అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత : టి.నాగరాజు

రాష్ట్రంలో ఇంకా విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే  ప్రైవేట్‌‌‌‌‌‌‌‌, కార్పొరేట్ స్కూళ్లు 20 24–-25 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ముసుగులో ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లల్లోనైతే అప్పుడే అడ్మిషన్లు పూర్తయినట్లు చెబుతున్నారు.  బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు కొంత తక్కువగానే ఉండగా మిగిలిన ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో  మాత్రం భారీగానే వసూలు చేస్తున్నారు. 

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న  ప్రైవేటు బడులు విద్యార్థుల చదువును సంతలో సరుకుగా మార్చేశాయి. అడ్మిషన్ తీసుకోవాలంటే డొనేషన్లని, బుక్స్‌‌‌‌‌‌‌‌కు సపరేట్, యూనిఫాంకు సపరేట్ అని, ఐఐటీ ఫౌండేషన్ అయితే సపరేట్, బస్సు ఫీజు సపరేట్​ అని ఇలా రకరకాల పేర్లతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. తల్లిదండ్రుల కార్పొరేట్ మోజు ప్రైవేట్ విద్యా సంస్థలకు కాసుల వసూళ్లకు అవకాశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి అక్రమ వసూళ్లకు తెర తీశారు. పట్టణాల్లో చదవాలంటే హాస్టలు వసతి కూడా వారికి అవసరమవుతుంది. దీంతో స్కూలు, హాస్టల్ పేరుతో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు, ఆ తర్వాత విద్యార్థులకు పాఠశాలను బట్టి రూ. 60 వేల నుంచి సుమారు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. 

విద్యాహక్కు చట్టం అమలు తుంగలోకి

విద్యాహక్కు చట్టం  సెక్షన్- 6  నిబంధనల ప్రకారం అడ్మిషన్లు  జరగాలి. సెక్షన్ -11 ప్రకారం ప్రైవేటు యాజమాన్యాలు గవర్నింగ్ బాడీ నిర్ణయించే ఫీజు కంటే ఎక్కువ వసూలు చేయకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. సెక్షన్ 1, 2 ప్రకారం స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం టీచర్లను, నాన్ టీచింగ్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌ను నియమించి వారి వివరాలు, విద్యార్హత, వారికి ఇచ్చే వేతనాల వివరాలను నోటీస్ బోర్డులో పెట్టాలని చట్టం చెబుతుంది. 

సెక్షన్ -12 ప్రకారం టీచర్, విద్యార్థుల నిష్పత్తి 1:20 కి మించరాదు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు యాజమాన్యం 25% సీట్లను ఎస్సీ,  ఎస్టీ, వికలాంగులకు, మైనారిటీలకు కేటాయించాలి. పాఠశాల యాజమాన్యాలు నోట్ బుక్స్, యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, ఇతర స్టేషనరీని అమ్మకూడదు. ఎక్కడ  కొనుగోలు చేయాలో కూడా సూచించకూడదు. విద్యార్థుల ఫీజు వివరాలను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఉంచాలి. ఆట స్థలం తప్పనిసరిగా ఉండాలి.  మున్సిపాలిటీ పరిధిలో పాఠశాలల్లో 1000 చదరపు మీటర్లు,  గ్రామీణ ఇతర ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆటస్థలం తప్పనిసరిగా ఉండాలి.  ప్రవేశాలు పూర్తయిన తర్వాత  తల్లిదండ్రుల కమిటీని  నెలలోపు  నియమించాలి. ఈ  కమిటీని ఏటా మారుస్తుండాలి.  ప్రతి నెలా సమావేశం ఏర్పాటు చేసి ఆ వివరాలను నమోదు చేయాలి. ఇటువంటి నిబంధనలు చాలా స్కూళ్లు  పాటించకుండా నడుపుతున్నాయి. 

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు

2002లో  ‘టిఎ పాయ్  వర్సెస్ కర్నాటక ప్రభుత్వం’ 2003లో  ‘ఇస్లామిక్  ఎడ్యుకేషన్ అకాడమీ వర్సెస్ కర్నాటక ప్రభుత్వం’ 2004 లో  ‘మోడరన్ స్కూల్ వర్సెస్ ఢిల్లీ ప్రభుత్వం’ 2005లో  ‘పి.ఎ. ఇనాందారి వర్సెస్ మహారాష్ట్ర  ప్రభుత్వం’  కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులలో చాలా స్పష్టత వచ్చింది.  నాన్ ప్రాఫిట్  సంస్థలైన  ప్రైవేటు విద్యాసంస్థలు  క్యాపిటేషన్  ఫీజులు వసూళ్లు చేయకుండా సరైన యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీం తెలిపింది. కానీ, ఈ మార్గదర్శకాలు ఎక్కడాఅమలు కావడం లేదు.  

ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, రాజస్తాన్ లలో  ఫీజుల నియంత్రణకు  ప్రభుత్వాలు ఒక ఫార్ములా రూపొందించారు. ఆ ఫార్ములా ప్రకారం ప్రభుత్వం ఫీజులు నియంత్రిస్తుంది,  ఫీజు నిర్ణయిస్తుంది. ఇలాంటి చట్టం చేయాలని తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం నుంచి డిమాండ్ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక పోరాటాల తర్వాత  ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం 2017లో ప్రొఫెసర్ తిరుపతి రావు నేతృత్వంలో కమిటీ వేసింది. ప్రొ. తిరుపతి రావు కమిటీ ఏడాదికి 10 శాతం ఫీజులు పెంచుకోవాలని సిఫార్సులు కూడా చేసింది. అయితే ఆ కమిటీ నివేదిక ఇప్పటికీ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. 

నియంత్రణ చట్టం అవశ్యం

ప్రైవేటు ఫీజుల దందాను నియంత్రించేందుకు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తెచ్చాయి. తెలంగాణలో కూడా ఇదే బాట పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. దాదాపు 11 వేల ప్రైవేటు బడులను నియంత్రణ పరిధిలోకి తేవాలని భావించింది. కానీ,  ఆచరణలో  ప్రభుత్వం ఈ కృషి చేయలేదు.  మంత్రుల సబ్ కమిటీ వేసి  ఫీజులు నిర్ణయించాలనుకున్నా చేయలేదు. రాష్ట్రంలో  ఫీజులను నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది. 

రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1) ప్రకారం విద్యను ఉచితంగా అందించాలి.  కానీ,  ప్రైవేటు విద్యాసంస్థలు నిర్వహణ, ఉపాధ్యాయులు జీతాలు ఉంటాయి. కాబట్టి ఆయా సంస్థలు ఫీజులను  ప్రతి సంవత్సరం ప్రభుత్వం  సమగ్రంగా ఎకౌంట్స్ పరిశీలన చేసి సరైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే నిర్వహణ ఖర్చులు 15 % మించకుండా పెంచుకునేలా  చట్టం చేయాలి.  ఫీజులను  ప్రతి సంవత్సరం  తల్లిదండ్రులు,  పాఠశాల యాజమాన్యం,  విద్యావేత్తలు,  జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్,  జడ్జి కమిటీ సభ్యులుగా ఉన్న  డిస్ట్రిక్ట్ ఫీ రెగ్యులేషన్ కమిటీ ఫీజులను నియంత్రణ చేసే వ్యవస్థ ఉండాలి.   ఫీజుల నియంత్రణ చట్టం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఉద్యమం చేపట్టాల్సిన బాధ్యత ఉంది. 

ఫీజులపై నియంత్రణ ఏది

ప్రైవేటు, కార్పొరేట్ ఫీజుల నియంత్రణకు అన్ని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ, ఆచరణలో అవన్నీ ఉత్తవే, 1994లో  వచ్చిన జీవో. నెం.1 ప్రైవేటు పాఠశాలలు స్థాపన, నిర్వహణ, అడ్మిషన్లు, ఫీజులు,  ఉపాధ్యాయులు పర్యవేక్షణ, తనిఖీలు మొదలైన విధివిధానాల గురించి స్పష్టం చేస్తున్నాయి. వాటిని అమలు చేయలేమని ప్రైవేటు విద్యాసంస్థలు ఎదురు తిరుగుతున్నాయి. 2009లో వచ్చిన  జీ.వో నెం.91లో  ఫీజు స్ట్రక్చర్  నిర్వచించడమైంది. వాటిని అమలు చేయకుండా ప్రైవేటు యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. 

పేద విద్యార్ధులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో చదువు కోసం విద్యాహక్కు చట్టం కల్పించిన ఉచిత విద్యకు తీసుకుని వచ్చిన జీ.వో నెం 46/2010 పై కూడా కోర్ట్ స్టే తీసుకుని వచ్చారు. పాఠశాలలో ప్రభుత్వ  పాఠ్యపుస్తకాలు వినియోగించడం లేదు, షూ, టై, బెల్టు అమ్మే వ్యాపార కేంద్రాలు అయిన కూడా చర్యలు తీసుకోకుండా అధికారులు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు, కార్పొరేట్ ఫీజులు నియంత్రణకు అనేక వాదనలు జరుగుతున్నాయి. అటానమస్ హోదా కల్గిన విద్యాసంస్థలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని యాజమాన్యాలు వాదనలు వినిపిస్తున్నాయి.

- టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి