీగల్​గా పోరాటం చేస్తానని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.