ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు సగం కూడా ప్రాసెస్ కాలే..

  • దరఖాస్తుదారుల నుంచి రెస్పాన్స్‌‌‌‌ అంతంత మాత్రమే 
  • ఉమ్మడి జిల్లాలో 600 ప్రొసీడింగ్స్‌‌‌‌ జారీ 
  • సరైన పేపర్లు అప్ లోడ్ చేయనివారికి షార్ట్ ఫాల్ నోటీసులు
  • వెరిఫికేషన్ పూర్తయిన వారికి ఫీ ఇంటిమేషన్ లెటర్ల జారీ 

కరీంనగర్, వెలుగు : కరీంనగర్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల పరిశీలన నత్తనడకన సాగుతోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు దాటినా సగం అప్లికేషన్లు కూడా ఇప్పటివరకు పరిశీలనకు నోచుకోలేదు. అయితే 10 రోజుల క్రితం వరకు ఎల్ఆర్ఎస్ పోర్టల్ లో టెక్నికల్ ఎర్రర్ వల్ల అప్లికేషన్లు కనిపించకపోవడం, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో సిబ్బంది కొరత కారణంగానే దరఖాస్తుల పరిశీలన మందగించినట్లు తెలిసింది.

 శనివారం నాటికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, 14 మున్సిపాలిటీల్లో కలిపి ల్యాండ్ రెగ్యులరైజేషన్ కోసం 1,13,346 అప్లికేషన్లు రాగా, ఇప్పటి వరకు 40,093 అప్లికేషన్లు మాత్రమే ప్రాసె స్ అయ్యాయి. వీటిలో 1,145 అప్లికేషన్లు రిజెక్ట్ కాగా, 9,218 మంది దరఖాస్తుదారులకు షార్ట్ ఫాల్ నోటీసులు జారీ చేశారు. మూడు దశల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యాక 8,970 అప్లికేషన్లకు సంబంధించి ఫీజు చెల్లించేందుకు లెటర్లు అందజేశారు. ఫీజు కూడా చెల్లించిన 600 ఫ్లాట్లకు ప్రొసీడింగ్స్‌‌‌‌ జారీ చేశారు. ఇప్పటివరకు ఎల్ఆర్ ఎస్ ద్వారా ఆయా మున్సిపాలిటీలకు రూ.4.45 కోట్ల ఆదాయం సమకూరింది. 

కరీంనగర్ బల్దియాలో అత్యధిక అప్లికేషన్లు 

ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధికంగా 26,850 అప్లికేషన్లు రాగా ఇందులో 10,537 ప్రాసెస్ అయ్యాయి. ఇందులో 121 రిజెక్ట్ కాగా పేపర్లు అప్ లోడ్ చేయని, వివరాలు నమోదు చేయని 248 దరఖాస్తులకు షార్ట్ ఫాల్ నోటీసులు జారీ చేశారు. 567 అప్లికేషన్ల ప్రాసెస్ పూర్తి చేసి ఫీ ఇంటిమేషన్ లెటర్లు ఇవ్వడంతోపాటు చార్జీలు చెల్లించిన 155 ప్లాట్లకు ఫైనల్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. తద్వారా బల్దియా, సుడాకు రూ.2 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఎల్ ఆర్ఎస్ ప్రక్రియలో రామగుండం కార్పొరేషన్ ముందంజలో ఉంది. 7,078 అప్లికేషన్లకుగాను ఇప్పటివరకు 6,653 అప్లికేషన్లను ప్రాసెస్ చేసి 3569 దరఖాస్తులకు ఫీ ఇంటిమేషన్ లెటర్లు ఇచ్చేశారు. 


వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 16,216 అప్లికేషన్లు రాగా, 4060 ప్రాసెస్ కాగా, 2,178 అప్లికేషన్లకు షార్ట్ ఫాల్ నోటీసులు ఇవ్వగా, 902 ఫీ ఇంటిమేషన్ లెటర్లు ఇచ్చారు. సిరిసిల్లలో 10,492 అప్లికేషన్లకు 4,369, పెద్దపల్లి మున్సిపాలిటీలో 9,675 అప్లికేషన్లకు 2838, కోరుట్లలో 9,143 అప్లికేషన్లకు 2,369, జగిత్యాలలో 8,003 అప్లికేషన్లకు 1,843, హుజురాబాద్ లో 3,981 అప్లికేషన్లకు 851, జమ్మికుంటలో 5,904 అప్లికేషన్లకు 1,079, కొత్తపల్లిలో 2,660 అప్లికేషన్లకు 1,087, మెట్ పల్లిలో 6,538 అప్లికేషన్లకు 1,238, రాయికల్ లో 1,898కి 349, ధర్మపురిలో 1,011కి 640, సుల్తానాబాద్ లో 1,531కి 766, మంథనిలో 894 అప్లికేషన్లకు 875 అప్లికేషన్లు ప్రాసెస్ అయ్యాయి.   

దరఖాస్తుల నుంచి స్పందన అంతంతమాత్రమే

ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల గురించి ఆరా తీయడం, ఫీజు చెల్లించే విషయంలో దరఖాస్తుదారుల నుంచి స్పందన ఆశించినంతగా లేదని తెలిసింది. దీంతో ఫీజు ఇంటిమేషన్ లెటర్ అందుకున్నవాళ్లలో చాలా మంది చార్జీలు చెల్లించడంలేదు. దీంతో ప్రొసిడింగ్ లెటర్లు జారీ కావడం లేదు. అయితే ఎల్ఆర్ఎస్ చార్జీల చెల్లింపు విషయంలో ఎలాంటి బలవంతం లేదని, దరఖాస్తుదారులు వీలును బట్టి చెల్లించవచ్చని ఆఫీసర్లు చెప్తున్నారు.

 మూడు దశల్లో పరిశీలన.. 

సర్కార్ గైడ్ లైన్స్ ప్రకారం.. అప్లికేషన్ల పరిశీలన మూడు దశల్లో అవుతోంది. లెవల్ -1లో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్, ఇరిగేషన్ ఇంజినీర్ ఉంటారు. ఈ దశలోనే అప్లికేషన్లను యాక్సెప్ట్ చేయడమో, రిజెక్ట్ చేయడమో చేస్తారు. అలాగే పేపర్లు, ఇతర వివరాలు లేకపోతే షార్ట్ ఫాల్ నోటీసులు జారీ చేస్తారు. ఎల్ 1 యాక్సెప్ట్ చేసిన దరఖాస్తులు ఎల్ 2కు వెళ్తాయి. ఈ లెవల్ లో టౌన్ ప్లానింగ్ ఏసీపీ స్థాయి ఆఫీసర్, డీటీసీపీ, సీపీవో పరిశీలించి లెవల్ -3కు ఫార్వర్డ్ చేస్తారు. ఎల్ 3లో కమిషనర్(మున్సిపాలిటీ అయితే), జిల్లా పంచాయతీ ఆఫీసర్(జీపీ) అప్లికేషన్లను పరిశీలిస్తారు. ఎల్ 3 తర్వాత ఫీజు ఇంటిమేషన్ లెటర్లు దరఖాస్తుదారులకు వెళ్తాయి. వారు నిర్ధారించిన ఫీజు చెల్లిస్తే ప్రొసిడింగ్ కాపీలు జనరేట్ అవుతాయి.