స్టేషన్​ బెయిల్ వల్ల  నీరుగారుతున్న అట్రాసిటీ కేసులు​ : స్పెషల్​ డ్రైవ్​తో కేసులు పరిష్కరించాలి

  • బాధితులకు అండగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ 
  • చైర్మన్ ​బక్కి వెంకటయ్య

నిజామాబాద్, వెలుగు: 41సీఆర్పీసీ కింద స్టేషన్​ బెయిల్స్​ ఇవ్వడంతో అట్రాసిటీ కేసులు నీరుగారిపోయే ప్రమాదముందని ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్ బక్కి వెంకటయ్య అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తాను సీఎం రేవంత్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని త్వరలో కేంద్ర సాంఘిక సంక్షేమం, న్యాయశాఖ మంత్రిని కలిసి సవరణలు కోరతానన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్​లో ఆఫీసర్లతో మీటింగ్​ నిర్వహించి మాట్లాడారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో అణగారిన వర్గాలపై విలేజ్​ డెవలప్​ కమిటీలు పెత్తనం చేయడం సరికాదని, అలా చేస్తే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

 ఎస్సీ, ఎస్టీలకు కమిషన్ అండగా ఉంటుందని, అధికారులు వేధించినా యాక్షన్​ తీసుకుంటామని  భరోసా ఇచ్చారు. జిల్లాలో నమోదైన అట్రాసిటీ కేసులను నెలలో పరిష్కరించాలని, అవసరమైతే స్పెషల్​ డ్రైవ్​ చేపట్టాలని సూచించారు. ప్రతీనెల చివరివారం సివిల్​ రైట్స్​డే, ప్రతీ మూడునెలలకోసారి మానిటరింగ్​కమిటీ మీటింగ్​విధిగా నిర్వహించాలన్నారు. కమిషన్​సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవీ,  కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హనుమంతు, సీపీ కల్మేశ్వర్, అదనపు కలెక్టర్లు​ అంకిత్, కిరణ్​కుమార్, డీఎస్​డీవో నిర్మల, ఆయా శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.