కొత్త బాస్ వచ్చాడు: హిజ్బుల్లా అధినేతగా షేక్ నయీమ్ ఖాస్సెమ్

బీరూట్: పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లెబనాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తోన్న హిజ్బుల్లా  మిలిటెంట్ గ్రూప్‎ తమ కొత్త అధినేతను ఎన్నుకుంది. హిజ్బుల్లా  మిలిటెంట్ గ్రూప్ నయా చీఫ్‎గా షేక్ నయీమ్ ఖాస్సేమ్ ఎన్నికయ్యాడు. కాగా, ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. హమాస్‎పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతుండటంతో ఈ యుద్ధంలోకి హిజ్బుల్లా ఎంట్రీ ఇచ్చింది. 

హమాస్‎కు మద్దతుగా ఇజ్రాయెల్‎పై హిజ్బుల్లాకు దాడులు చేసి రెచ్చగొట్టింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఇజ్రాయెల్ హమాస్‎తో పాటు హిజ్బుల్లా పైన భీకర దాడులు చేసింది. గత నెలలో లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఇజ్రాయెల్ చేసిన మెరుపు దాడుల్లో హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమయ్యాడు. నస్రల్లా మరణంతో భారీ ఎదురు దెబ్బతిన్న హిజ్బుల్లా హషేమ్ సఫీద్దీన్ చీఫ్‎గా వస్తాడని ప్రచారం జరిగింది. అయితే, ఇజ్రాయెల్ దాడుల్లో హషేమ్ సఫీద్దీన్ సైతం హతమయ్యాడు. ఈ విషయాన్ని 2024, అక్టోబర్ 23న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. 

ఇద్దరూ టాప్ లీడర్లను మరణంతో హిజ్బుల్లాకు కొత్త చీఫ్ ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రస్తుతం హిజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‎గా ఉన్న నయీమ్ ఖాస్సేమ్‎ను కొత్త అధిపతిగా ఎన్నుకున్నారు.  టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కథనాల ప్రకారం.. ఖాస్సేమ్ నస్రల్లాకు చాలా కాలంగా డిప్యూటీగా పని చేశారు. గత నెలలో నస్రల్లా హత్యకు గురైనప్పటి నుండి హిజ్బుల్లా గ్రూప్ యాక్టింగ్ లీడర్‌గా పనిచేస్తున్నారని వెల్లడించింది. నయీమ్ ఖాస్సేమ్‎ను రాకతో మరోసారి హిజ్బుల్లా , ఇజ్రాయెల్ మధ్య దాడులు మొదలవుతాయనే ప్రచారం  పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన రేపుతోంది.