కాలనీలకు వరద ముప్పు.. నిజామాబాద్ లో యూజీడీకి మురుగు నీటి కాల్వలు లింక్ చేయలే

  •      వర్షం పడితే ఓపెన్​ ప్లాట్స్​, ఖాళీ జాగాల్లో నీటి నిల్వ 
  •     తాత్కాలికంగా మొరం నింపి చేతులు దులుపుకుంటున్న ఆఫీసర్లు 

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్ నగరంలో రూ. 250  కోట్లతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ప్రధాన మురుగు కాలువకు లింక్ చేయకపోవడంతో ఏటా వర్షాకాలంలో కాలనీలు వరద నీటితో నిండిపోతున్నాయి.  నిజామాబాద్​ నగరపాలక సంస్థ పరిధిలో 3.25 లక్షల జనాభా ఉండగా.. 60 డివిజన్లలో 81 వేల ఇండ్లు ఉన్నాయి.  ఇండ్లు నిర్మించక ఖాళీగా వదిలేసిన ప్రైవేట్​ ప్లాట్స్​20 వేల దాకా ఉన్నాయి. ప్రతి వర్షాకాలంలో ఈ ప్లాట్స్​నీటి మడుగులుగా మారుతున్నాయి. దీంతో దోమలు పెరిగి ప్రజలు డయేరియా, డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు. 

పట్టించుకోని ఆఫీసర్లు 

భారీ వర్షాలు పడినపుడు ఓపెన్ ప్లాట్స్ లో మొరం నింపాలని ఓనర్లకు నోటీసులిచ్చి మున్సిపల్ ఆఫీసర్లు చేతులు దులుపుకుంటున్నారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో సిటీకి శివారులో 12 గ్రామాలను కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విలీనం చేసి సౌకర్యాలు కల్పించలేదు.  దీంతో రోజుల తరబడి కాలనీల్లో నీరు నిల్వ ఉండి అపరిశుభ్రత నెలకొంటోంది. 

ముఖ్యంగా సిటీలోని న్యాలకల్ రోడ్, గాయత్రీనగర్​, లలితానగర్​ కాలనీ, గౌతంనగర్​, హమాల్​వాడీ, చంద్రబాబునగర్​, గొల్లగుట్ట, సాయినగర్​ కాలనీలలో డ్రైనేజీ లింకు సరిగా లేక కాలనీల చుట్టూ నీరు చేరుతోంది. పాత బస్టాండ్​ వెనుక నుంచి అర్సాపల్లి, మాలేపల్లి, బాబన్​పహాడ్ కాలనీల పరిస్థితి మరీ దారుణం. కొత్తగా నగరపాలక సంస్థలో విలీనం చేసిన పాంగ్రా, బోర్గాం, ముబారక్​నగర్​ ఏరియాలతో పాటు కాలనీలు వరద ముప్పు ఎదుర్కొన్నాయి. 

లింక్ చేస్తేనే మేలు

 నగరంలో మురుగునీరు, వరదకు శాశ్వత పరిష్కారంగా అండర్​ గ్రౌండ్ డ్రైనేజీ ని నిర్మించాలని 2010 లో మంత్రి డి. శ్రీనివాస్ రూ. 145.5 కోట్ల ఫండ్స్ ను మంజూరు చేయించారు. దాదాపు 12 సంవత్సరాల దాకా పనులు కొనసాగగా.. ఖర్చు రూ. 250 కోట్లకు పైనే అయింది. రెండు సంవత్సరాల కింద పనులు ముగియగా.. నగర డ్రైనేజీ సిస్టంను ఇంకా లింక్ చేయకపోవడం శాపంగా మారుతోంది.