షట్టర్లు నిర్మించారు.. వదిలేశారు

  • దుకాణాల కేటాయింపులో బల్దియా ఆఫీసర్ల నిర్లక్ష్యం ఏడాదిన్నరగా ఖాళీగానే 
  • 151 షెట్టర్లు స్ట్రీట్ వెండర్ల నుంచి మార్చిలో 1092 అప్లికేషన్లు స్వీకరణ

కరీంనగర్, వెలుగు: స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన షటర్లు నిరుపయోగంగా మారాయి. షట్టర్ల కేటాయింపు కోసం మార్చిలో అప్లికేషన్లు స్వీకరించడం, లబ్ధిదారుల జాబితాలో స్ట్రీట్ వెండర్లు కానివారి పేర్లు చేర్చడంతో ఈ వ్యవహారం అప్పట్లో కోర్టుకు చేరింది. అర్హులకే షట్టర్లు కేటాయించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ లబ్ధిదారులను సెలక్ట్ చేయడంలో మున్సిపల్ ఆఫీసర్లు కాలయాపన చేస్తున్నారు. దీంతో అర్హులైన స్ట్రీట్ వెండర్లకు నెలల తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. 

అప్లికేషన్లు స్వీకరించి వదిలేశారు..స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ సిటీలో ఫుట్ పాత్ వ్యాపారాన్ని  స్ట్రీమ్ లైన్ చేసేందుకు బల్దియా ఆధ్వర్యంలో కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ప్రహరీకి ఆనుకుని రేకుల కప్పుతో 126 షటర్లు, శాతవాహన యూనివర్సిటీ ఏరియాలో మరో 25 షటర్లు నిర్మించారు. ఈ షాపులను కేటాయించేందుకు మార్చిలో రూ.1000 డీడీతో అప్లికేషన్లు స్వీకరించగా.. సివిల్ హాస్పిటల్ ఏరియా షట్టర్ల కోసం 797, శాతవాహన యూనివర్సిటీలోని షట్టర్ల కోసం 295 కలిపి మొత్తం 1092 అప్లికేషన్లు అందాయి. 

దరఖాస్తులు భారీగా రావడంతో మున్సిపల్ ఆఫీసర్లు ఫీల్డ్ సర్వే నిర్వహించి జాబితా రూపొందించారు. కాగా ఇందులో రాజకీయ పలుకుబడితో స్ట్రీట్ వెండర్లు కాని వ్యక్తుల పేర్లు చేర్చారని, దీంతో అర్హులకు అన్యాయం జరిగే ప్రమాదముందని 75 మంది కోర్టును ఆశ్రయించగా అర్హులకే దుకాణాలు కేటాయించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో కోర్టుకు వెళ్లినవారి వివరాలను విచారించగా.. వారిలో 39 మంది అర్హులను గుర్తించినట్లు తెలిసింది. 

వీళ్లకు తొలుత షట్టర్లు కేటాయించాక, మిగతా 112 షట్టర్లకు లాటరీ ద్వారా రిజర్వేషన్ ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. జనరల్ కోటాతోపాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు లు, నాయీబ్రాహ్మణులు, వాషర్ మన్ కోఆపరేటివ్ సొసైటీలు, స్వయం సహాయక సంఘాల వారికి రిజర్వేషన్ ప్రకారం షాపులు కేటాయించాల్సి ఉంది. మున్సిపల్ ఆఫీసర్లు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్ట్రీట్ వెండర్లు నిరాశకు లోనవుతున్నారు.

షట్టర్లకు ఫుల్ డిమాండ్..  

బల్దియా పరిధిలో ప్రైమ్ ఏరియాల్లో నిర్మించిన 151 షటర్లకు ఫుల్ డిమాండ్ ఉంది. అందుకే 1092 దరఖాస్తులు వచ్చాయి. ఇదే అదనుగా కొందరు దళారులు రంగంలోకి దిగి షాపులు ఇప్పిస్తామని రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో తమకు షట్టర్ దక్కుతుందో లేదోనని అర్హులైన స్ట్రీట్ వెండర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుదారుల సమక్షంలో లాటరీ ద్వారా పేర్లు తీసి షట్టర్లు కేటాయిస్తే తప్ప.. ఈ అనుమానాలకు తెరపడేటట్లు లేదు.