- ఎన్నికల్లో ఉచిత హామీలను అడ్డుకోవాలని మరో పిటిషన్
- స్పందన తెలియజేయాలనికేంద్రం, ఈసీకి సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచిత హామీలను లంచాలుగా పరిగణించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ పై అభిప్రాయాలను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ (ఈసీ)కు నోటీసులు జారీ చేసింది.
ఇదే అంశంపై ఇప్పటికే దాఖలైన పిటిషన్లకు దీనిని జత చేసింది. కాగా, ఈ పిటిషన్ ను బెంగళూర్ కు చెందిన శశాంక్ జే శ్రీధర దాఖలు చేశారు. ఎన్నికల టైమ్ లో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలంటూ ఎలక్షన్ కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలని అందులో కోరారు. ఉచిత హామీలతో ప్రభుత్వ ఖజానాపై ఆర్థికంగా భారం పడుతుందని పేర్కొన్నారు.
ఎంబీబీఎస్ అడ్మిషన్లపై కీలక తీర్పు..
ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 40 శాతం వైకల్యం ఉందనే కారణం చూపి ఎంబీబీఎస్ లో ప్రవేశాన్ని అడ్డుకోవడం సబబు కాదని తేల్చి చెప్పింది. డిజెబిలిటీ అసెస్ మెంట్ బోర్డు అనర్హులని తేల్చితే తప్ప అడ్మిషన్ నిరాకరించొద్దని స్పష్టం చేసింది. 40% వైకల్యం ఉన్నోళ్లు ఎంబీబీఎస్ చదివేందుకు అనర్హులనే నిబంధనను సవాల్ చేస్తూ ఓంకార్ అనే స్టూడెంట్ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు.
దీనిపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ తో కూడిన బెంచ్ విచారణ చేపట్టి తీర్పు ఇచ్చింది. ‘‘బెంచ్ మార్క్ డిజెబిలిటీ ఆధారంగా అనర్హులుగా తేల్చలేం. క్యాండిడేట్ ఎంబీబీఎస్ చదివేందుకు అర్హుడా? కాదా? అనేది డిజెబిలిటీ అసెస్మెంట్ బోర్డు తేల్చాలి. అతనికి ఉన్న వైకల్యం కారణంగా ఎంబీబీఎస్ చదవగలడా? లేడా? అనేది పక్కాగా నిర్ధారించాలి. ఒకవేళ అనర్హుడిగా తేలిస్తే, అందుకు కారణాలను వెల్లడించాలి” అని తీర్పులో పేర్కొంది.