Sheikh Hasina: ఇస్కాన్ గురువు కృష్ణదాస్ ప్రభు అరెస్ట్పై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

బంగ్లాదేశ్ లో ఇస్కాన్ గురువు కృష్ణదాస్ ప్రభు అరెస్టుపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా స్పందించారు. చిట్టగాంగ్ లో లాయర్ హత్య, హిందువు మత గురువు చిన్మయ్ కృష్ణదాసు ప్రభు అరెస్టులను తీవ్రంగా ఖండించారు. కృష్ణ దాసు ప్రభును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో ప్రతిపక్ష నేతలు, స్టూడెంట్లపై దాడులు, అరెస్టులు చేస్తున్నారు.. ఈ అరాచక హింసకు వెంటనే స్వస్తి పలకాలని హసీనా కోరారు. 

సనాతన హిందు కమ్యూనిటీ నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చిట్టగాంగ్ లో ఓ దేవాలయాన్ని తగలబెట్టారు.. ఇంతకుముందు మసీదులు, పుణ్యక్షేత్రాలు, చర్చిలు, మఠాలు, గృహాలపై దాడులు జరిగాయి. విధ్వంసం,దోపిడీ చేసి ఇళ్లకు నిప్పంటించారు.

షేక్ హసీనా.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని.. ఆగస్టులో బంగ్లాదేశ్ లో చెలరేగిన అల్లర్లతో రాజీనామా చేసి ఇండియాకువచ్చి తలదాచుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజల మతపరమైన స్వేచ్ఛ, ప్రాణ, ఆస్తులకు భద్రతను కల్పించాలని డిమాండ్ చేశారు. 

మంగళవారం  భద్రతా దళాలు, చిన్మోయ్ కృష్ణ దాస్ అనుచరుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైఫుల్ ఇస్లామ్‌ అనే న్యాయవాది మృతిచెందారు. చిన్మయ్ కృష్ణ దాస్ ప్రభుపై బంగ్లాదేశ్ పోలీసులు దేశద్రోహం కేసు నమోదు చేశారు.కృష్ణ దాస్ ప్రభుకు చిట్టగాంగ్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో నిరసనలు చెలరేగాయి.