నిజామాబాదు జిల్లాలో ఇసుక దందా నయా ట్రెండ్​

  • ఏకమైన ఇసుక అక్రమార్కులు
  • ఇసుక రవాణాకు ఎత్తులు సహకరిస్తున్న అధికారులు 
  • రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి

కోటగిరి, వెలుగు: ఇసుక అక్రమ రవాణా చేసే మాఫియా  కొత్త పంథాకు తెరలేపింది. అక్రమ ఇసుకను లీగల్ గా మార్చి రూ.లక్షలు దండుకుంటున్నారు. పోతంగల్ మంజీరా తీరంలో ఇసుక అక్రమార్కులు ఏకమై ఒకేచోట డంపులు పోసి ఆ  విషయాన్ని అధికారులకు రహస్యంగా తెలిపి వేలం వేయిస్తున్నారు.  లీగల్ గా పర్మిషన్లు పొంది పెద్దఎత్తున ఇసుకను రవాణా చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.  ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నా మండల స్థాయి అధికారుల తీరు  భిన్నంగా ఉంది. 

పక్కా ప్రణాళికతో..

మంజీరా నది వద్ద ఏకంగా మహారాష్ట్రకు వెళ్లే దారిలోనే మెయిన్ రోడ్డు పక్కనే 50 నుంచి 100  ట్రాక్టర్‌‌ల ఇసుక  డంప్ పోసి ఆపై వాళ్లే రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చి దానిని వేలం వేసేలా చేస్తున్నారు. అక్రమ ఇసుక వ్యాపారులు సిండికేట్ గా మారి ఒక్కోసారి ఒక్కొక్కొరు వేలంలో పాల్గొని  తక్కువ ధరకు దక్కించుకొని అధికారికంగా తరలిస్తున్నారు. ఇప్పటి వరకు రాత్రి వేళలో ఇసుక దందా చేసే మాఫియా అధికారుల సహకారంతో లీగల్ గా పట్టపగలే  ఇసుకను తరలిస్తున్నారు.

మూడు ట్రాక్టర్ల ఇసుక తీసుకెళ్లాల్సిన టిప్పర్లలో ఏకంగా ఆరు, ఏడు ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తున్నారు.  తమవద్ద సిబ్బంది లేరనే సాకుతో  రెవెన్యూ అధికారులు చర్యలు చేప్టడంలేదని  ప్రజలు మండి పడుతున్నారు. పోలీసులు కూడా శీతకన్ను వేయడంతో ఇసుక అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.   తగినంత సిబ్బంది లేకపోవటంతో రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నామని, తమకు పోలీసుల సహకారం లేదని తహసీల్దార్ చెప్తున్నారు.  పోతంగల్ తహసీల్దార్ కార్యాలయంలో పైస్థాయి అధికారితోపాటు , పోలీసు బాస్ కనుసన్నల్లోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

  సోషల్ మీడియాలో పోతంగల్ తహసీల్దార్ వాయిస్ తో ఓ ఆడియో చక్కర్లు కొట్టడంతో  ఇసుక మాఫియాకు అధికారుల సహకారం ఉందనే వార్తలకు బలం చేకూరింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి అక్రమ ఇసుక మాఫియాకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవటమే కాకుండా, అక్రమార్కుల నుంచి మంజీరా నది, ఇసుక రవాణాతో ధ్వంసమవుతున్న రోడ్లను  కాపాడాలని  రైతులు, ప్రజలు  కోరుతున్నారు.

పోలీసులు సహకరించడంలేదు

మా వద్ద సిబ్బంది కొరత ఉంది. వీఆర్‌‌వోలు, వీఆర్‌‌ఏలు వెళ్లిపోడంతో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్నాం.  ఇసుక అక్రమ రవాణా కట్టడిచేయటంలో పోలీసులు సహకరించడంలేదు. ఇకపై డంపు చేసిన ఇసుకను వేలం వేసినా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వం. డీడీలు కట్టిన వారికి ట్రాక్టర్‌‌ల ద్వారా ఇచ్చే ఏర్పాట్లు చేస్తాం. ఇసుక తరలింపు ఇల్లీగల్ గా కాకుండా చూస్తాం. ఇసుక టిప్పర్లు ఓవర్ లోడ్‌తో వెళ్లినట్లు సమాచారం ఉంది. సిబ్బంది తప్పుంటే చర్యలు తీసుకుంటాం.  

మల్లయ్య, పోతంగల్ తహసీల్దార్