వాగులను తోడేస్తున్రు..సాండ్​ టాక్సీ బంద్​ పెట్టి టిప్పర్లకు పర్మిషన్

  •     ఇసుక కేటాయింపులపై  నేడు డీఎల్సీ మీటింగ్
  •     వాగు పక్కన మండలాల్లో పోస్టింగ్​లకు మస్తు డిమాండ్​

నాగర్ కర్నూల్, వెలుగు : జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి.పెద్ద వాగులను టార్గెట్​ చేస్తున్న ఇసుక మాఫియా పొక్లెయినర్లు, జేసీబీలు పెట్టి వాగులను తోడేస్తుంటే, అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ, పోలీస్​ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సామాన్యులు, మధ్య తరగతి ప్రజల అవసరాలకు ఇసుక దొరకడం గగనమైపోతోంది. మరోవైపు సాండ్  ట్యాక్సీలను బంద్​ పెట్టించిన రెవెన్యూ అధికారులు.. టిప్పర్లకు పర్మిషన్​  ఇప్పించారు. అధికారిక ఇసుక రీచ్​ల నుంచి ప్రభుత్వ నిర్మాణాలు, ప్రాజెక్ట్​ పనులకు కేటాయించిన ఇసుకను కాంట్రాక్టర్లు పక్కదారి పట్టిస్తున్నారు.

ఇదిలాఉంటే వాగుల పక్కన ఉండే మండలాల్లో పోస్టింగుల కోసం కీలక శాఖల అధికారులు పోటీ పడుతున్నారు. ఇసుక దందా బహిరంగంగా కొనసాగుతున్నా అధికార యంత్రాంగంలో చలనం లేకుండా పోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇసుక రీచ్​లను గుర్తించి ప్రభుత్వ, ప్రైవేట్​ అవసరాలకు అనుగుణంగా కేటాయించేందుకు సోమవారం జిల్లా స్థాయి మీటింగ్​ నిర్వహిస్తున్నారు.

సాండ్​ ట్యాక్సీ బంద్​ పెట్టి..

అసెంబ్లీ, పార్లమెంట్​ ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం బిజీగా ఉంటే.. ఇసుక మాఫియా వాగులను తోడేసే పనిలో పడింది. జిల్లాలో ఇండ్లు కట్టుకునే సామాన్య, మధ్య తరగతి ప్రజల అవసరాలకు అనుగుణంగా సాండ్ ట్యాక్సీ విధానం ప్రారంభించారు. ఇందులో భాగంగా గుర్తించిన ఇసుక రీచ్​ల నుంచి సాండ్  ట్యాక్సీలో నమోదైన ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలించేందుకు మైనింగ్​ శాఖలో 300 ట్రాక్టర్లు రిజిస్టర్​ అయ్యాయి.

ట్రాక్టర్​ ఇసుకకు రూ.3500 నుంచి రూ.4 వేల వరకు చెల్లించే వారు. ఎన్నికల ముందు జిల్లా అధికార యంత్రాంగంలో కీలక అధికారులను మేనేజ్​ చేసిన ఇసుక మాఫియా సాండ్ ట్యాక్సీలో రిజిస్టర్​ చేసుకున్న ట్రాక్టర్లకు కాకుండా, టిప్పర్లకు అనుమతివ్వాలని ఒత్తిడి తెచ్చి అనుమతులు పొందారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. టిప్పర్లకు ఆన్​లైన్​లో కాకుండా మ్యానువల్​గా అనుమతులు ఇచ్చేలా లాబీయింగ్​ చేశారు. ఇదిలాఉంటే అక్రమ ఇసుక దందాను అడ్డుకోవాలని సీఎం ఆదేశించడంతో వారం రోజులు హడావుడి చేసిన అధికారులు మళ్ళీ పాత పద్ధతిలోనే ఇసుక తరలించుకొనేందుకు అంగీకరిస్తున్నారు.

ఇసుక తరలింపు అనుమతులు, నిర్వహణ, పర్యవేక్షణ మైనింగ్, టీఎస్ఎండీసీలకు అప్పగించారు. రెండింటి మధ్య సమన్వయం లేకపోవడం ఇసుక మాఫియాకు అనుకూలంగా మారిందని అంటున్నారు. ఇసుక రీచ్​ల గుర్తింపు, ప్రభుత్వ, ప్రైవేట్​ అవసరాలకు అనుగుణంగా ఇసుక కేటాయించేందుకు రీచ్​లను పరిశీలించాలని కలెక్టర్​ సంబంధిత అధికారులను ఆదేశించారు.

పెద్దవాగులే టార్గెట్..

పెద్ద వాగులను టార్గెట్​ చేస్తున్న ఇసుక మాఫియా మ్యానువల్​ పర్మిట్  పొంది అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారు. దీనిని అడ్డుకోవాల్సిన పోలీస్, రెవెన్యూ, మైనింగ్​ శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డిండి వాగు పరిసర గ్రామాలైన ఉల్పర, మొల్గర, డిండి చింతపల్లి, మిట్టసదగోడు, రఘుపతిపేట, రామగిరి, పెద్దాపూర్, సిర్సవాడ, బల్లాన్​పల్లి, గుండూరు, లింగసానిపల్లి, తోటపల్లి, పోతారెడ్డిపల్లి సరిహద్దుల నుంచి ఇసుకను తవ్వి డంప్​లు ఏర్పాటు చేసుకుంటున్నారు. గతంలో జిల్లాకే పరిమితమైన ఇసుక ఇల్లీగల్​ రవాణా ప్రస్తుతం హైదరాబాద్​ వరకు కొనసాగుతోంది.