ఎయిర్పోర్ట్ రన్వేపై పాము, 3 ముంగిసల పంచాయితీ.. వీడియో వైరల్

పాట్నా: బీహార్ రాష్ట్ర రాజధాని నగరం పాట్నాలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. పాట్నా ఎయిర్పోర్ట్ రన్వేపై పాము, 3 ముంగిసల నడుమ పంచాయితీ నడిచింది. ఈ రసవత్తర పోరుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. తొలుత ఒక పాము, ఒక ముంగిస మధ్య పోరులా కనిపించినప్పటికీ మరో రెండు ముంగిసలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఈ కొట్లాట మరింత రంజుగా కనిపించింది. అసలు పాము, ముంగిస బద్ధ శత్రువులుగా ఎందుకు మారాయనే ప్రశ్నకు సింపుల్ ఆన్సర్.. జాతి వైరం. అన్ని జాతుల ముంగిసలు పాములను తింటాయి, కానీ సన్నని ముంగిస మరియు బూడిద రంగు ముంగిస కింగ్ కోబ్రాతో కూడా పోరాడి వాటినే ఆహారంగా మింగేయగలుగుతాయి.

 

ముంగిస ఎదురు పడితే పాము తప్పించుకొని పారిపోయి ప్రాణం కాపాడుకోడానికే ప్రయత్నం చేస్తుంది. అంతేతప్ప.. ముంగిసను ఆహారంగా తినగలిగేంత పరిస్థితి పాముకు లేదు.  కానీ ముంగిస పామును చంపి తినే ప్రయత్నం చేస్తుంది. వీటిది ఎప్పటి నుంచో జాతి వైరం. పాముకు, ముంగిసకు అస్సలు పడదు. ఒకటి మరొక దానిని విపరీతంగా ద్వేషిస్తాయి. అంతు చూసే దాకా వదలవు. పామైనా చావాలి లేదా ముంగిసైనా చావాలి. అంత పంతంగా కొట్లాడుకుంటాయి. ఒకటి గెలిస్తే మరొకటి చనిపోతుంది. కాకపోతే ముంగిస తన చిత్రవిచిత్రమైన కదలికలతో పాము కాటు నుంచి తప్పించుకొని చంపే ప్రయత్నం చేస్తుంది. పాము తన కాటుతో ముంగిసను చంపేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ పోరులో కొన్నిసార్లు ముంగిస, ఇంకొన్ని సార్లు పాము గెలుస్తుంటుంది.