ఒక్కొక్కరుగా వెళ్లిపోతుంటే.. మిగిలేది పరివారమేనా?

ఆవులను మలిపిన వాడే అర్జునుడు  సామెత  ఇప్పుడు గుర్తుకు వస్తున్నది.  ఎందుకంటే  బీఆర్ఎస్ పార్టీలోని శాసనసభ్యులు ఒక్కొక్కరు  కాంగ్రెస్ పార్టీలోకి  వెళుతుంటే ఆ పార్టీ అధినాయకుడు కేసీఆర్​ నోటిమాట రాక నిరుత్తరుడై పోతున్నాడు.  ఇక మిగిలిన కుటుంబ సభ్యులు, ఆ పార్టీ వీర విధేయులు అధికార పార్టీ మీద ఆరోపణలు  అశ్శరభ శరభ అంటూ ఒంటికాలు మీద లేస్తున్నారు.  అసలు బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిత్వ నిర్మాణంలోని లోపాలను గ్రహించకుండా,  తప్పులను  సరి చేసుకోకుండా,  సమీక్షించుకోకుండా ఆ పార్టీ నాయకులు తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్నట్టు  ప్రవర్తిస్తుండటం చూసేవాళ్ళకు వినోదాన్ని అందిస్తుంది. ఎందుకంటే  టీఆర్ఎస్ పార్టీ  బీఆర్ఎస్  పార్టీగా  మారిన చరిత్ర  మూలాల్లోకి వెళితే మరింత  బోధపడుతుంది. 2002లో  టీఆర్ఎస్  పార్టీ  ప్రారంభంలో  ఉన్న అకుంఠిత  తెలంగాణవాద నాయకులను  క్రమక్రమంగా  కావాలనే  కేసీఆర్ పార్టీకి దూరం చేశాడు.  అడిగేవారు,  ప్రశ్నించేవారు లేకుండా తనకు ఎదురు చెప్పేవారు ఉండకుండా చూసుకున్నారు. 

 తగు జాగ్రత్తలు తీసుకున్నానని  బహుశా లోపల సంబరపడిపోయి ఉండవచ్చును.  దూరం పెట్టడం ఒక్కటే కాకుండా ఆ నాయకుల వ్యక్తిత్వాలను  మిడిసిపాటుతో  ఘోరంగా అవమానించాడు.  బహుశా ఆ రోజుల్లో ఆంధ్ర ప్రాంతం వారు ఇచ్చే చందాలు,  కేసీఆర్ చేసే  దందాలకు వేరేవారు ఎవరికి అవకాశం లేకుండా అంతా తానై అంతటా తన కుటుంబ సభ్యులను కీలక స్థానాలలో పెట్టుకొని రాజకీయ వ్యవహారాలు నడిపాడు.  బయట బహిరంగ సభల్లో మాట్లాడేది ఒకటి.. మనసు లోపల ఉండే ఎత్తుగడలను మరొకటిగా అమలుపరిచాడు.  జనాన్ని మాటలతో బోర్లేయవచ్చుననే ధీమాతో  ప్రవర్తించాడు.  కానీ,  దీర్ఘకాలిక వ్యూహంలో ఇవి బెడిసికొట్టి ఘోరమైన వైఫల్యాలకు దారితీస్తుందని కేసీఆర్​ ఊహించలేకపోయాడు. అధికారం పోగానే  ఒక్కొక్కరు జారుకుంటారని అంతకన్నా ఊహించి ఉండకపోవచ్చు.

