సంక్రాంతి అనగానే పిండి వంటల రుచులు గుర్తుకొస్తాయి. మరింకెందుకు ఆలస్యం సంక్రాంతి స్పెషల్ రెసిపీ సకినాలతో పాటు, జంతికలు, చెక్కలు, కజ్జికాయలు, పాకం ఉండలు తయారుచేసి పంచండి. తినండి. ఎంతో రుచికరంగా ఉండే సంప్రదాయ వంటల్లో ఇవే ఈ వారం సంక్రాంతి స్పెషల్.
కొబ్బరి కజ్జికాయలు
కావాల్సినవి :
పచ్చి కొబ్బరి తురుము -రెండు కప్పులు
బెల్లం - ఒక కప్పు
యాలకులు -నాలుగు
మైదా - ఒకటిన్నర కప్పు
ఉప్పు - సరిపడా
నూనె - రెండు టీస్పూన్లు
తయారీ : ఒక పాన్‌లో కొబ్బరి, బెల్లం, యాలకులు వేగించాలి. బెల్లం కరిగాక... చేత్తో కొంచెం తీసుకుని ఉండ చేయడానికి వీలవుతుందో లేదో చూడాలి. ఒక గిన్నెలో మైదా పిండి, నూనె, ఉప్పు వేసి, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలపాలి. మూతపెట్టి పదినిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలు చేసి, వాటిని చపాతీల్లా వత్తాలి. కజ్జికాయలు చేసే చెక్కకు పొడి పిండి చల్లి, దానిపైన చపాతీ పెట్టాలి. చపాతీ మధ్యలో కొబ్బరి స్టఫింగ్ పెట్టి, చివర్లలో తడి చేసి నొక్కాలి. నూనె వేడి చేసి కజ్జికాయల్ని వేగించాలి. పచ్చికొబ్బరితో చేసినవి కాబట్టి నాలుగు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి.
సకినాలు
కావాల్సినవి :
బియ్యం (పాతవి) - ఒక కేజీ
మినప్పప్పు - అర కప్పు
పుట్నాలు - అర కప్పు
తెల్ల నువ్వులు - పావు కప్పు
వాము - రెండు టీస్పూన్లు
ఉప్పు, నీళ్లు, నూనె - సరిపడా
నెయ్యి - మూడు టీస్పూన్లు
తయారీ : బియ్యం శుభ్రంగా కడిగి పది లేదా పన్నెండు గంటలు నానబెట్టాలి. తర్వాత వడకట్టి పది నిమిషాలు అలానే ఉంచాతే నీళ్లన్నీ పోతాయి. ఆ బియ్యాన్ని కాటన్ క్లాత్ మీద ఆరబోసి బియ్యాన్ని చేత్తో పట్టుకుంటే తడి తగలకుండా ఉండేవరకు ఆరబెట్టాలి. అందుకు దాదాపు పావుగంట ఆరబెట్టినా చాలు. తరువాత వాటిని మిల్లులో లేదా మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. పట్టిన పిండిని జల్లెడ పట్టాలి. పాన్‌లో మినప్పప్పు, పుట్నాలు వేసి నూనె లేకుండా వేగించాలి. అవి చల్లారాక మిక్సీజార్‌లో వేసి పిండిలా గ్రైండ్ చేయాలి. ఈ పిండిని కూడా జల్లెడ పట్టి, బియ్యప్పిండిలో కలపాలి. అందులో తెల్ల నువ్వులు, నెయ్యి, వాము, ఉప్పు వేసి, నీళ్లు కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని మెత్తగా కలపాలి. పది నిమిషాల తర్వాత చేతిని నీళ్లతో తడిపి పిండి తీసుకుని వేళ్ల మధ్య పిండిని తిప్పుతూ శుభ్రమైన బట్ట మీద సకినాలు చుట్టాలి. అలా వేయడం రాకపోతే జంతికలు పోసుకునే గొట్టంలో పిండిని వేసి చుట్టొచ్చు. అవి కాసేపు ఆరాక వేడి నూనెలో వేగించాలి. ఇవి చల్లారాక డబ్బాలో పెట్టుకుంటే రెండు నెలలు నిల్వ ఉంటాయి.
