సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి : కృష్ణ, రాజు

 

  • 23వ రోజు చేతులకు సంకెళ్లతో ఉద్యోగుల నిరసన
     
    నల్గొండ అర్బన్, వెలుగు: సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతూనే ఉంది. బుధవారం 23వ రోజున ఉద్యోగులు చేతులకు సంకెళ్లు వేసికొని నిరసన తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​వద్ద సమగ్ర ఉద్యోగుల సంఘం ఆ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ, రాజు మాట్లాడుతూ.. విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులుగా రాష్ట్రవ్యాప్తంగా 19,300 మంది వివిధ విభాగాలలో పనిచేస్తున్నారని, వారికి సరైన వేతనం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

13 సెప్టెంబర్ 2023లో హనుమకొండలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి రూ.10 లక్షల, ఆరోగ్య బీమాను కల్పించాలని కోరారు. సమ్మెకు వివిధ ఉపాధ్యాయ, రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం నేతలు నీలాంబరి, కొండ చంద్రశేఖర్, గుమ్మల మంజులారెడ్డి, సావిత్రి, పుష్పలత, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.