చేపూర్​లో కుక్కల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు

  • నిజామాబాద్ ​జిల్లా చేపూర్​లో ఘటన 
  • జిల్లా హాస్పిటల్ కు తరలింపు

ఆర్మూర్, వెలుగు : నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో ఆదివారం పిచ్చికుక్కలు దాడి చేసి ఏడుగురిని గాయపరిచాయి. నాలుగు నుంచి ఐదు వరకు కుక్కలు రోడ్లపై నుంచి వెళ్తూ కనిపించినవారినల్లా కరిచాయి. ఈ ఘటనలో వేల్పుల నర్సయ్య, పోసాని, లత, రాజ గంగారాం , బట్టు లాస్య, లలిత, కళ తీవ్రంగా గాయపడ్డారు. కొంతమందిని కాళ్లపై కరవగా కింద పడడంతో తల, కండ్లు, మూతి, ఇతర శరీర భాగాలపై దాడి చేశాయి. గాయపడిన వారిని108లో ఆర్మూర్ ఏరియా దవాఖానకు తరలించారు. అక్కడి డాక్టర్లు ఫస్ట్​ఎయిడ్​చేసి నిజామాబాద్ హాస్పిటల్ లో చేర్పించారు.

 వరంగల్​లో మహిళపై వీధికుక్క దాడి

కాశీబుగ్గ(కార్పొరేషన్): వరంగల్​ సిటీలో 18వ డివిజన్​లో ఓ మహిళపై వీధికుక్క దాడి చేసింది. పట్టణానికి చెందిన సునీత తన ఇద్దరు పిల్లలతో కలిసి రోడ్డుపై వెళ్తుండగా వీధి కుక్కలు ఎగబడ్డాయి. దీంతో ఆమె తన పిల్లలను వాటికి అందకుండా చేస్తూనే తరమడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో ఓ కుక్క ఆమెపై దాడి చేసి గాయపర్చింది. అక్కడున్న వారు వచ్చి కుక్కలను వెళ్లగొట్ట మహిళను దవాఖానకు తరలించారు.