జంతికలు
కావాల్సినవి :
బియ్యప్పిండి - రెండు కప్పులు
శనగపిండి - ఒక కప్పు
వాము - ఒక టేబుల్ స్పూన్
పసుపు - అర టీస్పూన్
కారం - రెండు టీస్పూన్లు
గోరు వెచ్చని నీళ్లు, ఉప్పు, నూనె - సరిపడా
వంట సోడా - పావు టీస్పూన్
వెన్న లేదా నూనె - రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : ఒక గిన్నెలో బియ్యప్పిండి, శనగ పిండి, కారం, ఉప్పు, పసుపు, వంట సోడా, వెన్న వేసి కలపాలి. నీళ్లు కొంచెం కొంచెంగా పోస్తూ పిండిని కలపాలి. తర్వాత చేత్తో మెత్తగా అయ్యేవరకు కలిపి పావుగంట పక్కన పెట్టాలి. తర్వాత జంతికల గొట్టంలో నూనె రాసి, అందులో పిండిని ముద్దలా చేసి వేయాలి. వేడి నూనెలో జంతికలు వత్తాలి. గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేగించాలి.
చెక్కలు
కావాల్సినవి :
పొడి బియ్యప్పిండి - రెండు కప్పులు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
అల్లం - చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది
పచ్చిమిర్చి - రెండు
జీలకర్ర - ఒక టీస్పూన్
ధనియాలు - రెండు టీస్పూన్లు
పచ్చిశనగపప్పు, మినప్పప్పు - ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున
కారం - ముప్పావు టీస్పూన్
ఉప్పు - అర టీస్పూన్
వెన్న - ఒక టేబుల్ స్పూన్
కరివేపాకు తరుగు - కొంచెం
తయారీ : బియ్యప్పిండిని జల్లెడ పట్టాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు రెండు గంటలు నానబెట్టాలి. అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాలను మిక్సీజార్‌లో వేసి గ్రైండ్ చేయాలి.
ఒక గిన్నెలో నీళ్లు వేడి చేసి, అందులో అల్లం, వెల్లుల్లి మిశ్రమం, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కారం, ఉప్పు, వెన్న వేసి కలపాలి. వెన్న కరిగిపోయి, నీళ్లు మరిగేటప్పుడు బియ్యప్పిండి వేయాలి. తర్వాత కరివేపాకు తరుగు వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత ఒక
గిన్నెలో వేసి చేత్తో కొంచెం కొంచెం నీళ్లు చల్లుతూ పిండిని బాగా కలపాలి. పిండిని చిన్న ఉండలు చేసి, వాటిపై క్లాత్ కప్పి పక్కన ఉంచాలి. ఒక్కోటి తీసి పాలిథీన్ కవర్ లేదా బటర్ పేపర్ మీద ఉంచాలి. దానిమీద కవర్ కప్పి వెడల్పాటి గిన్నెతో వత్తాలి. లేదంటే పూరీ మెషిన్లో పెట్టి కూడా చెక్కలు చేయొచ్చు. కళాయిలో నూనె వేడి చేసి నొక్కిన చెక్కలు వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి.
పాకం ఉండలు
కావాల్సినవి :
తడి బియ్యప్పిండి - అర కిలో
బెల్లం తురుము - పావు కిలో
నువ్వులు - రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి తురుము - రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - అర టీస్పూన్
నూనె - సరిపడా
తయారీ : బియ్యం కడిగి, నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే బియ్యాన్ని వడకట్టి, ఆరబెట్టాలి. ఆరిన బియ్యాన్ని పిండి పట్టించి జల్లెడ పట్టాలి. పాన్‌లో బెల్లం తురుము వేయాలి. అందులో పావుకప్పు నీళ్లు పోసి పాకం వచ్చేవరకు కలపాలి. పాకం తయారైందో లేదో చూసేందుకు స్పూన్‌తో కొంచెం తీసి నీళ్లలో వేయాలి. దాన్ని చేత్తో ఉండలా చేయగలిగితే పాకం రెడీ అయినట్లు. పాకంలో నువ్వులు, కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి. కలిపిన పిండి ముద్ద నుంచి చిన్న ఉండలు చేయాలి. కాగిన నూనెలో తయారుచేసిన ఉండల్ని వేయాలి. అవి బాగా వేగాక తీసేయాలి. ఇవి పదిహేను రోజులు నిల్వ ఉంటాయి.