పథకాల ఎరలకు లొంగని తెలుగోళ్లు..అవినీతి, అహంకారాలను ఓడించారు

ప్రజల మెమొరీ చిన్నది.. బాగా కడుపు మాడ్చి ఇంత తిండి గింజలు వేస్తే...మాడ్చిన కడుపును మర్చిపోయి...తిండి గింజలనే గుర్తు పెట్టుకుంటారు అనుకునే రాజకీయ పార్టీలకు.. నేతలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు గట్టిగా బల్ల గుద్ది మరీ.. ఆ వాదన అబద్ధమని చెప్పారు. తెలుగు ప్రజలు విజ్ఞులని నిరూపించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. ఎన్నికలకు వెళ్లే ముందు మాత్రం తాయిలాలు పంచితే చాలు తోకాడించుకుంటూ చెప్పేది వింటారు అనేది అబద్ధమని తేల్చి చెప్పారు. రోజులు మారాయి. 

ప్రజలను ఓటు బ్యాంకుగా చూస్తే.. ఆ తరహా రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పారు. అయిదు నెలల వ్యవధిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. మేముమనుషులమే.. మాకు వ్యక్తిత్వాలు ఉంటాయి.. మా జీవితాలతో ఆడుకుంటే.. మా దగ్గరున్న ఆయుధాన్ని నిర్దాక్షిణ్యంగా ఉపయోగిస్తామని తేల్చి చెప్పారు. ఆ తరహా రాజకీయం చేశారని భావించిన పార్టీలను ఇక చాలు మీ సేవలంటూ ఇంటికి పంపించారు. డబ్బిస్తే తీసుకుంటాం.. మద్యం పోస్తే తాగుతాం.  కానీ,  రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఓటు మాత్రం వేయమని జరిగిన రెండు ఎన్నికల్లో ఓటు గుద్ది మరీ చెప్పారు. 

తిరుగులేదనుకున్న బీఆర్​ఎస్​ను గద్దెదించారుఅయిదారు నెలల క్రితం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఎవరూ ఊహించని విధంగా తీర్పునిచ్చారు.  మళ్ళీ తామే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ పార్టీ ఎంత బల్ల గుద్ది చెప్పినా.. ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీ విజయం తథ్యమని చెప్పినా..ప్రజలు ఓటు ద్వారా తమ వ్యతిరేకతను తెలియజేసారు. ఫామ్ హౌస్ నుంచి పరిపాలన..కుటుంబ అవినీతి, నిరంకుశత్వ పోకడలను వ్యతిరేకించారు. అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేసాం. మాకు తిరుగులేదు అనుకున్న  కేసీఆర్​కు ఆ పథకాలు అమలు.. వాటిని తెచ్చిన సందర్భం మాకు తెలుసులే అని ఓటు ద్వారా తమ తీర్పును తెలియజేసారు. 

ఏం చేసినా నడుస్తుందనుకున్న వైసీపీని ఇంటికి పంపారు 

ఇప్పుడు ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో సైతం దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా అధికార పార్టీకి శిక్ష వేశారు. అధికారం ఉందని విర్రవీగితే.. అహంకారం ప్రదర్శిస్తే.. వచ్చిన మూలాలను కాపాడుకోకపోతే.. ప్రజలు ఎప్పుడైన.. ఎక్కడైన.. అవసరం వచ్చినప్పుడు తీసి బండకు కొడతారని క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చారు. అధికారం వచ్చినప్పటి నుంచి ప్రజలకు దూరంగా ఉంటాను. కేవలం మీట నొక్కి మీకు డబ్బిస్తాను కాబట్టి నేను ఏం చేసినా ఎలా ప్రవర్తించినా మీరు తననే నాయకుడిగా ఎన్నుకోవాలనే ధోరణి తప్పని చెప్పారు. 

ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో డబ్బు ఇస్తే.. అతనిని పాలకుడు కాదు.. కేవలం ప్రొవైడర్ మాత్రమే అవుతాడని ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజం. ఐదేండ్లు ఎన్నుకున్నది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, కానీ కేవలం పథకాల పేరుతో డబ్బిచ్చి మిగతా అన్ని రంగాలను విస్మరిస్తానంటే ఊరుకోమని చెప్పారు.  ఓట్లు వేసే వరకే మీకు విలువ ఇస్తం.  ఆ తర్వాత గేటు అవుతల ఉంచుతం అంటే మాకూ ఓ రోజు వస్తుంది అప్పుడు మేము కూడా మాదైన స్టైల్​లో రిప్లై ఇవ్వటం తథ్యమని నిరూపించారు. 

మనది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకుంటేనే అధికారం వస్తుంది. అదీ కేవలం ఐదేండ్లుమాత్రమే ఉంటుంది. ఈ ఐదేండ్లలో చేసిన పాలన పనితీరు బట్టి అవసరమైతే మరో సారికి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ నగ్న సత్యాన్ని మరచి అహం బ్రహ్మాస్మి అనే ధోరణిలో రాజరిక పోకడలతో పాలన చేస్తే తామేం చేస్తామో చక్కగా తెలుగు ఓటర్లు చేసి చూపించారు.

- శ్యామ్​ వేలూరి సీనియర్ జర్నలిస్ట్