బీటెక్​ ఫెయిల్ స్టూడెంట్.. ఆరేండ్లు కష్టపడినా సబ్జెక్ట్‌‌‌‌లు క్లియర్​ కాలే.. ఇప్పుడు రూ.15 కోట్ల సంపాదన

సందీప్ జంగ్రా​.. బీటెక్​ ఫెయిల్ స్టూడెంట్​. ఆరేండ్లు కష్టపడినా సబ్జెక్ట్‌‌‌‌లు క్లియర్​ కాలేదు. భయంతో ఆ విషయం ఇంట్లో చెప్పలేకపోయాడు. చివరకు ఒక షోరూంలో నెలకు 9వేల రూపాయల జీతానికి పనిలో చేరాడు. అదే టైంలో ఒకరోజు ఫ్రెండ్స్​తో కలిసి పిజ్జా తిన్నాడు. దాని రుచి బాగా నచ్చింది. ఆ టేస్ట్‌‌‌‌ని తన సొంతూరికి కూడా పరిచయం చేయాలనే ఆలోచన తట్టింది.  ఆ తరువాతి సంవత్సరమే హోమ్​టౌన్​లో ఒక చిన్న పిజ్జా ఔట్​లెట్​​ పెట్టాడు. కట్​ చేస్తే.. ఇప్పుడు అతని పిజ్జాలను ఎన్నో సిటీల్లో రుచి చూస్తున్నారు. 72 ఔట్​లెట్లతో ఏటా కోట్లలో టర్నోవర్​ చేస్తున్నాడు. 

సందీప్ హర్యానాలోని గోహనా అనే చిన్న టౌన్​లో పుట్టాడు. వాళ్లది ఉమ్మడి కుటుంబం. తండ్రి కన్​స్ట్రక్షన్​ మెటీరియల్​ అమ్మేవాడు. దాంతో సందీప్​కు కూడా చిన్నప్పటినుంచి బిజినెస్​ చేయాలనే ఆలోచనే ఉండేది. స్కూల్​ ఎడ్యుకేషన్​ పూర్తిగా సొంతూరిలోనే సాగింది. తర్వాత ఊరికి దగ్గర్లోని ఇస్రానాలో ఉన్న ఎన్​సీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌‌లో చేరాడు. కానీ.. అతనికి చదువు పెద్దగా తలకెక్కలేదు. ఇంజనీరింగ్​ పూర్తయ్యేసరికి చాలా బ్యాక్​లాగ్స్​ ఉన్నాయి. మళ్లీ మళ్లీ పరీక్షలు రాశాడు. ఆరేళ్లు గడిచినా సబ్జెక్ట్‌‌లు పూర్తి కాలేదు. దాంతో ఎక్కడా ఉద్యోగం దొరకలేదు.

 కొన్నాళ్ల పాటు ఖాళీగా ఉన్నాడు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో చివరకు అతని ఫ్రెండ్​ ద్వారా గురుగ్రామ్‌‌లోని ఒక  స్టోర్​లో పనికి కుదిరాడు.  నెలకు 9 వేల రూపాయల జీతం. అక్కడ ఉన్నప్పుడే 2014లో తన ఫ్రెండ్స్​తో కలిసి మొదటిసారి పిజ్జా తిన్నాడు. ఆ క్షణంలో వచ్చిన ఒక ఆలోచన సందీప్​ జీవితాన్నే మార్చేసింది. పిజ్జా టేస్ట్​ సందీప్​కు బాగా నచ్చింది. పైగా దాని తయారీ విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. అంత సింపుల్​గా ఇంత టేస్టీ ఫుడ్​ తయారుచేయొచ్చా? అనిపించింది. 

