మన చేతులు తెగితే మళ్లీ మొలుస్తాయా!

  • మనుషుల్లోనూ ‘స్టార్ ఫిష్’ హార్మోన్ ఉందంటున్న సైంటిస్టులు

లండన్: బల్లులపై గద్దలు, పక్షులు, పాములు, కుక్కల వంటివి దాడి చేసినప్పుడు అవి పుటుక్కున తోకను తెగ్గొట్టుకుని తప్పించుకుంటుంటయి. కొన్ని రకాల పాములు కూడా గద్దలు, ఇతర జీవుల నుంచి ప్రమాదాలు ఎదురైనప్పుడు చటుక్కున తోకలను తెగ్గొట్టుకుని బతుకు జీవుడా అనుకుంట పారిపోతుంటయి. అలాగే సముద్రంలో ఉండే స్టార్ ఫిష్ లు కూడా పీతలు, చేపలు, ఇతర జంతువులు దాడి చేసి పట్టుకున్నప్పుడు వెంటనే తమ భుజాలను తెగ్గొట్టుకుని ప్రాణాలు దక్కించుకుంటయి. అలా తోకలు పోగొట్టుకున్న బల్లులకు, పాములకు ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ కొత్త తోకలు పెరుగుతాయి. 

స్టార్​ఫిష్ లకు కూడా కొత్త భుజాలు పునరుత్పత్తి అవుతాయి. అయితే, ఆటోటోమీ అనే ఈ ప్రక్రియ ఇతర జంతువులతోపాటు మనుషుల్లోనూ సాధ్యమేనంటున్నారు బ్రిటన్ లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్​కు చెందిన సైంటిస్టులు! కాళ్లు, చేతులు వంటివి కోల్పోయినప్పుడు పూర్తిగా కొత్తవి పుట్టకపోయినా.. కణజాల  పునరుత్పత్తితో 
గాయాలను మాత్రం సహజంగా, మరింత సమర్థంగా రిపేర్ చేసేందుకు,  వీలు కావచ్చని చెప్తున్నారు.

మనుషుల్లోనూ ‘ఆటోటోమీ’ హార్మోన్

బల్లులు, స్టార్ ఫిష్​ల మాదిరిగా మనుషుల్లోనూ కోల్పోయిన అవయవాలను తిరిగి పెరిగేలా చేయడం సాధ్యమేనా? అన్నదానిపై సైంటిస్టులు ఎప్పటినుంచో రీసెర్చ్​ చేస్తున్నారు. లండన్ వర్సిటీ సైంటిస్టులు కూడా ఇదే కోణంలో అస్టీరియాస్ రూబెన్స్ అనే యూరోపియన్ స్టార్ ఫిష్​పై తాజాగా పరిశోధన చేశారు. సముద్రంలో ఇతర జంతువులు ఈ స్టార్ ఫిష్​లను తినేందుకు వచ్చి భుజాన్ని పట్టుకోగానే.. వీటిలో ‘ఏఆర్ఎస్ కే/సీసీకే1’ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదలవుతుందని, ఫలితంగా కొద్దిసేపట్లోనే వీటి భుజం వద్ద కండరాలపై విపరీతమైన ఒత్తిడి పెరిగి బ్రేక్ అవుతుందని కనుగొన్నారు. 

అలాగే మనుషుల్లో ఆకలిని నియంత్రించే హార్మోన్​కు, స్టార్ ఫిష్​లో ఉన్న స్ట్రెస్ హార్మోన్​కు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని కూడా గుర్తించారు. స్టార్ ఫిష్ ఆటోటోమీ ప్రక్రియలో న్యూరోహార్మోన్ల పాత్ర, కణజాలాల్లో జరిగే క్లిష్టమైన మార్పులపై తమ పరిశోధనలో కీలక వివరాలు తెలిశాయని రీసెర్చ్​కు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మారిస్ ఎల్ఫిక్ తెలిపారు. దీనిపై మరింత స్టడీ చేసి ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటే మనుషుల్లోనూ అవయవాలు, కండరాల గాయాలు సహజంగానే రిపేర్ అయ్యేలా చేసేందుకు రీజనరేటివ్ మెడిసిన్ విభాగంలో కొత్త చికిత్సలను రూపొందించేందుకు వీలవుతుందన్నారు. వీరి రీసెర్చ్ వివరాలు ‘కరెంట్ బయాలజీ’ జర్నల్​లో ఇటీవల పబ్లిష్ అయ్యాయి.