మిడ్​నైట్​ దందా..వానాకాలం వస్తుండడంతో పెరిగిన ఇసుక అక్రమ రవాణా

  • అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తిరుగుతున్న ఇసుక ట్రాక్టర్లు, లారీ​లు
  • ఇంటర్నల్​గా సపోర్ట్​ చేస్తున్న కొన్ని డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు

మహబూబ్​నగర్, వెలుగు : వారం, పది రోజుల్లో వర్షాలు పడే చాన్స్​ ఉండడంతో వాగుల్లోని ఇసుకను పెద్ద మొత్తంలో తరలించేందుకు ఇసుకాసురులు రంగంలోకి దిగారు. ఇటీవల సీఎం రేవంత్​ రెడ్డి అక్రమ దందాలకు చెక్​ పెట్టాలని ఆఫీసర్లకు ఆర్డర్లు ఇచ్చినా.. స్థానికంగా ఉండే కొందరు అధికారులు మాత్రం ఈ దందారాయుళ్లకు రెడ్​ కార్పెట్​ పరుస్తున్నారు. 

ఉదయం దందా చేసుకుంటే ప్రాబ్లం అవుతుందని, అర్ధరాత్రి, తెల్లవారుజామున రవాణా చేయాలని సలహాలు​ఇస్తున్నారు. పైగా మూడు డిపార్ట్​మెంట్లలోని ఆఫీసర్లను మేనేజ్​ చేయాల్సి వస్తుండడంతో ఇసుక రేట్లను పెంచారు. దీంతో కొత్త ఇండ్లను కట్టుకుంటున్న వారు వ్యాపారులు చెబుతున్న రేట్లు విని ఖంగుతింటున్నారు.

మూడు నెలలు బ్రేక్​ ఇచ్చి..

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక అక్రమ వ్యాపారంలో ఆరితేరిన పొలిటికల్​ పార్టీలకు చెందిన కొందరు లీడర్లుఈ దందాకు బ్రేక్​ వేశారు. డిసెంబర్​ నుంచి ఫిబ్రవరి వరకు సప్పుడు చేయలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ బైపోల్స్, లోక్​సభ ఎన్నికల కోడ్​ అమల్లోకి రావడంతో ఈ దందా రాయుళ్ల వాగుల జోలికి వెళ్లలేదు. అంతకుముందు డంప్​ చేసి పెట్టుకున్న ఇసుకను మాత్రమే అమ్ముకున్నారు. ప్రస్తుతం డంప్​లు అయిపోయాయి. ఎండాకాలం కూడా అయిపోవస్తుంది. 

ఈ నేపథ్యంలో మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లోని ఊకచెట్టువాగు పరిధిలో ఉన్న ఉమ్మడి చిన్నచింతకుంట మండలం అల్లీపూర్, వడ్డేమాన్, మద్దూరు, లాల్​కోట, ముచ్చింతల, పేరూరు వాగు, అడ్డాకుల మండలం వర్నె, ముత్యాలంపల్లి, పెద్ద మునగాల్​చెడ్, కన్మనూరు, రాచాల, కందూరు, ముసాపేట మండలం కొమిరెడ్డిపల్లి, తాళ్లగడ్డ, పోల్కంపల్లి, మక్తల్​ నియోజకవర్గంలోని అమ్మపల్లి, కర్నె, చిట్యాల, కోయిల్​కొండ మండలం సూరారం, లింగాల్​చెడ్​, అయ్యవారిపల్లి, మహమ్మదాబాద్​ మండలం ధర్మాపూర్, అన్నారెడ్డిపల్లి, గండీడ్​ మండలం రంగారెడ్డిపల్లి, పగిడ్యాల్​ వాగుల్లో పెద్ద మొత్తంలో ఉన్న ఇసుక తరలించేందుకు ప్లాన్​ చేశారు. 

గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి ఒంటి గంట నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. మక్తల్ నియోజకవర్గంలోని వర్కూరు, నాగిరెడ్డిపల్లి వాగుల వద్ద ఇసుక తరలించేందుకు ప్రభుత్వం నుంచి అమనుతులు ఉండగా, ఇక్కడ ఒక టిప్పర్​కు అనుమతి తీసుకొని 10 ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు.

పెరిగిన ఇసుక ధరలు..

వ్యాపారులు ఇసుక ధరలను కూడా పెంచారు. కొద్ది రోజుల కిందటి వరకు ట్రాక్టర్​ ట్రిప్​ దూరాన్ని బట్టి రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ఉండగా, ఇప్పుడు రూ.4,500 నుంచి రూ.5,500 వరకు వసూలు చేస్తున్నారు. లారీ​ ట్రిప్​కు గతంలో రూ.30 వేల నుంచి రూ.32 వేల వరకు ఉండగా, ఇప్పుడు రూ.40 వేల నుంచి రూ.42 వేలకు పెంచారు. దీంతో ఇండ్లు కట్టుకుంటున్న సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబుల్​ బెడ్రూమ్​ ఇల్లు కట్టుకోవడానికి ఇసుకకే  రూ.3.50 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. 

ట్రిప్పుకు ఇంత!

ఇసుక అక్రమ రవాణాకు చెక్​ పెట్టాలని సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేస్తే, పాలమూరు జిల్లాలో లోకల్​గా ఉండే ఆఫీసర్లు మాత్రం ఈ దందాను ప్రోత్సహిస్తున్నారు. ఒక ట్రిప్​ లోడ్​ వెళితే ట్రాక్టర్​కు రూ.2 వేల నుంచి రూ.2,500, బెంజ్​ లోడ్​కు రూ.8 వేల నుంచి రూ.10 వేల చొప్పున అక్రమ వ్యాపారులు చెల్లిస్తున్నారని అంటున్నారు. 

కొద్ది రోజుల కిందట ఉమ్మడి గండీడ్​ మండలంలోని ఓ ఇసుక వ్యాపారి పోలీసులపై ఆరోపణలు చేస్తూ వాట్సాప్​ గ్రూపుల్లో పోస్టులు పెట్టాడు. డయల్​ 100కు ఫోన్​ చేసి పోలీసులపై కంప్లైంట్​ చేశాడు. వెంటనే పోలీసులు సదరు వ్యాపారికి వేరే వ్యాపారులతో ఫోన్​లు చేసి బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సదరు వ్యాపారి తాను సూసైడ్​ చేసుకుంటానని, పోలీసుల టార్చర్​ భరించలేకపోతున్నానని మళ్లీ వాట్సాప్​ గ్రూపుల్లో పోస్టులు పెట్టడంతో అందరూ సైలెన్స్​ అయ్యారు..