క్రికెట్లో ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి? అనేది తేల్చడానికి మ్యాచ్కి ముందు టాస్ వేయడం తెలిసిందే. అలా ఒక నాణేన్ని గాల్లోకి ఎగరేస్తే అది భూమ్మీద పడగానే బొమ్మా? బొరుసా? అనేది చూస్తారు. అంటే పైకి ఎగరేసినప్పుడు 50 /50 ఛాన్స్ అనుకుంటాం. అయితే, అది నిజం కాదట! అదెలా అంటున్నారా? అందుకోసం ఒక టీం రీసెర్చ్ చేసి మరీ చెప్పింది.
ఆమ్స్టర్డామ్ యూనివర్సిటీ రీసెర్చర్ ఫ్రాంటిసెక్ బర్టొస్... ఇతను 48 మంది టీంతో కలిసి ‘టాస్’ వేసే సబ్జెక్ట్ మీద స్టడీ చేశారు. మామూలుగా అయితే టాస్ అనేది 50 /50 ఛాన్స్ అని అనుకుంటారు. అది నిజమా? కాదా? అనేది తెలుసుకునేందుకే ఆమ్స్టర్డామ్ యూనివర్శిటీ వాళ్లు ఈ స్టడీ చేశారు. అందులో భాగంగా టీం అంతా కలిసి 46 కరెన్సీలకు సంబంధించి 350,757 నాణేలను టాస్ వేశారు. దాంతో రిజల్ట్ 50 /50 ఛాన్స్ కాదని తేలిపోయింది. అంతేకాదు చాలావరకు బాగున్న కాయిన్లు(ఎక్కువ వాడనివి) పైకి ఎగరేసేటప్పుడు ఎలా ఉన్నాయో అలానే కింద పడేవి. ఇలా పడిన కాయిన్ల శాతం 50.8 అని తేల్చేశారు.