చంద్రునిపై గుహ కనుగొన్న సైంటిస్టులు.. మనుషులు ఉండొచ్చట!

ప్రపంచంలో అమెరికా, చైనా, రష్యా, భారత్ లాంటి దేశాలు చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్నాయి. భవిష్యత్ లో మూన్ పై మానవ నివాసానికి ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అనేక శాటిలైట్లను పంపించారు. అక్కడి మట్టి, వాయువులు, ఖనిజాలు సేకరించి ప్రయోగాలు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు చంద్రునిపై భూగర్భ గుహను కనుగొన్నారు. ఇది మానవులకు నివాసయోగ్యంగా ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ గుహ చంద్రునిపై సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనే ప్రాంతంలో ఉన్న ఒక భారీ గొయ్యి లోపల ఉంది. ఈ గొయ్యి చంద్రునిపై తెలిసిన లోతైన ప్రాంతం.

ఇది నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌ను చంద్రునిపైకి తీసుకువచ్చిన అంతరిక్ష నౌక అపోలో 11 ల్యాండింగ్ అయిన సైట్ నుండి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇటలీలోని ట్రెంటో యూనివర్సిటీకి చెందిన లోరెంజో బ్రూజోన్, లియోనార్డో క్యారెర్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ గుహను కనుగొంది. వారు తమ పరిశీలనలను సైంటిఫిక్ జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురించారు. శాస్త్రవేత్తలు రాడార్‌ను ఉపయోగించి గొయ్యి తెరవడం ద్వారా లోపలికి వెళ్లేలా చేశారు. మిలియన్ల సంవత్సరాల క్రితం చంద్రుని ఉపరితలం క్రింద ప్రవహించిన లావా కారణంగా గొయ్యి లోపల గుహ ఏర్పడిందని సైంటిస్టులు చెప్తున్నారు. మానవ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ గొయ్యి అనుకూలంగా ఉంటుందని వెల్లడించారు.