అన్ని రాష్ట్రాల కన్నా ముందే ఎస్సీ వర్గీకరణ అమలుచేస్తం

  •    ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తం: సీఎం రేవంత్​రెడ్డి
  •     ఇచ్చిన నోటిఫికేషన్లకూ అమలు

హైదరాబాద్, వెలుగు:  ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని, దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టి ఆదర్శంగా నిలుస్తామని సీఎం  రేవంత్‌‌ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ ఎస్సీలకు ఏబీసీడీ రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా గురువారం సుప్రీం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘కొన్ని దశాబ్దాలుగా మాదిగ, మాదిగ ఉపకులాలకు సంబంధించిన లక్షల మంది యువత ఎస్సీ రిజర్వేషన్ల​లో ఏబీసీడీ వర్గీకరణ కోసం పోరాటాలు చేశారు. వారి పోరాటాల ఫలితంగా నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 

ఒకనాడు ఇదే శాసనసభలో ఎస్సీ వర్గీకరణకు మేము వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు మా కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్‌‌ ను గత ప్రభుత్వం సస్పెండ్ చేసింది అన్నారు. తమ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తక్షణమే మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఏజీని ఢిల్లీకి పంపామన్నారు. వర్గీకరణపై రాష్ట్రం తరఫున సుప్రీం కోర్టులో బలమైన వాదనలు వినిపించామన్నారు.