కోల్​కతా రేప్ కేసు సుప్రీంకు ..ఆగస్టు 20న విచారణ

  • రేపు పొద్దున టాప్ ప్రయారిటీ కింద విచారణ
  • సీజేఐ నేతృత్వంలో ముగ్గురు జడ్జిలతో బెంచ్
  • ఇప్పటికే కలకత్తా హైకోర్టులో కొనసాగుతున్న విచారణ
  • రెండు గంటలకోసారి నిరసనలపై రిపోర్టు ఇవ్వండి
  • రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ ఆదేశం
  • మాజీ ప్రిన్సిపాల్ కాల్ డేటాను పరిశీలిస్తున్న సీబీఐ
  • టీఎంసీ ఎంపీ సుఖేందుకు నోటీసులిచ్చిన పోలీసులు

న్యూఢిల్లీ: కోల్​కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్​పై అత్యాచారం, హత్య కేసును సుప్రీం కోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం ఈ కేసును చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ విచారించనున్నది. ఉదయం 10:30 గంటలకు టాప్ ప్రయారిటీ కింద ఈ కేసు విచారణకు రానున్నది. సుప్రీం కోర్టు వెబ్​సైట్​లోనూ ఈ కేసుకు సంబంధించిన వివరాలు అప్​లోడ్ అయ్యాయి. కాగా, కోల్​కతా జూనియర్ డాక్టర్ కేసును సుమోటోగా స్వీకరించాలని కోరుతూ ఇద్దరు అడ్వకేట్లు సీజేఐకి లేఖ రాశారు. కలకత్తా హైకోర్టు కూడా ఈ కేసును విచారిస్తున్నది. పోలీసులు, ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఎంక్వైరీ ఎక్కడిదాకా వచ్చిందో రిపోర్టు ఇవ్వాల్సిందిగా సీబీఐను కూడా ఆదేశించింది. కాగా, సీబీఐ అధికారులు వరుసగా మూడో రోజు ఆదివారం కూడా మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్​ను విచారించారు. ఆయన కాల్ డేటా, చాటింగ్ ను పరిశీలించారు. మరింత సమాచారం కోసం సర్వీస్ ప్రొవైడర్ నుంచి డేటా తెప్పించుకున్నారు.

ఎప్పటికప్పుడు సమీక్షించండి: కేంద్ర హోంశాఖ

దేశవ్యాప్తంగా డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు, పొలిటికల్, ప్రజా సంఘాల నేతలు రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకోసారి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని సూచించింది. ఈ మేరకు హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచే రిపోర్టు సెండ్ చేయాలని ఆదేశించింది.

అది నా తప్పే: ఎంపీ రచనా బెనర్జీ

మృతురాలి పేరు బయపెట్టినందుకు టీఎంసీ ఎంపీ, బెంగాలీ యాక్టర్ రచనా బెనర్జీపై కేసు నమోదైంది. జూనియర్ డాక్టర్ ఘటనను ప్రస్తావిస్తూ ఆమె ఆదివారం ట్విటర్​లో ఎమోషనల్ వీడియో పోస్టు చేశారు. అందులో మృతురాలి పేరును ఆమె పదే పదే ప్రస్తావించారు. దీంతో ఓ అడ్వకేట్ కలకత్తా హైకోర్టులో కంప్లైంట్ ఫైల్ చేశారు. చివరికి తన తప్పు తెలుసుకున్న రచన బెనర్జీ.. వీడియో డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు.

యావత్ మహిళలపై దాడి

కోల్​కతా ఘటన యావత్ మహిళా లోకంపై దాడిగా మాజీ క్రికెటర్, రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్ అభివర్ణించారు. కేసును వేగంగా విచారించి.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. ‘‘వీలైనంత త్వరగా నిందితుడిని శిక్షిస్తే మృతురాలి ఆత్మకు శాంతి లభిస్తుంది. వ్యవస్థలో పాతుకుపోయిన పురుష అహంకారాన్ని ఈ ఘటన కండ్లకు కట్టేలా చేస్తున్నది. ఇలాంటివి రిపీట్ కావొద్దంటే కఠినమైన శిక్షలు అమలుచేసే చట్టాలు రావాలి’’ అని హర్భజన్ అన్నారు.

ఎంపీ సుఖేందుకు సమన్లు

అర్జీ కర్ మెడికల్ కాలేజ్ విషయంలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని టీఎంసీ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్​కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పారదర్శకంగా కేసు విచారించాలంటూ రాయ్ సీబీఐని ట్వీట్​లో డిమాండ్ చేశారు. ‘డాగ్ స్క్వాడ్​ను రంగంలోకి దించేందుకు 3 రోజులు ఎందుకు పట్టింది? సెమినార్ హాల్ గోడను ఎందుకు కూల్చారు? వాష్ బేసిన్ ఎందుకు మార్చారు?’ అని ట్వీట్​లో నిలదీశారు. దీంతో రాయ్ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారంటూ పోలీసులు ఆయనకు నోటీసులిచ్చారు.