సరస్వతీ విశ్వవిద్యాలయం..ప్రకటనలకే పరిమితమా?

వెనుకబడిన జిల్లా అనే ముద్దుపేరుతో  పిలిచే ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా.  దీనికి మరోపేరు ‘అడవుల జిల్లా’.  భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యత కల్గిన చదువుల తల్లి ‘శ్రీ జ్ఞాన సరస్వతీదేవి’ ఈ ప్రాంతంలోనే  కొలువై ఉన్నప్పటికీ,  సరైన ఉన్నత విద్యావనరుల్లేక  జిల్లావాసులు ఉన్నత చదువుల కోసం అష్టకష్టాల నడుమ జిల్లాను దాటి వెళ్తున్నారు. మరికొందరు మధ్యలోనే  చదువుకు స్వస్తి  పలుకుతున్నారు. 

 గత్యంతరం లేని పరిస్థితుల్లో  దూరవిద్య, ఇతర ప్రాంతాల్లోని  రెగ్యులర్ విశ్వవిద్యాలయాల్లో విద్యను పూర్తిచేసి రూ. కోట్లలో వారికి ఆదాయాన్ని సమకూరుస్తున్నారు.  గతంలో ఉస్మానియా, తర్వాత కాకతీయ, తదనంతరం తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ జిల్లాను చేర్చేందుకు ప్రయత్నించారు. మళ్లీ తిరిగి కాకతీయ పరిధిలోనే కొనసాగిస్తున్నారు. ఇలా తమ ఆదాయం కోసమే ఈ ప్రాంతాన్ని వాడుకుంటున్నారే తప్ప ఇక్కడ ‘శాశ్వత ఉన్నత విద్యావకాశాలు’ కల్పించే దిశగా చర్యలు చేపట్టడం లేదు.

 గతంలో వైఎస్సార్ హయాంలో తెలంగాణకు మంజూరైన విశ్వవిద్యాలయాలు మినహా ఇప్పటివరకు కొత్తగా ఒక్క ‘రాష్ట్ర విశ్వవిద్యాలయం’ సైతం రాలేదు. అప్పుడు అన్నిరకాలుగా అవకాశమున్న నిర్మల్ పట్టణంలోని విశ్వవిద్యాలయ కళాశాలను యూనివర్సిటీగా ఉన్నతీకరిస్తారని అందరూ భావించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ఇదే క్రమంలో ఆదిలాబాద్​ జిల్లా ‘రాష్ట్ర యూనివర్సిటీ’తో పాటు ‘అటవీ యూనివర్సిటీ’, ‘గిరిజన యూనివర్సిటీ’, ‘నైపుణ్య యూనివర్సిటీ’ లను సైతం కోల్పోయింది.

  ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా ‘నూతన రాష్ట్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు’పై సానుకూల ప్రకటన చేయడం,  ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీచేయడంతో ఇప్పటికైనా ‘కొత్త రాష్ట్ర యూనివర్సిటీ’ అందుబాటులోకి   వస్తుందనే ఆశలు 
జిల్లావాసుల్లో చిగురిస్తున్నాయి.

అవకాశం ఉన్నా దక్కని ‘అటవీ విశ్వవిద్యాలయం’

తెలంగాణ రాష్ట్రంలో  భౌగోళికంగా పెద్దదైన ఉమ్మడి ఆదిలాబాద్ (ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్)లో అడవుల విస్తీర్ణం ఎక్కువే.  అడవుల జిల్లాగా  పేరున్న ఇక్కడ  భిన్నరకాల సంస్కృతులు,  సంప్రదాయాలు, వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి.  వివిధ శాస్త్రాల్లో  పరిశోధనకు ఎంతో అవకాశమున్న   ప్రాంతం.  తెలంగాణ ఏర్పాటు తర్వాత  దాదాపు పదేండ్ల పాటు ఇద్దరు అటవీశాఖ మంత్రులు (జోగు రామన్న , ఇంద్రకరణ్ రెడ్డి ) ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించారు. కానీ, వారి వైఫల్యంతో  ఈ జిల్లా 'అటవీ విశ్వవిద్యాలయం' ఏర్పాటును కోల్పోయింది. 

నాయకుల వైఫల్యం

శ్యామ్​ పిట్రోడా నేతృత్వంలోని జాతీయ విజ్ఞాన కమిషన్ సిఫార్సుల మేరకు ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలోని నిర్మల్ పట్టణాన్ని ఎంపికచేశారు.  దీనికి కారణం అప్పటికే విశ్వవిద్యాలయ  పీజీ  కళాశాల భవనం అందుబాటులో ఉండటం. సుమారు 25 ఎకరాల  విస్తీర్ణం కల్గిఉన్న ఈ భవనంలో వసతులు, సౌకర్యాలకు కొదవలేకపోవడం, సమీపంలోనే  మరింత ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండటం వల్ల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయొచ్చని భావించి మొదటి విడతగా రూ.55 కోట్ల నిధులను కేటాయించారు.

 ఈ నిధులతో వివిధ పరిపాలన భవనాలు,  పరిశోధనశాలలు, గ్రంథాలయాలు, వసతిగృహాలు, ఇతరత్రా నిర్మాణాలు చేపట్టడానికి అవకాశముండేది. అప్పటి ప్రభుత్వ సిఫార్సుల్లో  శ్రీ జ్ఞానసరస్వతీ అమ్మవారి పేరుతో ‘సరస్వతీ విశ్వవిద్యాలయం’ అని పేరుకూడా ప్రకటించారు. కానీ, ఆ సమయంలో  రాష్ట్ర విభజన జరగడంతో పనులు నిలిచిపోయాయి. 

