పోలీసుల గుప్పిట్లోనే జైనూర్

  • 22వ రోజకు చేరిన 144 సెక్షన్ 
  • ఇంకా తెరవని దుకాణాలు
  • నాలుగు మండలాలకు స్టార్ట్ కాని ఇంటర్నెట్ సేవలు

ఆసిఫాబాద్, వెలుగు: ఆదివాసీ మహిళపై అత్యాచారయత్నం, హత్యాయత్నం అనంతరం జైనూర్​లో జరిగిన ఘటనల అనంతరం అమలైన 144 సెక్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దుకాణాలు తెరవకపోవడంతో ప్రజలు నిత్యావసరాలు, ఇతర పనులకు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 5న ఇరువర్గాలు సృష్టించిన విధ్వంసం అనంతరం పోలీసులు అమలు చేసిన 144 సెక్షన్ 22వ రోజుకు చేరింది. మండల కేంద్రంలోని మార్కెట్ ఇప్పటికీ తెరుచుకోవడం లేదు. జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్, కెరమెరి ఏజెన్సీ మండలాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సేవలు ఇంకా ప్రారంభం కాలేదు.

 దీంతో ప్రభుత్వ శాఖల అన్ లైన్ సేవలు స్తంభించిపోయాయి. జైనూర్ ఎస్​బీఐ బ్యాంకులో లావాదేవీలు కొనసాగడంలేదు. క్రాఫ్ లోన్ తీసుకునే రైతులు రుణ సదుపాయానికి దూరమవుతున్నారు. జైనూర్ మండల కేంద్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు తెరుచుకోకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. మీసేవా కేంద్రాల బంద్ కారణంగా కుల, నివాస, ఆదాయం, బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూడక తప్పడంలేదు.

నిత్యవసరాలకు ఉట్నూర్​కు....

జైనూర్ సమీపంలోని లింగాపూర్, సిర్పూర్ యు మండలాల ప్రజలకు జైనూర్ మార్కెట్​ఆధారం కావడంతో నిత్యవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల వాసులు ఇబ్బందులు పడుతున్నారు. 22 రోజులుగా వ్యాపార సంస్థలు, దుకాణాలు తెరవకపోవ డంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉట్నూర్ మార్కెట్​ను ఆశ్రయించి వెళ్లాల్సి వస్తోంది. 144 సెక్షన్ సడలింపుతో మండల కేంద్రం నుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న పశువుల సంత ఏర్పాటు చేసే చోట కూరగాయల మార్కెట్ కు అనుమతి ఇచ్చారు. దీంతో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు కొనుగోలుకు పోలీసులు అవకాశం కల్పించారు. అయితే కొద్ది సమయమే కావడంతో కూరగాయలు అమ్మే వ్యాపారస్తులు మక్కువ చూపకపోవడంతో అక్కడ కూడా కూరగాయలు దొరకలేని పరిస్థితి ఏర్పడింది.

ముమ్మరంగా తనిఖీలు

శాంతిభద్రతలు నెలకొల్పేందుకు అధికారులు, పోలీసులు అన్నిచర్యలు తీసుకుంటున్నారు. 144 సెక్షన్ నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైనూర్ వైపు వచ్చే వెహికల్స్​ను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. వచ్చిపోయే వాహనాల నంబర్లను ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిత్యం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆదివాసీ గ్రామ పెద్దలు, పటేళ్లు, రాయి సెంటర్ సార్ మేడీలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ శాంతియుత వాతావరణం కోసం కృషి చేస్తున్నారు.