సందర్భం ..ఇవి కాలేయానికి వద్దేవద్దు : ఆర్.వి. రాఘ‌‌వేంద్రరావు

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి కాలేయం (లివర్). ఇది జీర్ణవ్యవస్థతో మంచి అనుబంధం కలిగి ఉంటుంది. తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా.. జీర్ణమైన ఆహారాన్ని శరీరానికి అందేలా సమన్వయం​ చేస్తుంది లివర్. ఇదొక్కటే కాకుండా శరీరంలో జరిగే దాదాపు ఐదు వందలకు పైగా ఇతర ప్రక్రియలను కూడా ఒకేసారి లివర్​ కో – ఆర్డినేట్ చేస్తుంది. ఇలా నిరంతరంగా పనిచేయడం వల్ల లివర్​కు అనేక రకాలైన ఇబ్బందులు వచ్చే అవకాశముంది. అందులో భాగంగా వచ్చేదే హెపటైటిస్ ప్రాబ్లమ్​. ఈ నేపథ్యంలో హెపటైటిస్ గురించి  సీనియర్ డాక్టర్​ రాఘవేంద్రరావు చెప్తున్న వివరాలివి...

హెపటైటిస్ అంటే.. లివర్​ వాపు. హెపాటిక్ అంటే.. లివర్​కు సంబంధించినదని. ఇది గ్రీకు పదం. అసలు లివర్​ వాపు ఎందుకొస్తుంది అంటే.. అందుకు అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో మద్యం తాగడం, కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం, వైద్యుల సలహా లేకుండా విపరీతంగా మందులు వాడడం, కొన్ని రకాల ఆహారపదార్ధాలు, జన్యుపరమైన లోపాలు వంటి కారణాలతో లివర్ వాపు వచ్చే అవకాశం ఉంది. వాటికి వేర్వేరు ట్రీట్​మెంట్లు ఉంటాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. లివర్​ వాపు రావడానికి ముఖ్యమైన కారణం మాత్రం వైరల్ ఇన్ఫెక్షన్. అందుకని దాన్ని వైరల్ హెపటైటిస్ అంటారు. 

పబ్లిక్​ హెల్త్ పరంగా చూసినా.. అతి ముఖ్యమైన కారణం వైరల్​ ఇన్ఫెక్షన్ అని తెలుస్తోంది. ఈ ఇన్ఫెక్షన్​లో హెపటైటిస్ ఎ, బి, సి, ఇ అనే నాలుగు రకాలున్నాయి. 
హెపటైటిస్​ ఎ, ఇ బారిన పడేందుకు ముఖ్య కారణాలు... కలుషిత ఆహారం, నీరు తీసుకోవడం. మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోక పోవడం. ఆహారం వండేటప్పుడు, తినేటప్పుడు చేతులు శుభ్రంగా లేకపోవడం వల్ల హెపటైటిస్ ఎ, ఇ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ వైరస్​లు సోకినప్పుడు మందులు, మనలోని రోగ నిరోధక శక్తితో వ్యాధి తగ్గుతుంది. 

హెపటైటిస్​ బి, సి కారణాలు.. హ్యూమన్ బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్. లాలాజలం, ఇన్ఫెక్ట్​ అయిన వారి రక్త మార్పిడి, అన్ ప్రొటెక్టెడ్​ సెక్సువల్ ప్రాక్టీస్​ వల్ల ఒకరి నుంచి మరొకరికి హెపటైటిస్ వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్​లు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్​కు దారితీస్తాయి.

చికిత్స

హెపటైటిస్​ – బి వైరస్​కి వ్యాక్సిన్​ ఉంది. ఈ వ్యాక్సిన్​ను ఏ వయసు వారైనా వేయించుకోవచ్చు. పుట్టిన పిల్లల నుంచే వ్యాక్సిన్ వేయాలి. కానీ, అవగాహనా లోపం వల్ల చాలామందికి ఈ వ్యాక్సిన్​ అందుబాటులో ఉండట్లేదు. 

హెపటైటిస్ – సి వైరస్​కి ఈ మధ్యనే మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఆ మందులతో హెపటైటిస్​ సి పూర్తిగా నయమవుతుంది. 

