నేచర్‌‌‌‌ కావలంటే పారాసైట్స్​ అవసరమే! 

పరాన్నజీవులు.. ఏ పనిచేయకుండా, అసలు కష్టమనేదే లేకుండా ఇతర జీవుల మీద ఆధారపడి బతికేస్తుంటాయి. అందుకే వాటిని అందరూ చులకనగా చూస్తారు. ఏ పని చేయకుండా ఎవరైనా ఇంట్లో కూర్చుని తింటుంటే.. వాళ్లను పరాన్నజీవుల (పారా సైట్స్‌‌)తో పోలుస్తుంటారు. కానీ.. ఇక నుంచి పరాన్నజీవులను అంత తేలికగా తీసేయొద్దు. ఎందుకంటే.. అవి లేకుంటే ప్రకృతి మనుగడే లేదు. వాటివల్ల నేచర్‌‌‌‌కి ఎంతో మంచి జరుగుతుందని చెప్తున్నారు సైంటిస్ట్‌‌లు. 

చెల్సీ వుడ్‌‌ చిన్నతనంలో ఒక ఐల్యాండ్‌‌కి వెళ్లింది. అక్కడ తీర ప్రాంతంలో రాళ్ల కింద కనిపించిన కొన్ని నత్తలను ఇంటికి తీసుకెళ్లి బకెట్లలో వేసింది. వాటిని చాలా రోజులపాటు పెంచిన తర్వాత బయట పారేసింది. చిన్నప్పుడు వాటిని చూసినప్పుడు ఆమెకు వింతగా ఏమీ అనిపించలేదు. కానీ.. పెద్దయ్యాక వాటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయింది. వాటిలో ప్రతి ఒక్క నత్తా పారాసైట్ల వల్ల ఇబ్బంది పడుతోంది. వాటి బయోమాస్‌‌లో 50 శాతం పారాసైట్స్‌‌ ఉన్నాయి. అంటే ఆమె చిన్నప్పుడు బకెట్‌‌లో వేసింది నత్తలను కాదు.. ఒక రకంగా చెప్పాలంటే పరాన్నజీవులని పెంచింది. 

నత్తలే కాదు.. ఇలా పారాసైట్స్‌‌తో నిండిన ఎన్నో జీవులు భూమ్మీద ఉన్నాయి. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌‌లో పారాసైట్‌‌ ఎకాలజిస్ట్‌‌ (పరాన్నజీవుల పర్యావరణ శాస్త్రవేత్త)గా పనిచేస్తున్న వుడ్‌‌ పరాన్నజీవులను ‘‘పప్పెట్ మాస్టర్స్” అంటోంది. ఎందుకంటే.. కొన్ని రకాల పారాసైట్స్‌‌ ఒక జీవి మెదడుని కూడా కంట్రోల్‌‌ చేస్తాయి కాబట్టి. 

ప్రకృతికి విలన్స్​

కొన్ని కారణాల వల్ల ఎన్నో శతాబ్దాల నుంచి పరాన్నజీవులను ప్రకృతికి విలన్లుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఇవి అప్పుడప్పుడు మనుషులకు, పశువులకు హాని చేస్తుంటాయి. పైగా వాటి హోస్ట్‌‌లను ఇబ్బంది పెడతాయని నమ్ముతారు. కానీ.. ఇప్పుడు చాలామంది సైంటిస్ట్‌‌లు ‘పరాన్నజీవులు చేసే చెడు కంటే మంచే ఎక్కువ’ని చెప్తున్నారు. 

పీతల్లో... 

రీసెర్చ్‌‌ సైట్స్​లో ఒకటైన వాషింగ్టన్ రాష్ట్రంలోని టిట్‌‌లో పీతల మీద పరిశోధనలు చేశారు వుడ్. అదే బీచ్‌‌లో 1960ల్లో కూడా రీసెర్చ్ చేశారు. అప్పట్లో ఆ నీళ్లు చాలా కలుషితంగా ఉండేవి. ఆ తర్వాత అర్ధ శతాబ్దానికి వుడ్‌‌ ఇక్కడ శాంపిల్స్‌‌ కలెక్ట్‌‌ చేసింది. అప్పటితో పోలిస్తే.. ఇప్పటికీ బీచ్ చాలా మారిపోయింది. నీళ్లు శుభ్రంగా ఉన్నాయి. పక్షులు తిరిగి వచ్చేశాయి. అక్కడి పీతలు ఇదివరకటితో పోలిస్తే.. ఇప్పుడు ట్రెమటోడ్‌‌ అనే పారాసైట్స్‌‌ చాలా ఎక్కువగా కనిపించాయి. పీతలు, పక్షులు మధ్య ఒకదాని నుంచి మరోదానికి దూకే పారాసైట్స్‌‌ ఇవి. అక్కడి పరిస్థితుల్లో మార్పు రావడానికి ఈ పరాన్నజీవులే కారణమని చాలామంది సైంటిస్ట్‌‌లు భావిస్తున్నారు. అలాగే పర్యావరణ వ్యవస్థలు వృద్ధి చెందడానికి అవి అవసరమని వాదిస్తున్నారు కూడా. 

