తగ్గిన సీడ్ పత్తి దిగుబడి..వరుస వానలు, వాతావరణంలో మార్పులతో ఎఫెక్ట్

  • ఎకరాకు రూ. లక్షకు పైగా లాస్
  • ఆందోళనలో రైతులు

గద్వాల, వెలుగు : వరుస వానలు, మబ్బులతో సీడ్  పత్తి దిగుబడి ఈ సారి సగానికి పైగా తగ్గింది. ఎకరాకు రూ. లక్ష వరకు లాస్  వస్తుండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వాతావరణంలో మార్పులతో సీడ్  పత్తి పంటపై ఎఫెక్ట్  పడిందని రైతులు చెబుతున్నారు. వరుస వానలకు పత్తి కాయలు నిలబడలేదని, వాతావరణంలో మార్పులతో పంట తీవ్రంగా దెబ్బతిని ఎకరాకు 100 నుంచి 200 సీడ్  ప్యాకెట్ల వరకు దిగుబడి తగ్గుతుందని అంటున్నారు. ఈ ఏడాది ఖర్చు పెరిగినా దిగుబడి అంతంతమాత్రంగానే ఉండడంతో నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.

40 వేల ఎకరాల్లో సాగు..

జోగులాంబ గద్వాల జిల్లా సీడ్  పత్తి పంటకు పెట్టింది పేరు. దాదాపు 40 వేల ఎకరాల్లో సీడ్ పత్తి సాగు చేశారు. ప్రతి రైతు తనకున్న కొద్దిపాటి పొలంలో కొంత సీడ్​ పత్తి సాగు చేస్తాడు. కుటీర పరిశ్రమగా సీడ్  పత్తి పంటను సాగు చేసుకుంటుండగా, వానలు, వాతావరణంలో మార్పులతో క్రాసింగ్  చేసే సమయంలోనే కాయలు పట్టకపోవడం, క్రాసింగ్  చేసిన పుప్పొడి పత్తి మొగ్గపై ఉండకుండా రాలిపోవడంతో క్వాలిటీ సీడ్  రావడం లేదని  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎకరాకు లక్షకు పైగా లాస్..

సీడ్​ పంటను సాగు చేయాలంటే ప్రతి రైతు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు ఖర్చు చేస్తుంటాడు. ఒక ఎకరా సీడ్  పత్తి పంట పెడితే 5 నుంచి ఆరుగురు కూలీలు మూడు నెలల పాటు క్రాసింగ్  చేస్తారు. ఫౌండేషన్  సీడ్స్, కలుపు తీయడం, పురుగు మందులు, ఫర్టిలైజర్  తదితర వాటికి ఖర్చు పెట్టాలి. ఎకరాకు 500 నుంచి 600 ప్యాకెట్ల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోవడంతో ఎకరాకు 100 నుంచి 200 ప్యాకెట్లు దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. ఒక్కో ప్యాకెట్ కు రూ.500 నుంచి రూ.600 వరకు ధర పలుకుతుంది. ఈ లెక్కన ఒక్కో రైతు రూ.లక్ష వరకు నష్టపోయే అవకాశం ఉంది.

సీడ్  ఫెయిల్  అయితే నిండా మునగాల్సిందే..

రైతులు పండించిన పంట జెర్మినేషన్ (గింజలు మొలకెత్తే శాతం) ఆధారంగా పాస్, ఫెయిల్ గా నిర్ణయిస్తారు. ఒకవేళ రైతులు పండించిన పంట పాస్  అయితే ఎకరాకు లక్ష వరకు లాస్  రానుంది. వానలకు సుంకు నిలబడక క్వాలిటీ సీడ్  రాకుండా జెర్మినేషన్ లో ఫెయిల్  అయితే ఆ రైతుకు కంపెనీలు, ఆర్గనైజర్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. దీంతో రైతు నిండా మునగాల్సిందే. పెట్టిన పెట్టుబడిలో ఒక్క రూపాయి కూడా చేతికి రాదు. ఆర్గనైజర్లు ఇచ్చిన పెట్టుబడి డబ్బులు వడ్డీతో 
సహా కట్టాల్సిందే.

250 ప్యాకెట్లు తగ్గాయి..

రెండెకరాల్లో సీడ్  పత్తి సాగు చేశాను. వానలు కురవడంతో 250 ప్యాకెట్లు తక్కువగా వచ్చాయి. నాకు రూ.2.50 లక్షల వరకు నష్టం వస్తుంది.-  శ్రీనివాసులు, రైతు, ధరూర్