అమిత్ చైర్మన్​ పదవికి సీనియర్ల బ్రేకులు !

  • గుత్తా అమిత్ రెడ్డికి తెలంగాణ డెయిరీ ఫెడరేషన్​చైర్మన్ పదవి ఇవ్వడంపై పెద్దల గుస్సా
  • హైకమాండ్​కు ఫిర్యాదుతో ఆగిన బాధ్యతల స్వీకరణ 
  • మంత్రుల కోటాలో చైర్మన్​పదవులు ఇచ్చాకే లైన్​క్లియర్​ 
  • అప్పటివరకు అమిత్​కు తప్పని నిరీక్షణ

నల్గొండ, వెలుగు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్​రెడ్డి కొడుకు గుత్తా అమిత్​రెడ్డి చైర్మన్ పదవికి నల్గొండ జిల్లా సీనియర్​కాంగ్రెస్ నాయకులు బ్రేకులు వేశారు. మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కోటాలో వాళ్ల అనుచరులకు చైర్మన్​పదవులు ఇచ్చాకే అమిత్ కు లైన్​క్లియర్ చేయాలని, అప్పటివరకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్స్​పెండింగ్​పెట్టేలా పార్టీ సీనియర్లు హైకమాండ్​ను ఒప్పించినట్లు తెలిసింది. ఈనెల 20న అమిత్​రెడ్డిని తెలంగాణ డెయిరీ ఫెడరేషన్​ చైర్మన్​గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాలో చాలా మంది సీనియర్​నాయకులు నామినేటెడ్​​పదవులు కోసం నిరీక్షిస్తున్నారు. 

పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ తమను కాదని.. నిన్నగాక మొన్న వచ్చిన అమిత్​కు చైర్మన్ పదవి ఇవ్వడంపై సీనియర్​నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కోటాలో నల్గొండ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ గుమ్మల మోహన్​రెడ్డి, పార్టీ సీనియర్​నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడు డీసీసీ ప్రెసిడెంట్​శంకర్​నాయక్, నాగార్జునసాగర్​కు చెందిన కొండేటి మల్లయ్య (ఎస్సీ) తదితరులు నామినేటెడ్​పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి ఎంపీ ఎన్నికల ప్రచారంలో మోహన్​ రెడ్డికి తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. 

ఇక డీసీసీ ప్రెసిడెంట్​శంకర్​నాయక్​కు ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్​ఈ మూడింటిలో ఏదో ఒకటి కచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. నకిరేకల్​ఎమ్మెల్యే టికెట్​ఆశించిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొండేటి మల్లయ్యకు ఎన్నికల టైంలో సీఎం రేవంత్​రెడ్డి, జానారెడ్డి నామినేటెడ్​ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతోనే మల్లయ్య ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు.

 ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాదాద్రి, సూర్యాపేట జిల్లాలకు చెందిన లీడర్లకు కార్పొరేషన్​పదవులు లభించాయి. వీళ్లలో ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన బండ్రు శోభారాణికి సైతం కార్పొరేషన్​చైర్మన్ పదవి​దక్కింది. నల్గొండ జిల్లాలో ఒక్కరికి కూడా నామినేటెడ్ పదవి రాలేదు. త్వరలో కేబినెట్​విస్తరణ ఉంటుందని, దీంతో పాటే నామినేటెడ్​పోస్టులు కూడా అనౌన్స్​చేస్తారని భావించారు. కానీ సీఎం రేవంత్​రెడ్డితో కలిసి అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన కొద్దిరోజులకే అమిత్​ఒక్కడి పేరును ప్రకటించడంపై జిల్లా సీనియర్లు మంత్రుల వద్ద సీరియస్ అయినట్టు తెలిసింది. 

పార్టీలో తప్పుడు సంకేతాలు..

పార్లమెంట్​ఎన్నికల ముందు పార్టీలో చేరిన అమిత్​కు అతి తక్కువ టైంలోనే చైర్మన్​పదవి ఇవ్వడంతో తప్పుడు సంకేతాలు పోతాయని, నాయకులు, కార్యకర్తలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తదని హైకమాండ్ వద్ద ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అమిత్​కు పదవి ఇవ్వడంలో మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి అభ్యంతరం లేకున్నా ఆశావాహలతో కలిపి ఆర్డర్స్​ఇచ్చినట్లయితే ఆమోదయోగ్యంగా ఉండేదని అంటున్నారు. 

ALSO READ : ఏక్​ఫస్​లా పట్టాలతోనే చెరువులకు ఎసరు

గుమ్మల మోహన్​రెడ్డికి కార్పొరేషన్​చైర్మన్​ఇవ్వాలని మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్​రెడ్డి పార్టీ హైకమాండ్​కు సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని పరిశీలించాలని, అప్పటివరకు అమిత్​ చైర్మన్​బాధ్యతలు తీసుకోకుండా పెండింగ్​లో ఉంచాలని జిల్లా సీనియర్లు హైకమాండ్​ను కోరినట్టు తెలిసింది. 

మంత్రి ఉత్తమ్ ఢిల్లీ పర్యటనతో మారిన పరిణామాలు..

అధిష్టానం ఆహ్వానం మేరకు ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్​రెడ్డి ఢిల్లీ వెళ్లొచ్చిన కొద్దిరోజులకే ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేబినెట్​లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి బెర్త్​ కన్ఫార్మ్​అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇదే క్రమంలో మంత్రి ఉత్తమ్​భార్య కోదాడ ఎమ్మెల్యే పద్మావతి సైతం కేబినెట్​ హోదా కోసం కార్పొరేషన్​ చైర్మన్ ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలిసింది. 

ఉత్తమ్​మంత్రిగా వ్యవహరిస్తున్న సివిల్​సప్లై శాఖ కార్పొరేషన్​చైర్మన్​పదవి ఆమె ఆశిస్తున్నట్టు సీనియర్లు చెప్తున్నారు. మరోవైపు ఎస్టీ కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్ సైతం మంత్రి పదవి వస్తదనే నమ్మకంతో ఉన్నారు. ఇంతమంది సీనియర్లు పదవుల కోసం ఎవరికి వాళ్లు గట్టి ప్రయత్నాలు చేస్తుంటే చడీచప్పుడు కాకుండా అమిత్​పేరు ప్రకటించడంతో జిల్లా సీనియర్లు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.