తెలంగాణలో కొత్త టూరిస్టు స్పాట్‌గా సర్వాయిపేట

  • సర్వాయి పాపన్న స్వగ్రామానికి మహర్దశ  
  • సౌకర్యాల కల్పనకు టూరిజం శాఖ నుంచి రూ. 4.70  కోట్లు మంజూరు
  • పాపన్న తిరగాడిన ప్రాంతాలను పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేయనున్న సర్కారు

కరీంనగర్, వెలుగు: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్వగ్రామం సర్వాయిపేటను టూరిస్ట్ స్పాట్ గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేటలో సర్వాయి పాపన్న నిర్మించిన కోటతోపాటు ఆ గ్రామంలో వసతుల కల్పన కోసం మొదటి విడతలో రాష్ట్ర టూరిజం డెవలప్​మెంట్​కార్పొరేషన్ నుంచి రూ.4.70 కోట్లు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 

బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచనలతో కరీంనగర్ కలెక్టర్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ సమన్వయంతో రూపొందించిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇందులో భాగంగా సర్దార్ సర్వాయి పాపన్న జన్మించిన సర్వాయిపేట నుంచి ఆయన రాజధానిగా చేసుకుని పాలించిన జనగామ జిల్లా ఖిలాషాపూర్ వరకు పాపన్న తిరగాడిన ప్రాంతాలన్నింటినీ టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేయనుంది. ఫస్ట్ ఫేజ్ లో సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంతోపాటు గ్రామశివారులో సర్వాయిపాపన్న నిర్మించిన కోటలో వసతులు కల్పించనున్నారు. 

ఆకట్టుకుంటున్న కోట అందాలు.. 

మొఘల్​సుల్తాన్లపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సర్వాయిపేట శివారు గుట్టలపై 1675లో నిర్మించిన కోట ఇప్పటికీ ఉంది. కోట నిర్మించడంతో ఈ గుట్టలను కోటగిరిగట్లుగా పిలుస్తున్నారు. చుట్టూ గుట్టలు, కోట అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎత్తయిన కొండలు, లోయలో మధ్యలో ఉన్న గుట్టలపై పాపన్న సైనిక స్థావరాలు ఏర్పాటు చేశారు. ఇక్కడే 2 వేల మంది సైన్యానికి ఆయన శిక్షణ ఇచ్చారు. పదెకరాల విస్తీర్ణంలో ఉన్న సర్వాయిపేటతోపాటు కోటగిరి గుట్టల్లో కొత్త ఖిల్లా, పాత ఖిల్లాలపై పాపన్న చరిత్ర తెలిపే ఆనవాళ్లున్నాయి. 20 అడుగుల ఎత్తుతో కోట సింహద్వారం, 50 అడుగుల ఎత్తుతో కోటకు రక్షణ గోడలు, కందకాలు, రహస్య సొరంగాలు నిర్మించారు. పాపన్న యుద్ధానికి వెళ్లే ముందు, తర్వాత ఆయన తన ఆరాధ్య దైవమైన బయ్యన్నకు పూజలు చేసేవారనే గాథలు ప్రచారంలో ఉన్నాయి. గుట్టలపై పాపన్న ఆడిన పచ్చీసలు, తహసీల్ బండ, పచ్చీసల బండ, ధనం బండ, హనుమాన్ విగ్రహం, పోచమ్మ గుడి, శివాలయం, చాకలి మడుగు, చేదబావిలాంటి అనేక ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. 

గ్రానైట్ క్వారీలపై పోరాటం.. 

సర్వాయిపాపన్నకు సంబంధించి చారిత్రక ఆధారాలు కలిగిన కోటగిరిగట్లలో విలువైన గ్రానైట్ఉండడంతో ఇందులో క్వారీలను ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరిగాయి. దీంతో అప్పట్లో పర్యావరణ ప్రేమికులు, చరిత్రకారులు, గౌడ సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో ప్రభుత్వం గ్రానైట్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేసింది. తాజాగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో సైదాపూర్ మండల ప్రజలు, గౌడ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

పాపన్న గౌడ్ జీవితం భావితరాలకు తెలియజేసేందుకే.. 

సర్వాయి పాపన్న స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకే ఆయన పుట్టిన ఊరు, నిర్మించిన కోటను టూరిస్టు స్పాట్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్వాయిపేట కోటతోపాటు సర్వాయిపేట నుంచి ఖిలాషాపూర్ కోట వరకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తిరిగిన ప్రాంతాలను పర్యాటక క్షేత్రాలు అభివృద్ధి చేస్తాం. దీంతో దేశ, విదేశాలకు కూడా ఆయన జీవిత చరిత్ర తెలుస్తుంది. ఇందుకు రూ.4.70 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ధన్యవాదాలు.