లక్షణాలు సాధారణం

హెపటైటిస్ వైరస్ అనేది దాని తీవ్రత బట్టి లక్షణాలు చూపిస్తుంది. సాధారణంగా అయితే కామెర్లు కనిపిస్తాయి. జ్వరం వస్తుంది. ఎ, ఇ వైరస్​లు నాలుగైదు రోజుల్లో తెలుస్తాయి. అవి మందులతో తగ్గిపోతాయి. బి, సి వైరస్​లు బయటపడటానికే టైం పడుతుంది. అయితే, హెపటైటిస్ బి, సి వైరస్​ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై, లివర్ పాడైనా కూడా లివర్ ట్రాన్స్​ప్లాంటేషన్​తో ప్రాణాలు కాపాడొచ్చు. 

లివర్​ హెల్త్​కి కొన్ని జాగ్రత్తలు 

  • బాత్​రూంకి వెళ్లొచ్చాక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 
  • ఆహారం వండేటప్పుడు, తినేటప్పుడు చేతులు శుభ్రంగా ఉండాలి. 
  • కాచి చల్లార్చిన నీళ్లు లేదా ఫిల్టర్ వాటర్ తాగాలి. 
  • ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎ, ఇ వైరస్​ల బారిన పడకుండా ఉండొచ్చు. ఒకవేళ వైరస్​లు సోకినట్లయితే పసరు వైద్యాల జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే లోపల ఉన్న సమస్య తెలియకుండా పైకి కనిపించేదానికి మందు ఇవ్వడం వల్ల విపరీతమైన అనర్థాలు జరుగుతాయి. ఉదాహరణకు కామెర్లు అనేది ఒక రోగం కాదు. రోగ లక్షణం మాత్రమే. కామెర్లు రావడానికి వైరల్​ ఇన్ఫెక్షన్​ మాత్రమే కారణం కాదు. వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఏ విషయం తెలియకుండా గుడ్డిగా మందులు వాడడం సరికాదు. అంతేకాదు.. వయసుపైబడినవాళ్లు, గర్భిణీలకు ఈ వైరస్​ సోకితే ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

ఉద్దేశం ఇదే

వరల్డ్​ హెపటైటిస్​ డే.. ప్రతి ఏటా జులై 28న జరుగుతుంది. ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా లివర్​కు సంబంధించిన హెపటైటిస్ వ్యాధి,  ట్రీట్​మెంట్స్​ గురించి వివరంగా ప్రజలకు చెప్తారు. ప్రతి ఏటా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​వో) ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాలను పరిగణనలోకి తీసుకుని అవేర్​నెస్​ ప్రోగ్రామ్​లు​ నిర్వహిస్తుంటుంది. ఈ ప్రోగ్రామ్​కు ఒక థీమ్ కూడా పెడతారు. 

ఈ ఏడాది థీమ్​... ‘ఇట్స్ టైం ఫర్ యాక్షన్’. అంటే సమస్య గురించి చర్య తీసుకునే టైం ఇది అని అర్థం. ఎందుకంటే ప్రతి 30 సెకన్లకు హెపటైటిస్ సంబంధిత వ్యాధితో ఒక మరణం సంభవిస్తోంది. అందుకే నివారించే చర్యలను వేగవంతం చేయాలి. డయాగ్నసిస్, ట్రీట్​మెంట్ ద్వారా ప్రాణాపాయం తప్పించొచ్చు. ఇక మనదేశంలో చూస్తే... వైరల్​ హెపటైటిస్​ అనేది ఎక్కువ ఇక్కడ. అందుకు కారణం కలుషితమైన నీరు, ఆహారం. వీటి వల్లే హెపటైటిస్​ వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి ఆ రెండింటి విషయంలో కేర్​ఫుల్​గా ఉంటే కాలేయాన్ని కాపాడుకోవచ్చు.

డా. ఆర్.వి. రాఘ‌‌వేంద్రరావు
డైరెక్టర్ & సీనియర్ స‌‌ర్జిక‌‌ల్ గ్యాస్ట్రో ఎంట‌‌రాల‌‌జిస్ట్,​ 
లివ‌‌ర్ ట్రాన్స్ ప్లాంటేషన్ స‌‌ర్జన్
రెనోవా -ఎన్ ఐ జి ఎల్ హాస్పిటల్స్, హైదరాబాద్