కొత్తగా ప్రతిపాదనలు పంపించాలని సూచించడంతో అప్పటి ఆదిలాబాద్​ జిల్లా కేంద్రమైతేనే బాగుంటుందని ఇక్కడి పాలకుల అభిప్రాయంతో ఏకీభవించి అనాలోచిత నిర్ణయం తీసుకుని కేసీఆర్ ‘ఆదిలాబాద్​ డిగ్రీ కళాశాల’ మార్పును  ప్రతిపాదిస్తూ  కేంద్రానికి నివేదికలు అందజేశారు. అయితే, డిగ్రీ కళాశాలను ఉన్నతీకరించడం నిబంధనలకు విరుద్ధమన్న కారణంతో ఈ ప్రతిపాదనను యూజీసీ  తిరస్కరించింది. 

బడ్జెట్ కేటాయింపు, నిధుల విడుదలే కీలకం

ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ప్రణాళికలు పూర్తిచేసి ప్రభుత్వ ఆమోదంతో కేంద్ర ఉన్నత విద్యాశాఖ ద్వారా యూజీసీ  (రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్) ‘రూసా'కు  అత్యవసరంగా పంపితే అటునుంచి బడ్జెట్ విడుదలయ్యే అవకాశం ఉంది.  వీటికి తోడు అదనంగా ఉమ్మడి ప్రణాళికలో  భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో  నిధులు మంజూరుచేస్తే పనులు మరింత వేగవంతమవుతాయి. అధికారంలోకి వచ్చాక తొలి పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని  ఇంద్రవెల్లి  పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుచేస్తామని బహిరంగసభలో ప్రకటించారు. 

అయితే, విశ్వవిద్యాలయ ఏర్పాటుపై కేవలం ప్రకటనలు చేసి విస్మరించకుండా అది ఆచరణకు నోచుకునేలా అత్యవసర చర్యలు చేపట్టాలి. కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలి. అనుమతి రాగానే కావాల్సిన నిధులనూ విడుదల చేయాలి.  ప్రణాళికలు తయారుచేయాలని ఆదేశాలు జారీచేసి కాలయాపనతో చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటన చేసి దాదాపు మూడునెలలవుతున్నా ఇప్పటివరకు జరిగిన ప్రగతి, వేసిన ముందడుగు ఏంటనే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నది. 

ఇతర శాఖలకు ఆగమేఘాల మీద 'ఆర్థిక కేటాయింపులు’ యథావిధిగా జరుగుతున్నా.. విద్యాశాఖకు మాత్రం ప్రత్యేకంగా నిధులను కేటాయించడం, విడుదల చేయడం కనిపించడం లేదు. ఇది కూడా నూతన యూనివర్సిటీ ఏర్పాటుకు అడ్డుగా మారుతోంది.  వచ్చే విద్యాసంవత్సరానికల్లా ‘కొత్త రాష్ట్ర విశ్వవిద్యాలయాన్ని’ ఉమ్మడి ఆదిలాబాద్ లో  ప్రారంభించేలా రేవంత్​ సర్కారు చొరవ చూపాలి.

దశాబ్దాలుగా ‘రాష్ట్ర విశ్వవిద్యాలయం’ కోసం ఉద్యమం

శ్రీ జ్ఞాన సరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి  నిర్మల్ లో  రాష్ర్ట విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా ఉద్యమిస్తోంది. 2009 సంవత్సరం నుంచి 2024 వరకు వరుసగా ఏర్పడిన వేర్వేరు ప్రభుత్వాల ముఖ్యమంత్రులైన రాజశేఖర్ రెడ్డి,   రోశయ్య,  కిరణ్ కుమార్ రెడ్డి,  కేసీఆర్,  రేవంత్ రెడ్డి  దృష్టికి,  ఉన్నతాధికారుల దృష్టికి  తీసుకెళ్లడంతో పాటు,  2016లో  గత  కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామంత్రి  ప్రకాష్ జవదేకర్ తో పాటుగా  తెలంగాణ ఉన్నత విద్యామండలికి సైతం పలుమార్లు ప్రతిపాదనలు అందజేసింది. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం 'నైపుణ్య యూనివర్సిటీ"లను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నూతన నిర్ణయానికి అనుగుణంగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో “నైపుణ్య విశ్వవిద్యాలయం” (స్కిల్ యూనివర్సిటీ) ఏర్పాటు చేస్తే  వెనుకబడిన జిల్లా విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందంటూ శ్రీజ్ఞాన సరస్వతీ విశ్వవిద్యాలయ సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి తాజాగా వినతిపత్రం అందజేశారు. 

అయితే విశ్వవిద్యాలయ ఏర్పాటుకు బదులుగా ప్రస్తుతానికి అన్ని జిల్లాల్లోనూ “నైపుణ్య కేంద్రాలను” ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా ఆదేశాలు జారీచేసింది. కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ‘రాష్ట్ర విశ్వవిద్యాలయ ఏర్పాటు’ విషయమై దశాబ్దాలుగా ప్రభుత్వాలు కేవలం ప్రకటనలతో మభ్యపెడుతూనే ఉన్నాయి. 

- నంగె శ్రీనివాస్​, అధ్యక్షుడు, శ్రీ జ్ఞాన సరస్వతీ విశ్వవిద్యాలయ సాధన సమితి
 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా