మూసీ ప్రాజెక్టుకు పూడిక కష్టాలు!..రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ 4.46 టీఎంసీలు      

  • పూడిక సమస్యతో టీఎంసీకి చేరిన సామర్థ్యం 
  • 30 వేల నుంచి 15 వేల ఎకరాలకు తగ్గిన ఆయకట్టు
  • భారీగా వరద వస్తున్నా నిల్వ చేసుకునే పరిస్థితి లేదు
  • బోర్లు, బావుల నీటితోనే పంటలు సాగు చేస్తున్న రైతులు 
  • పూడిక తీస్తేనే ప్రాజెక్టుకు భవిష్యత్ అంటున్న నిపుణులు

నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ తర్వాత  రెండో పెద్ద ప్రాజెక్ట్ మూసీ. కృష్ణానదికి ప్రధాన ఉప నది అయిన మూసీపై రిజర్వాయర్ ను నిర్మించారు. ప్రస్తుతం పూడిక సమస్యతో ప్రాజెక్ట్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. నిండా నీరున్నా రైతులకు ఉపయోగం లేకుండా పోతుంది. ప్రాజెక్ట్ నిర్మించి ఏడు దశాబ్దాలు దాటినా రిజర్వాయర్ లో పూడిక తొలగించలేదు.  మూసీ ప్రాజెక్టును1963లో 645 అడుగుల (4.46 టీఎంసీలు)నీటి నిల్వ సామర్థ్యంతో రూపకల్పన చేసి నిర్మించారు.

పూడికను బయటకు పంపేందుకు వీలుగా10 స్కవర్‌‌ గేట్లు, వరద నీటిని దిగువకు వదిలేందుకు ఎనిమిది క్రస్ట్ గేట్లు, 12 రెగ్యులేటరీ గేట్లు ఏర్పాటు చేశారు. ఏటేటా పెరుగుతున్న పూడికతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. తద్వారా ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు  ప్రాజెక్టులో నిండుగా నీళ్లుంటున్నా  బావులు, బోర్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఉంది.  గత ప్రభుత్వాలు ఏనాడూ ప్రాజెక్టు ఆధునీకరణను పట్టించు కోలేదు.   

రికార్డు స్థాయిలో ప్రాజెక్ట్ లోకి వరద

 1996లో చేపట్టిన సర్వే మేరకు అప్పటికే ప్రాజెక్టులో 13 అడుగుల పూడిక పేరుకోగా.. సుమారు 1 టీఎంసీ నీటి సామర్థ్యం కోల్పోయింది. ప్రస్తుతం 30 ఏండ్ల తర్వాత మరో 2 టీఎంసీలకు తగ్గిపోగా..  ప్రస్తుతం1 టీఎంసీ మాత్రమే నీటి నిల్వకు అవకాశం ఉంది. దీనికి తోడు ప్రాజెక్టులో ఇసుకమేటను తొలగించేందుకు  ఏర్పాటు చేసిన సిల్ట్‌‌ గేట్లు గతంలో వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. వాటికి మరమ్మతు చేయకుండా సిమెంట్‌‌తో శాశ్వతంగా మూసి వేశారు. ఫలితంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభావం పడింది.

2023 సమ్మర్ లో కృష్ణ బేసిన్ లో సరైన వర్షాలు లేక శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండలేదు. మూసీ ప్రాజెక్ట్ కు భారీగా వరద వచ్చింది. అప్పుడు  మే నెలలోనే మూడు సార్లు గేట్లు ఎత్తడం గమనార్హం. అదే ఏడాది 24 టీఎంసీలకు పైగా నీటిని ప్రాజెక్ట్ నుంచి బయటకు వదిలారు. 2024లోనూ దాదాపు 30 టీఎంసీలకు పైగా రికార్డ్ స్థాయిలో వరదనీటిని కిందకి పంపారు.  ఇంతగా వరద వస్తున్నప్పటికీ పూడిక సమస్య కారణంగా ప్రాజెక్ట్ సామర్థ్యానికి అనుగుణంగా నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది.  

తగ్గుతున్న ఆయకట్టు..

ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నకిరేకల్‌‌, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని 40 గ్రామాల్లో 41,800 ఎకరాల్లో ఆయకట్టుకు  నీటిని అందించేలా ప్రాజెక్ట్ ను నిర్మించారు. ఆశించిన మేరకు పరివాహక ప్రాంతాల నుంచి వరద నీరు ప్రాజెక్టులో చేరకపోవడంతో 1973లో దీనిని ఆరుతడి పంటల సాగుకు నీటిని అందించే ప్రాజెక్టుగా అధికారులు మార్చారు.  సాగు విస్తీర్ణాన్ని 33 వేల ఎకరాలకు కుదించారు.

ఆ తర్వాత 30వేల ఎకరాల ఆయకట్టుకే  పరిమితం చేశారు.  ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 2 టీఎంసీల కంటే తక్కువకు పడిపోవడంతో  ఆయకట్టు కూడా15 వేలకు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వాయర్లలో పూడికతీతకు చర్యలు చేపట్టడంతో మూసీ ప్రాజెక్ట్ లో సైతం తొలగించాలని   రైతుల నుంచి డిమాండ్ పెరుగుతుంది.  ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం మేరకు పూడికతీత తీయకుంటే భవిష్యత్ లో ప్రాజెక్ట్ ప్రశ్నార్థకంగా మారుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.