రాకెట్ సైన్స్ కాదు 

పిజ్జా తిన్న కొన్ని నెలల్లోనే బిజినెస్​ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. కానీ.. పిజ్జా తయారీ, బిజినెస్​ చేయడం.. రెండూ అతనికి తెలియవు. వాటి గురించి పూర్తిగా తెలుసుకునేందుకు గురుగ్రామ్, హర్యానాలోని చాలా పిజ్జా అవుట్‌‌లెట్స్​కి వెళ్లాడు. చివరకు రోహ్‌‌తక్‌‌లోని ‘పిజ్జా వింగ్స్‌‌’ వాళ్లు అతనికి పిజ్జా ఔట్​లెట్​ను మేనేజ్​ చేయడం నేర్పించడానికి ఒప్పుకున్నారు. “నేను పిజ్జా వింగ్స్‌‌లో  నెలన్నర పాటు ట్రైనింగ్​ తీసుకున్నా. పిండి కలపడం, సాస్ తయారు చేయడం నుంచి పిజ్జా డెలివరీ వరకు ప్రతి విషయాన్ని తెలుసుకున్నా. అప్పుడే పిజ్జా తయారు చేయడం రాకెట్ సైన్స్ కాదని అర్థమైంది” అన్నాడు సందీప్. 

అప్పు చేసి.. 

ట్రైనింగ్ పూర్తైన వెంటనే సందీప్ ఇంటికి వెళ్లిపోయాడు. బిజినెస్​ ఐడియా గురించి తన ఫ్యామిలీకి చెప్పాడు. సొంతూరిలోనే రద్దీగా ఉండే సెంటర్‌‌లో పిజ్జా ఔట్​లెట్​​ పెట్టాలి అనుకున్నాడు. కానీ.. అతని తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకోలేదు. వాళ్లు అతను గొప్ప ఇంజనీర్​ అవుతాడని కలలు కన్నారు. అయినా.. నిరుత్సాహపడకుండా తన బంధువులు, ఫ్రెండ్స్​ని సపోర్ట్‌‌ అడిగాడు. కొంతమంది సాయం చేయడంతో  6.5 లక్షల రూపాయలు పోగు చేసి గోహనాలో ‘పిజ్జా గలేరియా’ పేరుతో  ఔట్​లెట్​ పెట్టాడు. ఆ ఊరివాళ్లలో చాలామందికి  పిజ్జా రుచి తెలియదు. అలాంటిది అక్కడ పిజ్జా తయారుచేసేవాళ్లు ఉంటారా? అందుకే మంచి చెఫ్​ని వెతకడం కూడా సందీప్​కు కష్టమైంది. 

ముగ్గురితో మొదలు

సందీప్​ ఇంటర్​ పూర్తి చేసిన ముగ్గురిని పనిలో పెట్టుకున్నాడు. వాళ్లకు పిజ్జా బేస్, సాస్, తయారుచేసే విధానం, డెలివరీ కోసం ఎలా ప్యాక్ చేయాలో నేర్పించాడు. ఆ తర్వాత పిజ్జాని మార్కెట్​ చేయడం మొదలుపెట్టాడు. ఆ ఏరియాలో చాలామందికి పిజ్జా గురించి అవగాహన కూడా లేదు. అలాంటివాళ్లకు పిజ్జా తినడం అలవాటు చేయడం కాస్త కష్టమే అయ్యింది. సందీప్ సిటీలో బైక్​ మీద తిరుగుతూ ఇళ్ల తలుపులు కొడుతూ పాంప్లెట్స్​ పంచాడు. మైక్, స్పీకర్‌‌ పట్టుకుని ‘ఖుల్ గయా, ఖుల్ గయా, అబ్ ఆప్కే షెహెర్ మే పిజ్జా గలేరియా ఖుల్ గయా (పిజ్జా గలేరియా ఇప్పుడు మీ పట్టణంలో తెరిచి ఉంది)’ అంటూ అరుస్తూ తిరిగేవాడు. ఈ మార్కెటింగ్​ పద్ధతిని ఇప్పటికీ కొత్త ఔట్​లెట్​ ఓపెన్​ చేసినప్పుడు పాటిస్తున్నాడు. 

300 పిజ్జాలు ఫ్రీ.. 

