పార్లమెంట్ లో జగిత్యాలకు అన్యాయమే!

అక్టోబర్ 2016 లో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటులో ముందు వరుసలోనే జగిత్యాల జిల్లాగా అవతరించింది. అలా జగిత్యాల జిల్లా కావాలన్న ప్రజల చిరకాల ఆకాంక్ష కూడా తీరింది. అంతా బాగుంది. కానీ, 2007లో ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ స్థానాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా జగిత్యాలను నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కలిపారు. దాని దెబ్బకు ఒకే శరీరంగా ఉన్న ప్రాంతాలను రెండు ముక్కలుగా నరికినట్లయింది. జగిత్యాలకు 100 కి.మీ. దూరంలో నిజామాబాద్ ఉంటుంది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పటం చూస్తే జగిత్యాల తూర్పు దిక్కు చివరన ఉంటుంది. 

జనవరి 2007లో  ఆంధ్రప్రదేశ్ లోని పార్లమెంట్ స్థానాల పునర్వ్యవస్థీకరణ  చేపట్టినప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ కార్యం కోసం విడిగా డీలిమిటేషన్ కమిషన్​ను ఏర్పాటు చేసింది. దీనివల్ల రాష్ట్రంలోని ఏయే అసెంబ్లీ స్థానాలు మార్పుకు లోనవుతున్నాయో తెలుపుతూ, ఈ విషయంలో ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలుంటే మా దృష్టికి తీసుకురావచ్చని ప్రకటన విడుదల చేసింది. అప్పుడు ఎవరైనా జగిత్యాలను నిజామాబాద్​లో కలపడం వల్ల వచ్చే  సాధక బాధకాలు తెలిపారో, లేదో తెలియదు.

కరీంనగర్​ స్థానంలో జగిత్యాల ఉన్నపుడు..కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా 1971–-80 వరకున్న ఎం సత్యనారాయణరావు, 1984-–96 మధ్య ఉన్న జువ్వాడి చొక్కారావు,  1999-–04 కాలంలో ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావు  జగిత్యాల వాసులకు సుపరిచితులు. జగిత్యాలకు వారి రాకపోకలు తరచుగా ఉండేవి. 1996 నుంచి 98  దాకా ఎంపీగా ఉన్న ఎల్ రమణ జగిత్యాల బిడ్డనే. 1984 నుండి నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఇప్పటి వరకు (2014లో కల్వకుంట్ల కవిత మినహా) ఆ జిల్లా వాసులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో గెలిచిన మధు యాష్కీ, 2019 లో ఎంపీ అయిన ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ వాసులే. వారి పదవీకాలంలో జగిత్యాల వైపు వచ్చిందీ,  ప్రాంతీయ సమస్యలు చర్చించిందీ తక్కువే.  

నిజమాబాద్​కు జగిత్యాల వంద కి.మీ దూరం ఇక నాయకుల విషయానికొస్తే  2007 నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నవారు ఈ  ప్రాంతానికి అపరిచితులే. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి మినహా మిగతా వారు సామాన్యులకు తెలియరు. నిజానికి ఆ నియోజకవర్గం మొత్తానికి తెలిసిన నాయకుడే లేడనాలి. బి ఆర్ ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను చూసి గుర్తుపట్టేవారు ఈ జిల్లాలో తక్కువే. ఇక్కడ ఎవరినో తగ్గించి మాట్లాడటం కాదు. వంద కిలోమీటర్ల దాకా నేతగా తెలియాలంటే ఎవరికైనా కష్టసాధ్యమే.  

ఇలాగే జగిత్యాల జిల్లా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కొనసాగితే ఆ ప్రాంత అభివృద్ధి, కేంద్రం నుంచి రావలసిన నిధులు, స్థానిక సమస్యల గట్టి పట్టు కోల్పోయే అవకాశముంది. వచ్చే ఎన్నికల వరకైనా జగిత్యాలను తిరిగి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేయాలి. అంతవరకు గెలిస్తే మా ప్రాంతానికి ప్రత్యేకంగా ఏమి చేస్తారని అభ్యర్థులను నిలదీయక తప్పదు.

నిజామాబాద్​ ఎంపీ స్థానంలో జగిత్యాల జిల్లాకు అన్యాయం

ప్రస్తుత నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో నిజామాబాద్ జిల్లాకు చెందినవి 5 కాగా  కోరుట్ల, జగిత్యాల మాత్రం జగిత్యాల జిల్లాకు చెందినవి. నిజామాబాద్ పార్లమెంట్ ఓటర్లు 19 లక్షలుంటే అందులో 20 % మాత్రమే జగిత్యాల జిల్లాకు చెందినవారు. 80 % ఓట్లున్న నిజామాబాద్ జిల్లా ప్రాంతమే గెలుపోటములు నిర్ణయిస్తాయి కాబట్టి సమస్యల పట్టింపుకైనా, నిలబడే నాయకులైనా అక్కడికే పరిమితమయ్యే అవకాశాలు మెండు. నిజామాబాద్ సమస్య అనగానే పసుపు బోర్డు ఏర్పాటు హామీ ప్రధానంగా తెరపైకి వస్తుంది. ఆ పంట కేవలం నిజామాబాద్ జిల్లాలోనే అధికంగా వేస్తారు. జగిత్యాల ప్రాంతం వరి పంటకు ప్రసిద్ధి. అక్కడ వరి వంగడాల పరిశోధన కేంద్రం కూడా ఉంది. 

- బి.నర్సన్, 
సీనియర్​ జర్నలిస్ట్