సీజేఐని నేనేం అనలేదు...ఎంపీ రామ్​గోపాల్ యాదవ్

  • తొలుత అసభ్య కామెంట్లు.. విమర్శలతో మాటమార్చిన ఎంపీ

లక్నో: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​ను ఉద్దేశిస్తూ సమాజ్​వాదీ పార్టీ ఎంపీ రామ్​గోపాల్ యాదవ్ చేసిన కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి. రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోసం తాను దేవుడిని ప్రార్థించానని ఇటీవల సీజేఐ చెప్పారు. దీనిపై ఎంపీ రామ్​గోపాల్ యాదవ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీజేఐపై అసభ్యకర కామెంట్లు చేశారు.

తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. ‘‘మీరు దయ్యాలను తిరిగి బతికించినప్పుడు.. చనిపోయినవాళ్లను తిరిగి తీసుకొచ్చినప్పుడు.. అవి మళ్లీ దయ్యాలుగా మారుతాయి. తర్వాత అవి మిమ్మల్నే ఫాలో అవుతాయి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? రాముడి ఆలయాన్ని.. బాబ్రీ మసీదును ఎక్కడ చూస్తున్నరు? ఇలాంటి.. వాళ్లు, ఇలాంటి కామెంట్లే చేస్తుంటారు. నేను వాటిని వింటూ ఉండాలా?’’ అని మీడియాను ఉద్దేశిస్తూ రామ్​గోపాల్ యాదవ్ ఊగిపోయారు. తర్వాత ఆయన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

జడ్జిలు, అడ్వకేట్లు, నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో రామ్​గోపాల్ ప్లేట్ ఫిరాయించారు. ‘‘నేను అసలు సీజేఐ డీవై చంద్రచూడ్ గురించి మాట్లాడలేదు. ఆయనెంతో మంచి వ్యక్తి. సీజేఐ అంటే సమాజ్​వాదీ పార్టీకి ఎంతో గౌరవం. ఆయన గురించి నేను అసలు మాట్లాడనేలేదు.. బహ్రెయిచ్ అల్లర్లు, బుల్డోజర్ జస్టిస్ గురించే మాట్లాడాను. కొందరు యూపీలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పాను. సీజేఐ గురించి నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు’’  అని ఎంపీ రామ్​గోపాల్ యాదవ్ అన్నారు.