Health News: సమ్మర్​ సీజన్​.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతి...

 ఎండలు మండిపోతున్నాయి. . ఎండాకాలం ఎవరైనా జాగ్రత్తగానే వుండాలి. పిల్లల్ని, వృద్దులను  మరింత జాగ్రత్తగా చూసుకోవాలి. వడ దెబ్బతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అంతే కాదు కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉందట.  అలా కాకుండా వేసవి ఆనందంగా గడపాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  ఇప్పుడు ఆ జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. . 

ఎండాకాలం పిల్లల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ముందు తెలుసుకోవాలి. ఉష్ణోగ్రత పెరిగితే బయట వాతావరణం చాలా వేడిగా వుంటే పిల్లల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దాన్ని నియంత్రించే కేంద్రం పిల్లల మెదడులో చాలా బలహీనంగా వుటుంది. అందుకని వడదెబ్బ తగిలే అవకాశం వారిలో ఎక్కువ. పిల్లల చర్మం వైశాల్యం ఎక్కువగా వుండటం వల్ల వారి వంట్లో నీరు వేగంగా ఆవిరై పోవచ్చు. అలా కూడా వారికి వడదెబ్బ తగలవచ్చు. తలనొప్పి కూడా రావచ్చు. ముఖ్యంగా ఆరేళ్ళ లోపు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి ఫిట్స్ ‌వచ్చే అవకాశాలు ఎక్కువ.అధిక ఉష్ణోగ్రత, కలుషిత నీరు, ఆహారం వలన వేడి అధిగమించడానికి తీసుకునే శీతల పానీయాల వల్ల పిల్లలు ఈ కాలంలో జబ్బుపడుతూ వుంటారు.

ఎండలో ఎక్కువ సేపు గడపాల్సి వస్తే మాత్రం ఈ జాగ్రత్తలని పాటించండి. ఎక్కువగా చెమట పట్టే వాళ్లు రోజుకు రెండుసార్లు స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు తేమ కలిగిన సబ్బులకు బదులు వేప ఔషధాలు కలిగిన సబ్బులను ఉపయోగిస్తే చెమట దుర్వాసన మాయం చేయవచ్చు. ఎండాకాలంలో సింథటిక్‌ ‌వస్త్రాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. నూలు దుస్తులను ధరించడం శ్రేయస్కరం. నూనె పదార్థాలు, వేపుళ్లు, కారం, మసాలాలను వీలైనంత వరకు తగ్గించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు మాంసాహారాన్ని తీసుకోకపోవడం మంచిది. పీచు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. 

ఆలివ్‌ ఆయిల్‌ ఆరోగ్యానికి మంచిది. అంతేగాకా చాలా సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల ఈ కాలం వంటకాల్లో ఆలివ్‌ ఆయిల్‌ ఉపయోగించడం మంచిది.  చర్మంపై పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చెమట పొక్కులు రావచ్చు. ఆ పొక్కులు ఇన్‌ఫెక్షన్‌తో సెగగడ్డలుగా మారవచ్చు. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఆ చీము నెత్తురు గడ్డల వల్ల నొప్పి, జ్వరం తీవ్రతరం కావచ్చు. ఒకోసారి ముక్కు నుంచి రక్తం కారవచ్చు (ఎపిస్టాక్సిస్‌).

‌నీరు ఆహారం కలుషితమైతే… కలరా, టైఫాయిడ్‌, ‌కామెర్ల వంటి వ్యాధులు వ్యాపించవచ్చు. ఎండాకాలం కళ్ళ కలక వేగంగా వ్యాపిస్తుంది. దుమ్మూధూళి వల్ల, వేడి వల్ల కంటి ఇన్‌ఫెక్షన్‌ ‌త్వరగా పాకిపోతుంది. ఒకోసారి చూపు మందగించి, రెటినాపై కూడా ప్రభావం చూపవచ్చు.గవద బిళ్ళలు, పొంగు, హైపటైటిస్‌ ‘ఎ’ ‌కూడా ఎండాకాలం వ్యాపిస్తాయి.  కలుషితమైన నీరు తాగడం వల్ల అతిసార, టైఫాయిడ్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే శుభ్రమైన నీరు, ఆహారం తీసుకోవడం మంచిది.  ఈ ఎండాకాలంలో నీటి కొరత కారణంగా  కాలుష్యానికి గురై అవకాశం ఉంటుంది.ఎండకాలం ఉప్పు తగ్గించడం మంచిది. ఉప్పు ఎక్కువగా వాడితే బీపీ పెరుగుతుంది. అలాగే కిడ్నీలపై కూడా ప్రభావం చూపుతుంది. అలాగే ఎండకాలం త్వరగా జీర్ణ అయ్యే పదార్థలు తీసుకోవాలి. ఎక్కువగా ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి.

చాలామంది ఎండాకాలం శీతలపానీయాలు తాకుంటారు. వీటికి బదులు కొబ్బరి బొండం, చెరుకు రసం తాగడం మంచిది. ముఖ్యంగా ఎండకాలం నీరు ఎక్కువగా తాగాలి లేకుంటే డిహైడ్రెషన్ సమస్య రావొచ్చు. ఎండకాలం ఎక్కువగా చెమట పడుతుంది. దీంతో శరీరంలో నీరు తగ్గుతుంది. దీని వల్ల కిడ్నీల సమస్యలు వచ్చే అవకాసం ఉంటుంది. నీటిశాతం తగ్గటం ఎక్కువసేపు కొనసాగితే ఆకస్మికంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే నీటిని తాగాలని సూచిస్తున్నారు.

ఎండా కాలం పిల్లలను ఎండలో ఎక్కువగా ఆడుకొనివ్వద్దని సూచిస్తున్నారు. ఆఫీస్ లకు వెళ్లేవారు ఉదయం 10 గంటలలోపు వెళ్లాలని.. ఇంటికి వచ్చే వారు సాయంత్రం 4 గంటల తర్వాత రావాలని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే చెవులకు వడ గాలి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలని చూస్తున్నారు. ఎండా కాలం నూనె పదార్థలు ఎక్కువగా తినకుండా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే దోసకాయ, వాటర్ మిలన్, ఇతర పండ్లు తినాలని సూచిస్తున్నారు