ఎల్లోస్టోన్‌‌ నేషనల్‌‌ పార్క్‌‌

ఎల్లోస్టోన్ నేషనల్‌‌ పార్క్‌‌లో 1920ల్లో బూడిద రంగు తోడేళ్ళు ఉండేవి. కానీ.. వాటిని ఒక్కొక్కటిగా ఆ పార్క్‌‌ నుంచి తరలించారు. పార్క్‌‌లో తోడేళ్ల సంఖ్య తగ్గిన తర్వాత ఎల్క్(ఒక రకమైన జింక జాతి) సంఖ్య విపరీతంగా పెరగడం మొదలైంది. అవే పార్క్‌‌ అంతటా.. మందలు మందలుగా కనిపించాయి. చివరికి అక్కడున్న మిగతా జంతువులను తరిమికొట్టడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఆ పార్క్‌‌లో ఉండే బీవర్లను తరిమేశాయి.

ఇవి నీటి ప్రవాహానికి కర్రలు, ఆకులతో అడ్డుకట్ట వేసి ఒక డ్యామ్‌ల కడతాయి. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఆ డ్యామ్‌‌లను రిపేర్‌‌‌‌ చేసేవి కూడా ఇవే. అలాంటి బీవర్ల సంఖ్య తగ్గిపోవడంతో పార్క్‌‌లోని కాలువలు, వాగుల్లో నీళ్లు తగ్గిపోయాయి. దాంతో పరిస్థితి గందరగోళంగా మారింది. దీనంతటికీ బూడిద రంగు తోడేళ్లు ఇక్కడ లేకపోవడమే కారణమని భావించిన సైంటిస్ట్‌‌లు మళ్లీ1990ల్లో ఎల్లోస్టోన్‌‌కు వాటిని తీసుకొచ్చారు. దాంతో పరిస్థితులు చక్కబడ్డాయి. దీనంతటికీ కారణం.. తోడేళ్లలో ఉండే పారాసైట్స్‌‌ అని సైంటిస్ట్‌‌లు చెప్తున్నారు. అంటే పరాన్నజీవులు ప్రకృతికి చేసే మంచి కూడా ఎంతో ఉంది. 

వాగుల్లో.. 

వాగుల్లో నీళ్లు శుభ్రంగా ఉండడానికి కూడా ఒక రకంగా పారాసైట్స్ కారణం అవుతున్నాయి. నెమటోమార్ఫ్‌‌లు అనే రకమైన పురుగులు భూమిపై బతికే జీవులు. కానీ.. వాటి జీవితాల ముగింపులో నీళ్లలో దూకుతాయి. కారణం.. వాటిలో ఉండే పారాసైట్స్‌‌. అవే వాటిని నీళ్లలోకి దూకేలా ప్రేరేపిస్తాయి. అలా అవి చేపలకు ఆహారంగా మారతాయి. వాటి ఆకలి తీరడం వల్ల చేపలు నీటి అడుగున ఉన్న కీటకాల జోలికి వెళ్లవు.

దాంతో నీటి అడుగున కీటకాల వృద్ధి బాగా జరుగుతుంది. అవి ఎక్కువ ఆల్గేను తింటాయి. అందువల్లే నీళ్లు శుభ్రంగా ఉంటాయి. జంతు రాజ్యంలో 40 శాతం పరాన్నజీవులే ఉన్నాయనేది అంచనా. అయినా.. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ పారాసైట్​ జాతుల గురించి ఇప్పటికీ సైంటిస్ట్‌‌లకు తెలియదు. కానీ.. సైంటిస్ట్‌‌లు చేసిన కొన్ని పరిశోధనల్లో కాలక్రమేణా పరాన్నజీవులు క్షీణిస్తున్నాయని మాత్రం తేలింది.