నేడు మే డే ..ఆర్థికశక్తికి మూలం కార్మికశక్తి: సంపతి రమేష్ మహరాజ్

ప్రపంచ దేశాలలో కార్మిక వ్యవస్థ సంఘటిత, అసంఘటిత రంగాలలో కొనసాగుతోంది. వీరంతా పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికులు. వీరు శాయశక్తులా ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటారు. శ్రామిక వర్గం నిరంతరం శ్రమిస్తూ సమాజం అవసరాలను తీర్చే ఒక కిందిస్థాయి వర్గంగా కొనసాగుతోంది.ప్రపంచ దేశాలలో పారిశ్రామికీకరణతో ఆవిర్భవించిన పెట్టుబడిదారీ, భూస్వామ్య విధానంలో కార్మికుల హక్కులను నిరాకరించి శ్రమదోపిడీ మొద లైనది. అప్పుడు కార్మికులు తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాటం జరిపిన రోజే మే 1 తేదీన నిర్వహించే ‘మే డే’.  ‘వాతావరణం మార్పులతో పని ప్రదేశంలో భద్రత, ఆరోగ్య భరోసా " ఇతివృత్తంతో ఈ సంవత్సరం కార్యక్రమం జరగనుంది.

మొట్టమొదటి కార్మిక ఉద్యమాలు రష్యాలో ప్రారంభమై ప్రపంచ దేశాలకు విస్తరించడం జరిగింది. అందులో భాగంగా భారతదేశంలో కూడా పెట్టుబడిదారీ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని, దోపిడీని ప్రశ్నించడానికి కార్మికవర్గాలు ఏర్పడి, హక్కుల సాధన కోసం పోరాటం చేయడం జరిగినది.  ఈ క్రమంలో  కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు  భారతదేశంలో 1920లో ట్రేడ్ యూనియన్లు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. 1923లో మొదటిసారి మే డేను పాటించారు. 

అంబేద్కర్ దార్శనికత

డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో కార్మిక హక్కులను మొట్టమొదటిసారిగా వ్యవస్థాపితం చేశారు. దేశానికి సంపదను సృష్టిస్తూ దేశ ఆర్థిక రంగానికి వెన్నెముకగా ఉన్న కార్మికుల కష్టాలను, యాజమాన్యం దోపిడీని అర్థం చేసుకున్నాడు.  దేశంలోని యావత్ కార్మిక లోకాన్ని  బానిసత్వం నుంచి విముక్తి కల్పించి, వారికి  కనీస మానవ హక్కులను కల్పించడానికి కృషి చేశాడు. దేశంలో మొట్టమొదటిగా కార్మికులు, కర్షకులు, అట్టడుగు వర్గాల కోసం1936న ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించాడు. కార్మికులకు నిర్ణీత పని గంటలు మొదలుకొని,  ప్రసూతి సెలవు ప్రయోజనాల వరకు అంబేద్కర్​ దార్శనికతకు నిదర్శనం.  కార్మికవర్గం నిత్య చైతన్యంతో ఉండాలని మేల్కొల్పాడు.

ఎల్​పీజీతో అభద్రత

నేడు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ యుగంలో ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో అంతర్జాతీయ కార్మిక చట్టాలు ఉల్లంఘనకు గురవుతున్నాయి.  శ్రమదోపిడీ జరగడం, ఉద్యోగ భద్రత కొరవడడం, యాంత్రీకరణ చోటుచేసుకోవడం లాంటి అంశాలు కార్మికుల జీవితాలకు అభద్రత ఏర్పడింది.  ప్రభుత్వాల కాంట్రాక్టు, పార్ట్ టైం ఉద్యోగాల నియామకం వలన ఉద్యోగ భద్రత  ప్రమాదంలో పడింది. ఇటీవల ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ భారతదేశ శ్రామిక శక్తిలో 83 శాతం యువత  నిరుద్యోగులుగా ఉన్నారని పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది.  

కార్మికుల భద్రతకు కృషి చేయాలి

 భారత రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాలకు అనుగుణంగా కనీస వేతన చట్టం, కార్మిక బీమా చట్టం, మహిళ  ఉద్యోగులకు ప్రత్యేక చట్టం, బాల కార్మిక వ్యవస్థ రద్దు, సమాన పనికి సమాన వేతనం, జాతీయ మహిళా కమిషన్ లాంటి చట్టాల ద్వారా  కార్మికులకు మేలు జరుగుతుంది. ఆర్థిక సంస్కరణల అనంతరం భారతదేశంలో చోటుచేసుకున్న మార్పులు  కార్మిక చట్టాలను నీరు గార్చుతున్నాయి.

ఇవి భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ప్రైవేట్ రంగంలో సైతం రిజర్వేషన్లు అమలుపరచాలి.  సంపదను సృష్టించ గలిగే సామర్థ్యాలను యువతకు అందించడానికి విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలి.  ఇటీవల జాతీయ నూతన విద్యా విధానంలోని పాఠశాల స్థాయి నుంచే వృత్తి విద్యపై శిక్షణ ఇవ్వాలని పేర్కొనడం హర్షణీయం. తద్వారా  భావి యువత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల గిగా, ప్లాట్ ఫాం వర్కర్లకు 5 లక్షల బీమా సదుపాయం కల్పించడం అభినందనీయం. యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తూ ఉపాధి కల్పించాలి. అప్పుడే భారతదేశం రానున్న ఐదేండ్లలో ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా అవతరించడానికి బాటలు పడతాయి.

- సంపతి రమేష్ మహరాజ్, సోషల్ ​ఎనలిస్ట్​