- మహారాష్ట్రలో సహకార బ్యాంక్ పేరిట ఫ్రాడ్
- అధిక వడ్డీలు ఇప్పిస్తానని జనాలకు టోకరా
- మథురలోని ఓ ఆలయం ముందు అరెస్ట్ చేసిన పోలీసులు
ముంబై: మహారాష్ట్రలో ప్రజలను రూ.300 కోట్లకు ముంచి సాధువు వేషంలో తప్పించుకు తిరుగుతున్న బాబాన్ విశ్వనాథ్ షిండేను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. యూపీ రాష్ట్రం మథురలోని ఓ ఆలయం వద్ద సన్యాసి వేషంలో ఉన్న అతడిని బీడ్ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీడ్ జిల్లాలో విశ్వనాథ్ షిండే జిజావు మహాసాహెబ్ మల్టీస్టేట్ సహకార బ్యాంక్ పేరిట బ్యాంకును ప్రారంభించాడు. ధారశివ్లో మరో బ్రాంచ్‌తోపాటు మొత్తం నాలుగు బ్రాంచీలు పెట్టాడు. ఈ బ్యాంకులో డిపాజిట్ చేస్తే అధిక వడ్డీ వస్తుందని చెప్పి వేలాది మంది నుంచి డిపాజిట్లు సేకరించాడు.
అలా 2 వేల మంది నుంచి రూ.300 కోట్లకు పైగా డబ్బు సేకరించాడు. ఆపై 2023 జులైలో బ్రాంచీలను మూసేసి పత్తా లేకుండా పోయాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏడాదిపాటు స్పెషల్ టీమ్స్ వెతికినా అతడు దొరకలేదు. ఎట్టకేలకు మథురలోని కృష్ణ బలరాం ఆలయం వద్ద సన్యాసి వేషంలో ఉన్న విశ్వనాథ్ షిండేను గుర్తించి అరెస్ట్ చేశారు.
బిచానా ఎత్తేసిన తర్వాత షిండే ఢిల్లీ, నేపాల్, అస్సాం, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌తో పాటు మనదేశంలోని పలు రాష్ట్రాల్లో రకరకాల వేషాల్లో తిరిగాడని విచారణ అనంతరం పోలీసులు వెల్లడించారు. జనాలనుంచి గుంజిన డబ్బుతో పలు ప్రాంతాల్లో స్థిరాస్తులు కొనుగోలు చేశాడని, సిమ్ కార్డులను మారుస్తూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నాడని పేర్కొన్నారు.