నాసిరకం మందులతో తగ్గుతున్న ఆయుష్షు

నాసిరకం మందుల తయారీ, ఎగుమతులపై భారతదేశం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.  ప్రపంచ ఔషధశాలగా మన దేశానికి మంచిపేరు ఉంది. కానీ, కొన్ని ఔషధ సంస్థల అత్యాశ దేశ ప్రతిష్ఠను మసకబారేలా చేస్తోంది. ఇటీవలి కాలంలో సంభవించిన పరిణామాలు ఈ దుస్థితికి అద్దం పడుతున్నాయి. ఔషధ ఉత్పత్తుల నాణ్యతను ప్రశ్నించేలా చేశాయి. ఏకంగా 4.10 లక్షల కోట్ల రూపాయల విలువైన మందుల ఉత్పత్తులు నాసిరకం అని తేలడంతో మన  ఔషధ రంగానికి ఎప్పుడూ లేనంత చెడ్డపేరు వచ్చింది. 2021లో ఉజ్బెకిస్తాన్, జాంబియా దేశాల్లో భారతీయ కంపెనీలు అమ్మిన దగ్గు మందు అనేకమంది చిన్నారుల మృతికి కారణం అయింది.

ఆ రెండు దేశాల్లో  మొత్తంగా 88 మంది మరణించారు. వీరిలో జాంబియా ఆరోగ్యశాఖ మంత్రి బంధువులు కూడా ఉండటం చర్చకు దారితీసింది.  ప్రపంచ దేశాలకు 60 శాతం మేర టీకాలను, 20 శాతం జనరిక్ మందులను మనదేశమే సరఫరా చేస్తోంది.  ఇవి ఎక్కువగా ఉత్తర అమెరికా ఖండానికి ఎగుమతి అవుతాయి. ఆ తర్వాత స్థానాల్లో ఆఫ్రికా, ఐరోపా సమాఖ్య ఉన్నాయి. ఆఫ్రికా దేశాలకు అవసరమైన జనరిక్ మందుల్లో సగభాగం భారత్​ నుంచే ఎగుమతి అవుతున్నాయి.

ఫార్మా రంగంపై మాయని మచ్చ

ఆఫ్రికా మార్కెట్లో ఇప్పుడు భారతీయ ఔషధాల నాణ్యత మీద నకిలీ మరక పడటం ఫార్మా రంగంపై మాయని మచ్చగా మారింది. అమెరికా సైతం భారతదేశం తయారుచేసే ఔషధాల మీద ఆధారపడుతున్నది. మంచి మార్కెట్ కూడా ఉంది.  అయితే,  విమర్శలను,  ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని భారతీయ మందులను మార్కెట్ నుంచి తరచూ ఉపసంహరించుకుంటోంది. కొవిడ్ మహమ్మారి తాండవం చేస్తూ ఉన్న సమయంలో చాలా సంస్థలు భారత్ నుంచి రెమిడిసివర్ ఔషధాలను విదేశాలకు ఎగుమతి చేశాయి. ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఈ మందు మీద విపరీతమైన చర్చ జరిగింది. చివరికి దాని వల్ల కొవిడ్ తగ్గకపోగా మరింత ప్రమాదం తెచ్చిపెట్టే అవకాశం ఉందని గ్రహించి అకస్మాత్తుగా దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ లోగానే బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకోవడం వంటి సంఘటనలు జరిగిపోయాయి.  భారత్ లో  ఔషధ తయారీ సంస్థలు వేల సంఖ్యలో ఉన్నాయి.  వీటిలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలే ఎక్కువ.  అరవై శాతం మందులు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంటాయి. చాలా వాటికి సరైన చిరునామా కూడా ఉండదు. నకిలీ మందుల ఉత్పత్తులు,ఎగుమతులు ఇలాంటి కంపెనీల వల్లే సాధ్యమవుతాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.

కాంగ్రెస్ ​సర్కారు దిద్దుబాటు చర్యలు

తెలంగాణ రాష్ట్రంలో నకిలీ మందుల తయారీకిగానీ, విక్రయానికి గానీ అవకాశం లేకుండా చూడాలని , అలాంటి సంఘటనలు ఎదురైతే ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే  సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. మందుల దుకాణాల్లో నాణ్యమైన ఔషధాలు మాత్రమే విక్రయించేలా చూడాలన్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రధాన విధిగా ఔషధ నియంత్రణ మండలి వ్యవహరించాలని సూచించారు. కాగా ఇటీవల ముఠాగా ఏర్పడి నకిలీ మందులు తయారు చేస్తున్న స్థావరం మీద తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి అధికారులు దాడి చేసి రూ.33 లక్షల విలువైన మందులను సీజ్ చేశారు.  నకిలీల కారణంగా ఎంతోమంది ఆర్థికంగాను, ఆరోగ్యపరంగానూ నష్ట పోతున్నారు. అంతేకాకుండా ప్రాణాంతక సమస్యలు వస్తున్నాయి.  కాగా,  ప్రపంచంలో అమ్ముడవుతున్న కల్తీ మందుల్లో 35 శాతం ఇండియా నుంచి ఎగుమతి అయినవేనని భారత వాణిజ్య పరిశ్రమల సమాఖ్య 2007 లోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది.  నకిలీల బెడద అటు జనరిక్ లోనూ, బ్రాండెడ్ మందులలోనూ తప్పడం లేదు. కాంగ్రెస్​ సర్కార్​ మరింత అప్రమత్తంగా వ్యవహరించి నకిలీ మందులను అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలి.

నకిలీ మందులతో కొత్త సమస్యలు

ఆరోగ్య సంరక్షణకు వాడే మందులు నకిలీ మందులు అయితే వ్యాధి తగ్గకపోగా కొత్త సమస్యలు శరీరంలో తలెత్తుతాయి. వ్యాధి మరింత ముదురుతుంది. నకిలీ మందుల తయారీలో వాడే రసాయనాల వల్ల తీవ్ర నష్టం తప్పదు. దీంతో  ఔషధాల మీద, వీటి తయారీ సంస్థల పైనా నమ్మకం తగ్గిపోతుంది. చివరికి ఆ మందులను సిఫారసు చేసే వైద్యులు, ఆస్పత్రుల మీద మంచి అభిప్రాయం ఉండదు.  ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి మందుల తయారీలో కూడా కల్తీ జరగటం ఆందోళన కలిగించే అంశమే. కచ్చితమైన నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఉత్పత్తి అయిన నకిలీ మందులు కేన్సర్ రోగులకు తీవ్ర ముప్పును కలిగిస్తాయి. ఈ మందులు తరచుగా తప్పుడు మోతాదులు కలిగి ఉంటాయి. ఇలాంటి మందులు వాడితే చికిత్స ఫలితం దక్కదు సరికదా ప్రతికూల పరిణామాలకు దారితీయవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎవరికివారు క్రియాశీల పాత్ర పోషించడం చాలా ముఖ్యం.  విస్తృతంగా తయారవుతున్న నాసిరకం మందులు ఆరోగ్యానికి ముప్పును కలిగిస్తాయి.  నాణ్యత లేని మందులు ఇప్పటికే  కోకొల్లలుగా ఔషధ మార్కెట్లోకి చేరుతున్నాయి.  ప్రజా ఆరోగ్య సంక్షోభానికి నకిలీ మందులు దారితీస్తాయి.

జి. యోగేశ్వరరావు
సీనియర్ జర్నలిస్టు