దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాల మధ్య 23 నవంబర్ 2024న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి అప్పటి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో ఎన్నికల బరిలో దిగింది. ఎన్నికలు ముగిసేవరకు వ్యూహాత్మకంగా మౌనంగానే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడగా కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ అనూహ్యరీతిలో ఓటమిపాలవగా మహాయుతి కూటమి భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించింది.
ఈక్రమంలో ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేయడం ప్రారంభించింది. అనుకున్నవిధంగా ఫడ్నవీస్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. బీజేపీ వ్యూహాత్మక రాజకీయాల్లో కచ్చితంగా ఏక్‌నాథ్ షిండే విజయాన్ని కోల్పోయారు. జూన్ 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎదురైన ఓటమిని అధిగమించేందుకు బీజేపీకి భారీ విజయం అవసరం. మోదీ సారథ్యంలోని బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ రాకపోవడంతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
బీజేపీ నేత ఫడ్నవీస్‌ను మహారాష్ట్రకి ముఖ్యమంత్రిని చేయడం ద్వారా పాత వైభవం కొంత తిరిగి వస్తుందని బీజేపీ భావించింది. సమీప భవిష్యత్తులో ఢిల్లీ, బిహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో కీలక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున బీజేపీకి కూడా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం రాజకీయ అవసరం. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా బీజేపీ ఆధిక్యతలో ఉందని పెద్ద సందేశం పంపినట్టు అవుతుంది. అయితే, శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే అంత తేలిగ్గా లొంగిపోలేదు. షిండే ఒక్క మాట కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లా డలేదు. కానీ, షిండే బీజేపీని కదిలించడానికి మాస్టర్- సైకాలజీని ఉపయోగించారు. దీంతో మహారాష్ట్రలో డిసెంబర్ 5, 2024 వరకు ప్రభుత్వం ఏర్పడలేదు. బీజేపీలో ఎవరూ షిండేను ఒత్తిడి చేయలేకపోయారు.
కొత్త తరం నాయకుల కోసం బీజేపీ ప్రణాళికలు
బీజేపీ హైకమాండ్ గత కొంతకాలంగా వారసత్వం కోసం ప్లాన్ చేస్తోంది. 1980లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి 2014 వరకు పార్టీపై ఆధిపత్యం చెలాయించిన నేతలు పరిమిత సంఖ్యలో ఉండటంతో బీజేపీకి చాలా చేదు అనుభవం ఎదురైంది. వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మా స్వరాజ్ తదితరులు బీజేపీని శాసించారు. అయితే, 2004లో అధికారం కోల్పోవడం అధినాయకత్వ బలహీనతను బట్టబయలు చేసింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశం అంతటా బీజేపీ విస్తరించాలని, కొత్త తరం నాయకులను కూడా సృష్టించాలని ప్రణాళిక వేసింది. లేకపోతే మోదీ తరం అనంతరం బీజేపీకి నాయకత్వమే లేకుండా పోతుంది.
కార్పొరేట్ ప్రపంచంలో దీన్నే ‘వారసత్వ ప్రణాళిక’ అంటారు. వంశపారంపర్య పార్టీలు కొత్త నాయకత్వం లేకపోవడంతో అధికార లేమితో బాధపడుతున్నాయి. పార్టీపరంగా అభివృద్ధి చెందడంలో వెనుకంజలో ఉన్నాయి. కాగా, బీజేపీ వారసత్వ ప్రణాళికను పరిశీలిస్తే.. మధ్యప్రదేశ్‌కు చెందిన శివరాజ్‌సింగ్ చౌహాన్, చత్తీస్‌గఢ్‌కు చెందిన రమణ్‌సింగ్, రాజస్థాన్‌కు చెందిన వసుంధర రాజేతో పాటు పలువురు ఆయా రాష్ట్రాల క్రీయాశీలక రాజకీయాల నుంచి వైదొలిగారు. ముఖ్యమంత్రులుగా తమ రాష్ట్ర రాజకీయాలను శాసించినా ప్రస్తుతం కొందరి ఆధిపత్యం కనుమరుగు కాగా.. కేంద్ర రాజకీయాల్లో స్థిరపడుతున్నారు.
ఫడ్నవీస్ ప్రాముఖ్యత
ఫడ్నవీస్ బీజేపీ సీనియర్ నాయకుడు. ఇతర పార్టీ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండేలా ఫడ్నవీస్ జాగ్రత్త వహించేవాడు. మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గానీ, అజిత్ పవార్ గానీ ఆయనలో ఎలాంటి తప్పును కనుగొనలేకపోయారు. బహిరంగంగా ధ్వజమెత్తలేకపోయారు. శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు నిత్య సమస్యలుగా మారడంతో వారి రాజకీయ ప్రాధాన్యత తగ్గించేందుకు 2014 నుంచి బీజేపీ ప్రయత్నిస్తోంది. ఫడ్నవిస్ జూన్ 2022లో ఉద్ధవ్ థాకరేను ముఖ్యమంత్రిగా తొలగించడానికి కీలకపాత్ర పోషించాడు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం పడిపోవడం ఫడ్నవీస్ సాధించిన విజయం. దీంతో బీజేపీలో ఫడ్నవీస్‌కు ప్రాధాన్యం, ప్రాముఖ్యం పెరిగింది.
