బ్లడ్​ బ్యాంకుల్లో నిల్వల్లేవు

  • సర్కారు బ్లడ్​ బ్యాంకులో తీవ్ర కొరత
  • పెరిగిన డెంగ్యూ కేసులు
  • బ్లడ్​డోనర్ల కోసం ఎదురు చూపులు
  • పరిస్థితులను క్యాష్​ చేసుకుంటున్న ప్రైవేట్​బ్లడ్​ బ్యాంకులు  

నిజామాబాద్​ జిల్లాలో రక్తం నిల్వల కొరత ఆందోళన కలిగిస్తోంది.  రోడ్డు ​యాక్సిడెంట్లు, డెలివరీలు, కొన్ని ఆపరేషన్ లు​చేసే సమయంలో రోగులకు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది.  బ్లడ్​ నిల్వల కొరత వేధిస్తుండటంతో ప్రభుత్వ డాక్టర్లు  ఆపసోపాలు పడుతున్నారు.  తాజాగా  వందల సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతుండగా ప్లేట్​లెట్స్​ కోసం బ్లడ్​ అవసరమవుతోంది. దీంతో ప్రైవేటు బ్లడ్​ బ్యాంకులు భారీ బిజినెస్​కు తెరలేపాయి. 

నిజామాబాద్​, వెలుగు:  నిజామాబాద్​లో మెడికల్​ కాలేజీకి అనుబంధంగా జీజీహెచ్​ హాస్పిటల్​ఏర్పడ్డాక ఇక్కడి జిల్లా హాస్పిటల్​ను బోధన్​కు షిష్ట్​ చేశారు. ఈ రెండు చోట్ల బ్లడ్​ బ్యాంకులున్నాయి. సీజనల్​ వ్యాధుల కారణంగా జీజీహెచ్​ లో ప్రతీ రోజు ఓపీ 2,500 దాటుతోంది. వైరల్​ జ్వరాలతో పాటు డెంగ్యూ బాధితులు ట్రీట్​మెంట్​ కోసం అడ్మిట్​ అవుతున్నారు.

గత నెలలో అత్యధికంగా 249 డెంగ్యూ కేసులు నమోదుకాగా, ఈ నెలలో ఇప్పటికి వంద దాటాయి. హాస్సిటల్​లోని బ్లడ్​ బ్యాంకులో 300 యూనిట్ల రక్త నిలువలు మాత్రమే మెయింటెయిన్​ చేస్తున్నారు.  సాధారణంగా ప్రతీ రోజు పది యూనిట్లను డెలివరీలు, యాక్సిడెంట్లు,  ఆపరేషన్​ల కోసం వాడుతుంటారు. సర్కారు హాస్పిటల్​కు వచ్చేవారిలో ఎక్కువగా గ్రామీణ  ప్రజలే ఉంటారు.

వారికి రక్తదానంపై అవగాహన లేకపోవడంతో  దవాఖానాలో ట్రీట్​మెంట్​ కోసం అడ్మిట్​ చేసిన తమ వారి బ్లడ్​ అవసరాలకు సర్కారు ఏర్పాట్లపైనే ఆధారపడుతున్నారు. ఇప్పుడు డెంగ్యూ పీడితుల సంఖ్య పెరగడంతో ప్లేట్​లెట్ల కోసం రోజు అదనంగా మరో ఐదు యూనిట్ల ​ వినియోగం పెరిగింది. వెరసి డిమాండ్​కు సరిపడా   రక్తం నిల్వలు లేక వలంటరీ డోనర్ల కోసం దిక్కులు చూడాల్సివస్తోంది.  బోధన్​ హాస్పిటల్​లోని బ్లడ్​ బ్యాంకు నిర్వహణ  తూతూ మంత్రంగా  జరుగుతోంది. 

రెడ్​ క్రాస్​లో తలసేమియా వార్డు

జిల్లా కేంద్రంలోని రెడ్​క్రాస్​లో 400 యూనిట్ల రక్తం నిల్వలు మెయింటెయిన్​ చేస్తున్నారు. అక్కడ తలసేమియా బాధితుల కోసం ప్రతి మంగళ, శుక్రవారాలలో ఉచితంగా రక్తం ఎక్కిస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన వార్డుకు రక్తం ఎక్కించే రోజు 30కి తక్కువ కాకుండా బాధితులు వస్తున్నారు. ప్రైవేట్​ హాస్పిటల్స్​ నుంచి ఎవరైనా ఒక యూనిట్​ బ్లడ్​ కోసం వస్తే ప్రతిగా మరో యూనిట్​బ్లడ్​ సేకరిస్తున్నారు. 

ప్రైవేట్​ బ్యాంకుల దోపిడీ

ప్రభుత్వ​ బ్లడ్​ బ్యాంకులు, రెడ్​క్రాస్​ సంస్థ పరిస్థితి ఇలా ఉండగా, నిజామాబాద్​లోని నాలుగు బ్లడ్​ బ్యాంకులు బిజినెస్​ చేస్తున్నాయి.  ఆటోరిక్షా డ్రైవర్లు, కూలీ అడ్డా లేబర్లకు రూ.300 చెల్లించి యూనిట్​ బ్లడ్​ సేకరిస్తున్నారు. వాటిని రూ.3 వేల నుంచి రూ.5 వేలకు ప్రైవేట్​ హాస్పిటల్స్​కు అమ్ముతున్నారు. నెగిటివ్​ బ్లడ్​ గ్రూప్ లైతే రూ.10 వేల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. 

రక్తదాన క్యాంప్​లకు ప్లాన్

రక్తం అవసరాలు ఎప్పుడూ  స్థిరంగా ఉండవు.  బ్లడ్​ బ్యాంక్​లో ఉన్న నిల్వలను జాగ్రత్తగా వాడుతూ కొరత పెరగకుండా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం.  దాతల నుంచి రక్తం సేకరించడానికి క్యాంపులు నిర్వహణకు  ప్లాన్​ చేస్తున్నం.  దాతలు అధిక సంఖ్యలో ముందుకురావాలి.  

‌‌డాక్టర్​ ప్రతిమారాజ్, జీజీహెచ్, సూపరింటిండెంట్​