ప్రాథమిక విద్యపై పట్టింపేది .. విద్యకు దూరమవుతున్న ట్రైబల్స్

  • సమస్యల వలయంలో శాటిలైట్ పాఠశాల
  • చెట్టు కిందనే భోజనాలు
  • తాగడానికి బోరు నీళ్లే దిక్కు
  • రెండే క్లాస్ రూమ్ లు

ఆసిఫాబాద్ / జైనూర్, వెలుగు: ఐటీడీఏ ద్వారా ట్రైబల్ పిల్లలకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన శాటిలైట్ పాఠశాలలో సమస్యలు తాండవిస్తున్నాయి. స్కూల్​లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. ఫలితంగా ఆదివాసీ గిరిజనులు విద్యకు దూరమవుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ మండల ట్రైబల్ పిల్లలకు దగ్గరలోనే విద్యనందించేందుకు ఐటీడీఏ విద్యశాఖ అధికారులు జైనూర్ లోని గౌరి గ్రామంలో 15 ఏండ్ల క్రితం శాటిలైట్​స్కూల్​ను ప్రారంభించారు. పాఠశాలలో హాస్టల్ సౌకర్యంతో 200 నుంచి 500 మంది పిల్లలకు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యనందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఈ స్కూల్​లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. కనీస సౌకర్యాలు లేక తమ పిల్లలను ఇక్కడ జాయిన్​ చేసేందుకు తల్లిదండ్రులు ముందుకురావడంలేదు. ఫలితంగా స్టూడెంట్ల సంఖ్య 200కు దాటడంలేదు. ఏటా అడ్మిషన్ల సంఖ్య తగ్గుతునే వస్తోంది. ప్రస్తుతం కేవలం 130 మంది స్టూడెంట్స్ మాత్రమే చదువుతున్నారు.

రెండు క్లాస్ రూమ్​లు.. రెండు బెడ్రూంలు

అప్పట్లో నిర్మించిన మూడు భవనాల్లోనే ఇప్పటివరకు విద్యా సేవలు కొనసాగుతున్నాయి. స్కూల్​లో వసతులు పెంచి స్టూడెంట్ల చేరికకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ మూడు బిల్డింగులలో ఒకదాన్ని ఆఫీస్ రూమ్​తో పాటు వంట కోసం, రెండు గదులు క్లాస్ రూమ్ బిల్డింగ్, మరో రెండు గదుల హాస్టల్ బిల్డింగ్, 4వ 5వ తరగతులకు రెండు రూమ్ లను కేటాయించారు. ఫస్ట్, సెకండ్ క్లాస్ పిల్లలను వరండాలో కూర్చోబెడుతున్నారు. తరగతి గదిలోనే నిద్ర పోవాల్సిన దుస్థితి నెలకొంది.

డైనింగ్ హాల్ లేదు

ఇప్పటివరకు ఈ హాస్టల్​లో డైనింగ్ రూమ్ లేనేలేదు. దీంతో స్టూడెంట్లు చెట్టు కిందనే భోజనాలు చేస్తున్నారు. వర్షాకాలం భోజనాలకు స్టూడెంట్లతో పాటు వర్కర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. తాగడానికి కనీసం సరైన నీటి సౌకర్యం లేదు. అక్కడున్న బోర్ నీళ్లనే తాగుతున్నారు. స్నానాలు, వంటకు కూడా ఆ బోరే దిక్కు. పనిచేస్తున్న టీచర్లు, వర్కర్లకు కూడా వసతి గదులు లేవు. వర్కర్లు, ఇతర సిబ్బంది వంట రూమ్​లోనే బసచేస్తున్నారు.

మా స్కూల్ లో సౌకర్యాలు కల్పించాలి

మా స్కూల్ లో కనీస సౌకర్యాలు లేవు. క్లాస్ రూమ్ లు, బెడ్ రూమ్ లు సరిపోతలేవు. వరండాలో కూర్చొని చదువుకుంటున్నం. ప్రభుత్వం మాకు పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలి.

రమేశ్వరి, 4వ తరగతి స్టూడెంట్

భోజనాలకు కష్టంగా ఉంది

స్కూల్​లో మాకు డైనింగ్ రూమ్ లేదు. చెట్టు కిందకే భోజనం చేస్తున్నం. వర్షాకాలం చాలా కష్టమవుతోంది. మా సమస్యలు తీర్చాలి. తాగు నీటి కోసం ట్యాంక్ లు కట్టాలి. అధికారులు స్పందించి సౌలత్​లు కల్పించాలి.  

 గణేశ్, 3వ తరగతి