మహారాష్ట్ర రాజకీయాల్లో శరద్ పవార్, ఉద్ధవ్ థాకరేల ప్రాబల్యాన్ని బీజేపీ సమర్థవంతంగా తొలగించింది. శరద్ పవార్ 2014 నుంచి మోదీకి నిద్రలేని రాత్రులకు కారణమయ్యాడు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఇండియా కూటమికి పెద్ద సందేశాన్ని కూడా పంపాలని మోదీ భావించారు. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం కాంగ్రెస్‌పై పడింది. మమతా బెనర్జీ, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు కాంగ్రెస్‌కు దూరం కావడం, మరోవైపు మమతా బెనర్జీని ఇండియా కూటమికి నాయకురాలిగా చేయాలని డిమాండ్ చేయడం ప్రస్తుతం ఇండియా కూటమి ఎదుర్కొంటున్న పరిణామాలు.
మహారాష్ట్ర బీజేపీలో ఫడ్నవీస్‌కు పోటీ లేదు
ఫడ్నవీస్‌ను మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే లేదా అజిత్ పవార్‌ను ఎప్పుడూ చికాకు పెట్టరు. ముఖ్య మంత్రి పదవి కేవలం సాంకేతికత మాత్రమేనని, ఇతరుల కంటే తనకు సీనియారిటీ ఇవ్వదని ఫడ్నవీస్ స్వయంగా చెప్పారు. ఇది చాలా తెలివైన ప్రకటన. అంతేకాదు ప్రభుత్వంలో చేరడానికి షిండేను కూడా ఒప్పించారు. మహారాష్ట్ర బీజేపీలో ఫడ్నవీస్‌కు ఏ ఇతర బీజేపీ నేతల నుంచి పోటీ లేదు. కానీ, చాలా మంది బీజేపీ నాయకులు ఫడ్నవీస్ ఆధిపత్య స్వభావం, వారిని పక్కదారి పట్టించే ఆయన సామర్థ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.
మహారాష్ట్రలో ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా లాబీ ఉందనేది వాస్తవం. ఫడ్నవీస్ మరాఠా కాదు. అదే అతని పెద్ద సమస్య. అందుకే ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ తన వెంట ఉండేలా జాగ్రత్తపడ్డాడు. ఫడ్నవీస్ మరాఠా లాబీ నుంచి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఫడ్నవీస్ మంచి అడ్మినిస్ట్రేటర్. అయితే, 2014 నుంచి 2019 వరకు ఆయన పూర్తి కాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించలేకపోయిందనేది గుర్తుంచుకోవాలి. ఇంకా, శివసేనతో బీజేపీ పొత్తు విడిపోవడానికి ఫడ్నవీస్ అధ్యక్షత వహించారు.
మోదీ, అమిత్ షాలు మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు పరిశ్రమలను తరలిస్తున్నారనే ఆరోపణలను కూడా ఫడ్నవీస్ ఎదుర్కోవలసి వచ్చింది. 10 ఏండ్ల తర్వాత కూడా ప్రధాని మోదీకి ప్రజాకర్షణ ఉన్నప్పటికీ, అంతకుముందు ఆయన స్టార్ క్యాంపెయినర్‌గా ఓవర్ ఎక్స్పోజ్ అవడం వల్ల ఆ తర్వాత ప్రచారకర్తగా తక్కువ ప్రభావం చూపుతారని ఫడ్నవీస్ గ్రహించాడు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం తథ్యమని ఫడ్నవీస్ తరచుగా ప్రస్తావించేవారు. అయితే, మహారాష్ట్ర చాలా క్లిష్టమైన రాష్ట్రమని, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఫడ్నవీస్‌కు తెలుసు. కాగా, ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ పబ్లిసిటీ మొదటి టర్మ్‌లో ఆయనకు ఓ సమస్యగా మారింది.
దీంతో 2019 నుంచి 2024 వరకు బీజేపీ అధికారానికి దూరంగా ఉన్నందున అమృత మౌనంగా ఉంది. అయితే, ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం అనంతరం అమృత సోషల్ మీడియాలోకి తిరిగి వచ్చి.. మహారాష్ట్రకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అయితే భారత రాజకీయాల్లో నాయకుల జీవిత భాగస్వాముల పాత్ర పరిమితం. ఫడ్నవీస్‌కు ఆయన భార్య అమృత ఫడ్నవీస్ పబ్లిసిటీ ఒక సమస్యగా మారే అవకాశం ఉంది. కాగా, ఏక్‌నాథ్ షిండేను ముఖ్యమంత్రిని చేయకుండా బీజేపీ పెద్ద తప్పు చేసిందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. అయితే, బీజేపీ తొందరపడి ఏకనాథ్ షిండేను ముఖ్యమంత్రి పీఠం నుంచి దింపిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాలం అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది.
- డా. పెంటపాటి పుల్లారావు, పొలిటికల్ ఎనలిస్ట్