3 అడుగుల నేల కోసం అన్న తలను మొండెం నుంచి వేరు చేశాడు !

కరీంనగర్: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామ శివారులోని గోదావరి నది బ్రిడ్జి వద్ద అన్న సాయిల్ గొంతును కత్తితో నరికివేసి తమ్ముడు చందు (చంద్రయ్య) హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హత్య చేసిన అనంతరం చందు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. సాయిలును హత్య చేయడానికి మరో తమ్ముడు, చందు స్నేహితుడు అతనికి సహకరించినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనా స్థలానికి వెళ్లి డీఎస్పీ ఉమామహేశ్వర్ దర్యాప్తు చేశారు.

ALSO READ | గచ్చిబౌలి IIIT క్యాంపస్‌ చికెన్ బిర్యానిలో కప్ప

మొండెం నుంచి వేరు అయిన తలను పోలీస్ వాహనంలో, మొండెంను అంబులెన్స్లో పోలీసులు తరలించారు. ఇంటి వద్ద మూడు అడుగుల భూమి కోసం రెండు నెలల నుంచి అన్నదమ్ములు గొడవ పడుతున్నారు. గత రెండు రోజుల క్రితం మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పోలీసులు వారి మధ్య సయోధ్య కుదిర్చారు. అయినా అన్నదమ్ముల మధ్య గొడవ సమసిపోలేదు. చివరకు తమ్ముడు అన్నను హతమార్చి ఇంత ఘాతుకానికి ఒడిగట్టాడు.