అభివృద్ధి పేరుతో  కేసీఆర్​ ఇష్టారాజ్యం

తెలంగాణ ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీ అధినాయకురాలని కుటుంబ పరివారంతో పోయి వచ్చిన తర్వాత హైదరాబాద్ విమానాశ్రయం నుంచి అల్లుడు హరీష్ రావు ఏర్పాటుచేసిన ఊరేగింపు ఆర్భాటంగా తీశారు. ఇంతకుముందు పొత్తుల కోసం పాచికలు విసిరిన  టీఆర్ఎస్ పార్టీ  అనంతరం వచ్చిన 2014 ఎన్నికల్లో సొంతంగా పోటీచేసి విజయాన్ని సాధించింది. కేసీఆర్​ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకున్నాడు . అప్పుడు ఎవరిని ఎవరు మోసం చేశారో  ప్రజల ఎరుకలోకి  రాకుండా మేనేజ్ చేశాడు.  అప్పటి నుంచి  మొదలైంది వీరి ఆట.. అభివృద్ధి పేరిట మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు,  రైతుబంధు, దళితబంధు,  ఆసరా పెన్షన్లు, చేపల  పథకం,  గొర్రెల పథకం, బతుకమ్మ చీరలు తదితర  బోలెడు టక్కు టమారా విద్యలతో కళ్ళు మిరిమిట్లు కొలిపే మీడియా ప్రకటనలతో  గిమ్మిక్కులు చేశాడు.  ప్రజలు దీన్ని గ్రహించేసరికి పుణ్యకాలం తీరిపోయింది. ఏది చేసినా ప్రజలు ఏమీ అనరని,  విపక్షాలు ఏమీ చేయలేవని తనమీద తనకే విశ్వాసాన్ని, నమ్మకాన్ని పెంచుకున్నాడు.  ఒకవిధంగా ఒక సామ్రాజ్యంలోని రాచరిక పాలనను తలపింపజేశాడు. తిరిగి 2018 ఎన్నికలలో  కూడా కేసీఆర్ విజయాన్ని పొందాడు.  అనంతరం  తెలంగాణలో జరిగిన ప్రతి దానికి, ప్రతి సందర్భంలో  ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్ల  పాలనే దీనికి  ప్రధాన కారణమని,  నెపాన్ని కాంగ్రెస్ పార్టీ పైన తోసేసి తప్పించుకున్నాడు.

తాతకు దగ్గులు నేర్పుదామంటే కుదరలే

తాతకు  దగ్గులు నేర్పుదామనుకునే  కేసీఆర్ కు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ,  మరొకవైపు భారతీయ జనతా పార్టీ  జాతీయ అధినాయకులు కేసీఆర్ కు పట్టపగలు చుక్కలు చూపించారు. అనంతరం మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జీరోస్థానానికి చేరింది.  తెలంగాణలో శూన్యంగా  మిగిలిపోయింది.  బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఒక్కొక్కరు అధికార పార్టీలోకి  వెళుతుంటే కురుక్షేత్రంలో కౌరవ సైన్యంలా కేసీఆర్​ కుటుంబం  కకావికలం అయిపోయింది. ఈ దశలో కూడా ఇంకా కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు వేసి  మునిగిపోతున్న పడవను రక్షిస్తాడని అనుకునేవారు కూడా ఉన్నారు. అందుకే   తలుపు చెక్కతో  తానిట్లంటే  పీట చెక్కతో నేనిట్లంటి..అన్న సామెత  ప్రస్తుత రాజకీయ సినేరియోను గమనిస్తే సరిపోతుందనుకుంటాను.

కేసీఆర్​ అహంకారానికి రేవంత్​ చెక్​

మితిమీరిన అహం నిండిన కేసీఆర్​ లోపలి మనిషి క్రమక్రమంగా బయటకు వచ్చాడు.  శకునాల పిల్లి అంటే బల్లి పలికినట్లయిది. ఆయన కుటుంబానికి తెలంగాణ.. నెయ్యిలో విరిగిపడ్డ రొట్టె ముక్క అయింది. ఇక కేసీఆర్​ తన 64 కళల  నైపుణ్యాన్ని బాహాటంగా చూపించడం మొదలుపెట్టాడు. ప్రతిపక్షంలోని  శాసనసభ్యులను అనేకానేక  ప్రలోభాలు పెట్టి తమ పార్టీలో కలుపుకుని,  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశాను అని కాలర్ ఎగరేశాడు.  పొట్టోడి నెత్తిని పొడుగోడు కొడితే.. పొడుగోని నెత్తిని దేవుడు కొడతాడు అన్నట్టు 2022లో  రాష్ట్ర  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియామకం చేసిన తర్వాత ఆ పార్టీ టీం స్పిరిట్ తో  పునరుజ్జీవాన్ని పొందింది. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్​ తిరిగి కేసీఆర్​ వ్యూహాలకు దీటుగా  ప్రతి వ్యూహరచన చేశాడు.  రేవంత్​ వ్యూహాలు ఫలించి..2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. 

-జూకంటి జగన్నాథం,
         కవి, రచయిత