వీసీ ఎంపికకు షార్ట్​ లిస్ట్​ రెడీ .. త్వరలో పేరు అనౌన్స్​మెంట్

  • ఆఫీసును​ సిద్ధం చేస్తున్న ఆఫీసర్లు​ 
  • వీసీ పోస్టుకు 133 మంది దరఖాస్తు

​నిజామాబాద్,  వెలుగు: తెలంగాణ వర్సిటీ వీసీగా అపాయింట్​అయ్యేందుకు అర్హతగల ముగ్గురి పేర్లతో కూడిన షార్ట్​ లిస్టు తయారైంది.  దసరా పండగ వేళ ఏ క్షణంలోనైనా వీసీ పేరు ప్రకటించే అవకాశం ఉందని తెలియడంతో  వర్సిటీలో హడావిడి మొదలైంది. రూ.2 కోట్లతో నిర్మించిన వీసీ బంగ్లా, ఆఫీస్​ను సిద్ధం చేస్తున్నారు. కారును సిద్ధం చేశారు.  

భారీ వడపోత

టీయూ వీసీగా పనిచేసిన రవీందర్​గుప్తా గత ఏడాది జూన్ లో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడి జైలుకు వెళ్లారు. దీంతో ఐఏఎస్​లను ఇన్​చార్జి​లుగా నియమించి పాలనసాగిస్తున్నారు. జనవరిలో పోస్టు భర్తీ చేయడానికి ప్రభుత్వం​ నోటిఫికేషన్​ జారీ చేయగా, మొత్తం 133 దరఖాస్తులు అందాయి. 
నిబద్ధతగల వ్యక్తిని టీయూకు వీసీగా అపాయింట్​ చేయడానికి సర్కారు భారీ కసరత్తు చేసింది. ప్రొఫెసర్​గా పదేండ్ల అనుభవంతో పాటు 70 ఏళ్లలోపు గల వారినే వీసీగా నియమించాలి. 

అయితే పాలనపరమైన అనుభవం, అకడమిక్​ క్వాలిఫికేషన్​ను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. ఇందుకోసం ఫిబ్రవరి 17న ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్​ కమిటీని నియమించింది. వర్సిటీ నుంచి ప్రొఫెసర్​సులేమాన్​ సిద్ధిఖీ, యూజీసీ తరపున రాజేశ్వర్​ సింగ్​ఛందేల్, ప్రభుత్వం నుంచి చీఫ్​ సెక్రటరీ శాంతికుమారి నేతృత్వంలోని కమిటీ  దరఖాస్తులను   ఫిల్టర్​ చేసింది.

ముగ్గురూ ఉద్దండులే

టీయూ వీసీ కోసం ఏకంగా133 దరఖాస్తులు రావడం ఆశ్చర్యపరిచింది. ఇందులో ముగ్గురి పేర్లను సెర్చ్​కమిటీ ఫైనల్​ చేసి గవర్నర్​కు నివేదించాక వాటిలో ఒక పేరును గవర్నర్​ అనౌన్స్​ చేయడం ఆనవాయితీ.  సెర్చ్​ కమిటీ  సమర్పించిన మూడు పేర్లతో కూడిన షార్ట్​ లిస్టులో ప్రముఖ  ప్రొఫెసర్లు ఉన్నారు.  ఓయూకు చెందిన లా విభాగం ప్రొఫెసర్​, కామారెడ్డి జిల్లాకు చెందిన మెకానికల్​ విభాగం ప్రొఫెసర్​తో పాటు జర్నలిజం అండ్​ మాస్​ కమ్యూనికేషన్​ ప్రొఫెసర్​ పేర్లను సెర్చ్​ కమిటీ నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం.  

వర్సిటీ నుంచి ఆరుగురు ప్రొఫెసర్లు దరఖాస్తు చేయగా వీసీ పోస్టు దక్కించుకోవడానికి మైనారిటీ వర్గానికి చెందిన ఒకరు, కోరుట్లకు ప్రాంతానికి చెందిన మరో ప్రొఫెసర్​ తీవ్రంగా శ్రమించారు. షార్ట్​ లిస్టు గవర్నర్​ చెంతకు చేరడంతో అంతా కొలిక్కి వచ్చింది. దసరా పండగకే వీసీని ప్రకటించాలని ఉన్నత స్థాయిలో నిర్ణయించారు. ఇందుకు సంకేతంగా వర్సిటీలో బంగ్లాను సిద్ధం చేస్తున్నారు.