గోహనాలో చాలామంది ప్రజలు వాళ్ల మొదటి పిజ్జాను 2015 డిసెంబర్ 25న రుచి చూశారు. ఎందుకంటే.. కస్టమర్లను ఆకట్టుకోవడానికి సందీప్​ ఆ రోజు మొదటి 300 పిజ్జాలను ఉచితంగా ఇచ్చాడు. ఫ్రీగా పిజ్జాలు ఇవ్వడంతో చాలామందికి ఔట్​లెట్​ గురించి తెలిసింది. నెమ్మదిగా పిజ్జాలు తినేవాళ్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. మొదట్లో ఆ ఏరియాలో అందిరికీ నచ్చే ఎనిమిది రకాల పిజ్జాలు మాత్రమే అందుబాటులోకి తెచ్చాడు. గోహనాలో ఔట్​లెట్​ సక్సెస్​ కావడానికి దాదాపు సంవత్సరం పట్టింది. ఆ తర్వాత పిజ్జాల తయారీకి అనుసరించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాడు.  బిజినెస్​ పెరిగాక.. పిజ్జాలను సర్వ్, ప్యాకింగ్, డెలివరీ చేయడంలో మార్పులు తీసుకొచ్చాడు.

2030 నాటికి 500 అవుట్‌‌లెట్లు

సందీప్, తన పార్ట్​నర్​ ఇషాన్​లు షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్–3కి కూడా వెళ్లారు. అక్కడ వాళ్ల బిజినెస్​ మాడల్​ గురించి చెప్పారు. ఆ వీడియో చూసిన వేలమంది ఫ్రాంచైజీ అవుట్‌‌లెట్లు పెట్టడానికి సందీప్​కు ఫోన్​ చేశారు. 2030 నాటికి 500 అవుట్‌‌లెట్లను పెట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఔట్​లెట్లు పెట్టాలనేది సందీప్​ కల. “పిజ్జా గలేరియాతో నా కలలు నిజమయ్యాయి. నెలకు 9 వేల రూపాయల జీతం తీసుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాను. ఇల్లు, కారు కొనుక్కున్నా. ముఖ్యంగా ఒకప్పుడు బిజినెస్​ వద్దన్న నా కుటుంబమే నన్ను ప్రశంసించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది” అంటూ తన ఎక్స్​పీరియెన్స్​ని పంచుకున్నాడు సందీప్​. 

700 మందికి ఉపాధి

గోహనాలో వచ్చిన సక్సెస్​తో 2017లో పానిపట్, గనౌర్ (హర్యానా)లో పిజ్జా గలేరియా ఔట్​లెట్లను పెట్టాడు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. మూడో ఔట్‌‌లెట్ పెట్టినప్పుడు అతని ఫ్రెండ్​ ఇషాన్ చుగ్ కూడా బిజినెస్​లో చేరాడు. ప్రస్తుతం 72 ఔట్‌‌లెట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా కంపెనీ యాజమాన్యంలో నడిచేవే ఉన్నాయి.  పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఛత్తీస్‌‌గఢ్, ఢిల్లీ–ఎన్‌‌సీఆర్​, చండీగఢ్‌‌లలో ఫ్రాంచైజీ ఔట్‌‌లెట్లు ఉన్నాయి. 

వీటి ద్వారా 700 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు  ఔట్​లెట్లలో పిజ్జాలతోపాటు పాస్తా, గార్లిక్ బ్రెడ్, శాండ్‌‌విచ్‌‌లు, ఫ్రైస్, బర్గర్‌‌లు, కూల్‌‌ డ్రింక్స్​ లాంటివి కూడా అమ్ముతున్నారు. పిజ్జా ధరలు 69 రూపాయల నుంచి, కాంబోలు  89 రూపాయల నుంచి మొదలవుతాయి.  పిజ్జా గలేరియాలో తందూరి పనీర్ పిజ్జా, ఎక్సోటికా, మఖ్నీ పిజ్జా, ‘బాహుబలి’ 24-అంగుళాల పిజ్జా బెస్ట్ సెల్లర్స్. 

7 లక్షల పిజ్జాలు

సందీప్ మొదటిసారి పిజ్జా తిన్నప్పుడు ఇంకోసారి తింటే బాగుండు అనిపించిందట! కానీ.. ఇప్పుడు అతనే నెలకు 7 లక్షలకు పైగా పిజ్జాలు అమ్ముతున్నాడు. అది కూడా 100 శాతం వెజిటేరియన్​ పిజ్జాలే అమ్ముతున్నాడు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 15 కోట్ల రూపాయల టర్నోవర్‌‌ అయ్యింది.