కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగుల కొరత తీరేనా?

  • గోదామ్​లో అగ్నిప్రమాదంతో ఆందోళనలో రైతులు

వనపర్తి, వెలుగు: జిల్లాలో ఏర్పాటు చేస్తున్న వడ్ల కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాలకు గన్నీ బ్యాగుల కొరత పొంచి ఉంది.  పెబ్బేరు వ్యవసాయ మార్కెట్​ యార్డ్​ గోదామ్​లో నిల్వ ఉంచిన 13 లక్షల గన్నీ బ్యాగుల్లో దాదాపు ఏడు లక్షల బ్యాగులు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి సరైన లెక్కలు లేవు. మిగిలిన బ్యాగులు ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. ప్రస్తుతం యాసంగిలో పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు సెంటర్లను ఓపెన్​ చేస్తున్నారు. రైతులు తమ వడ్లను సంచుల్లో తీసుకొచ్చి కేంద్రాల వద్ద కుప్పలుగా పోస్తున్నారు. అక్కడి నుంచి మిల్లులకు తరలించేందుకు సివిల్​ సప్లై ఆఫీసర్లే గన్నీ బ్యాగులను సమకూర్చాల్సి ఉంది. 

230 కేంద్రాలు ఓపెన్..​

జిల్లాలో ఈ యాసంగిలో వరి పంట తక్కువగానే పండింది. ప్రతిసారి లక్ష ఎకరాలకు పైగానే సాగయ్యేది. ఈ సారి లక్ష ఎకరాలు కూడా సాగవ్వలేదు. ఇక కొన్నిచోట్ల సాగునీరు అందక పంటను పశువులకు వదిలేశారు. బోరుబావులు ఇతర వనరులున్న చోట సాగు చేశారు. 89 వేల ఎకరాల్లో వరి సాగయినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 2 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. వీటిని కొనుగోలు చేసేందుకు వనపర్తి జిల్లాలోని 14 మండలాల్లో 244 సెంటర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్​ తేజస్​ నందలాల్​ పవార్​ ఆదేశించారు. ఈ నెల 2 నుంచే  కేంద్రాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 230 కేంద్రాలు ఓపెన్​ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.  

20 లక్షల గన్నీ బ్యాగులు కావాలి..

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన వడ్లను రైస్​ మిల్లులకు తరలించేందుకు గన్నీ బ్యాగులు అవసరం. ఒక్కో బ్యాగులో 40 కిలోలు, తాలు ఉంటే 35 కిలోల వడ్లు నింపుతారు. 2 లక్షల మెట్రిక్​ టన్నుల దిగుబడి వచ్చినా, కొనుగోలు కేంద్రాల్లో లక్ష మెట్రిక్​ టన్నులు కొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన వడ్లను రైస్​ మిల్లులకు తరలించేందుకు 20 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉంటుంది. పెబ్బేరు నిల్వ కేంద్రంలోని గన్నీబ్యాగుల మాయం కావడం, కొన్ని కాలిపోయిన నేపథ్యంలో సేకరించిన వడ్లను ఎలా తరలిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

బ్యాగుల కొరత లేదు..

కొనుగోలు కేంద్రాల్లో వడ్ల తూకాలు వేగంగా జరుగుతున్నాయి. వడ్లను మిల్లులకు తరలించేందుకు అవసరం మేర గన్నీ బ్యాగులు ఉన్నాయి. గన్నీ బ్యాగుల కోసం ఇప్పటికే సివిల్​ సప్లై స్టేట్​ ఆఫీసర్లకు ప్రపోజల్స్​ పంపించాం. 42 లక్షల బ్యాగుల వరకు సిద్ధంగా ఉంచాం.

నగేశ్, అడిషనల్​ కలెక్టర్, వనపర్తి