Sankranti Special : మన సంక్రాంతికి.. ఇతర రాష్ట్రాల పిండి వంటలు ట్రై చేద్దామా..

సంక్రాంతి పండుగ రావడానికి వారం ముందు నుంచే అందరి ఇళ్లలో పిండి వంటల ఘుమఘమలు మొదలైపోతాయి. ఈసారి సంక్రాంతికి ఎప్పుడూ చేసుకునే పిండి వంటలు కాకుండా వెరైటీగా.. ఇతర రాష్ట్రాల రుచులు ట్రై చేయండి. 

పటిశప్త..

కావాల్సినవి : 

  • స్వీట్ కోసం పాలు - ఒక లీటరు 
  • బియ్యప్పిండి - ఒక టేబుల్ స్పూన్ 
  • చక్కెర - పావు కప్పు 
  • ఉప్పు - చిటికెడు 
  • యాలకుల పొడి - పావు టీ స్పూన్ 
  • బెల్లం - రెండు టేబుల్ స్పూన్లు 
  • దోశ పిండి కోసం : బియ్యప్పిండి - ఒకటిన్నర కప్పు 
  • మైదా - అరకప్పు 
  • ఉప్పు - అర టీ స్పూన్ 
  • బెల్లం - పావు కప్పు 
  • పాలు లేదా నీళ్లు - రెండు కప్పులు 

తయారీ : 

స్వీట్ : ముందుగా ఒక చిన్న గిన్నెలో బియ్యప్పిండిలో రెండు టేబుల్ స్పూన్లు పాలు పోసి కలిపి, పక్కన పెట్టాలి. పాన్ వేడెక్కాక ఒక లీటరు పాలలో పావు కప్పు చక్కెర వేసి కలపాలి. ఆ మిశ్రమం దగ్గర పడ్డాక కలిపి పెట్టుకున్న బియ్యప్పిండి మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత యాలకుల పొడి, ఉప్పు, బెల్లం వేసి మిశ్రమం బాగా కలిసేలా కలపాలి. పిండి కొంచెం గట్టి పడేవరకు గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. తర్వాత చల్లారబెట్టాలి. దాంతో స్వీట్ తయారవుతుంది. 

దోశ పిండి : మరో గిన్నెలో బియ్యప్పిండి, మైదా, ఉప్పు, బెల్లం, పాలు లేదా నీళ్లు ఒకదానితో ఒకటి వేసి దోశపిండిలా కలిపి, అరగంటపాటు పక్కన పెట్టాలి. తరువాత పిండిని కొంచెం తీసి, అందులో కొంచెం ఫుడ్ కలర్ కలపాలి. ఒక పాన్లో కొంచెం నూనె రాసి ఫుడ్ కలర్ కలిపిన పిండిని పాన్ మీద నచ్చిన డిజైన్ వేయాలి. దాని మీద దోశ వేయాలి. అది ఉడుకుతున్నప్పుడే రెడీ చేసిపెట్టుకున్న స్వీట్ ని పెట్టి రోల్ చేసి తీసేయాలి. నోరూరించే ఈ బెంగాలీ స్వీట్ ... సంక్రాంతి ట్రెడిషనల్ రెసిపీ. 

చెనా పొడ..

కావాల్సినవి : 

  • పాలు - ఒక లీటరు 
  • చక్కెర - వంద గ్రాములు 
  • యాలకులు- నాలుగు 
  • బొంబాయి -రవ్వ 
  • మైదా పిండి - అరకప్పు 
  • జీడిపప్పు, కిస్ మిస్లు - కొన్ని
  • బేకింగ్ సోడా, వెనిగర్ కొద్దిగా

తయారీ : ముందుగా మిక్సీ జార్ లో చక్కెర, యాలకులు వేసి పొడి చేసుకోవాలి. ఈ పొడిని తీసుకుని. నెయ్యి వేసి బాగా కలపాలి. తర్వాత బేకింగ్ సోడా కూడా వేసి కలపాలి. పాలను మరిగించి, చల్లార్చాలి. ఒక గిన్నెలో వెనిగర్, నీళ్లు కలిపి పాలలో పోయాలి. విరిగిన పాలను వడకట్టాలి. విరిగిన పాల మిశ్రమాన్ని పొడిలా చేసి, ముందుగా చేసి పెట్టుకున్న పొడిలో కలపాలి. మైదా, బొంబాయి రవ్వ, కొన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ న్ని గిన్నెలోకి తీసుకోవాలి. దానిమీద జీడిపప్పు, కిస్మిస్లు చల్లి నలభై నిమిషాలు ఒవెన్ లో బేక్ చేయాలి. చల్లారిన తర్వాత కట్ చేయాలి. ఈ రెసిపీ ఒడిశా స్పెషల్. దీన్ని పనీర్ కూడా చేసుకోవచ్చు. దీన్నే 'పనీర్ కేక్' అని అంటారు.