రామ్​లల్లా గణేశ్​కు క్రేజ్​ .. ధూల్​పేటలో జోరుగా వినాయక విగ్రహాల విక్రయాలు

  • పండుగ దగ్గర పడడంతో క్యూ కడుతున్న కొనుగోలుదారులు
  • బాలాపూర్​ థీమ్​ విగ్రహాలు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి 
  • అందుబాటులో రెండు ఫీట్ల నుంచి 40 ఫీట్ల విగ్రహాలు
  • విగ్రహ సైజును బట్టి రూ.100 నుంచి రూ.5లక్షలు ధరలు 

హైదరాబాద్, వెలుగు: గణేశ్​ విగ్రహాలు కొనేందుకు వస్తున్నవారితో గోషామహల్ ​నియోజకవర్గంలోని ధూల్​పేట కళకళలాడుతోంది. ఏ గల్లీ చూసినా కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తోంది. వినాయక చవితికి 10 రోజులు మాత్రమే ఉండడంతో గణేశ్​ఉత్సవ కమిటీల నిర్వాహకులు క్యూ కడుతున్నారు. ధూల్​పేటలో రెండు ఫీట్ల నుంచి 40 ఫీట్ల దాకా, రూ.100 నుంచి రూ.5లక్షల విలువ చేసే విగ్రహాలు దొరుకుతున్నాయి. దీంతో అందరూ ధూల్​పేట బాట పడుతున్నారు. ఇప్పటికే 70 శాతం విగ్రహాలు అమ్ముడయ్యాయని, ఉత్సవాల నిర్వాహకులు అడ్వాన్స్​చెల్లించి బుక్​చేసుకున్నారని వ్యాపారులు చెబుతున్నారు. 

దాదాపు అన్ని విగ్రహాల బుకింగ్స్​అయిపోయాయని అంటున్నారు. మరికొన్ని విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు. పండుగ దగ్గర పడడంతో ఉత్సవ కమిటీలు విగ్రహాలను కొన్న వెంటనే మండపాలకు తరలిస్తున్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది అయోధ్యలోని బాలరాముడి(రాల్​లల్లా) థీమ్ గణనాథులకు డిమాండ్​ఎక్కువగా ఉంది. అలాగే బాలాపూర్ గణేశుడిని పోలిన ప్రతిమలను కొనుగోలుదారులు ఎక్కువగా అడుగుతున్నారు.  

సైజ్, థీమ్​ను బట్టి రేటు

సిటీలో ఒక్కో మండపంలో ఒక్కో థీమ్​తో గణనాథుడిని ప్రతిష్ఠిస్తుంటారు. మండపాల నిర్వాహకులు ఏటా క్రేజీ థీమ్ తో విగ్రహాలను ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. గతంలో బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ సినిమాల్లో నటుల మ్యానరిజాన్ని పోలిన విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈసారి కూడా అదే తరహాలో తయారీదారులు విగ్రహాలను రెడీ చేశారు. అయోధ్య రామ మందిరంలో కొలువైన బాలరాముడి రూపంలో ఉన్న గణనాథుని విగ్రహాలు ఎక్కువగా సేల్​అవుతున్నాయి.

 ప్రస్తుతం ధూల్ పేటలో బాల రాముడి థీమ్​విగ్రహాలు 7 నుంచి 10 అడుగుల ఎత్తులో  దొరుకుతున్నాయి. వీటిని కొందరు రెండు, మూడు నెలల ముందుగా అడ్వాన్స్​ఇచ్చి తయారు చేయించుకోగా, మరికొందరు నేరుగా వచ్చి అందుబాటులో ఉంటే కొంటున్నారు. ఈ సీజన్​ లో రామ్​లల్లా విగ్రహాలకు డిమాండ్​ బాగుందని వ్యాపారులు చెబుతున్నారు. ఎత్తు, సైజును బట్టి వ్యాపారులు రూ.20 నుంచి రూ.40 వేల దాక అమ్ముతున్నారు.

రెడీ అవుతున్న బాలాపూర్ ​గణనాథుడు  

సిటీతోపాటు తెలంగాణలో ఖైరతాబాద్​బడా గణేశ్​తర్వాత అందరూ మాట్లాడుకునేది బాలాపూర్​వినాయకుడి గురించే.. ఇక్కడ ప్రతి ఏడాది నిర్వహించే లడ్డూ వేలం పాట లక్షల్లో ఉంటుంది. అలాగే ఏటా ఏర్పాటు చేస్తున్న విగ్రహం మిగిలినచోట్ల కంటే భిన్నంగా, అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటోంది. దీంతో బాలాపూర్​తరహా విగ్రహాలు కావాలని చాలా మంది పట్టుబడుతున్నారు. 

వీటికోసం తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్సవ నిర్వాహకులు వస్తున్నారు. ధూల్​పేటలో బాలాపూర్​థీమ్​విగ్రహాలను దాదాపు 40 వరకు తయారు చేస్తున్నారు. లక్ష్మీనారాయణమూర్తి కళాకార్​ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను సిద్ధం చేస్తున్నారు. ఒక్కో విగ్రహం ధర రూ.3లక్షలకు పైగా పలుకుతోంది.  

నచ్చితే ఎంత రేటైనా పెడతాం

నేను బంజారాహిల్స్ ఉంటా. మాది ఏపీలోని చిత్తూరు. మా ప్రాంతంలో భారీ విగ్రహాలు ఉండవు. అందుకే 15 ఏండ్లుగా ధూల్​పేట నుంచి వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తున్నాం. గతేడాదితో పోలిస్తే ఈసారి రేట్లు పెరిగాయి. విగ్రహం నచ్చితే ఎంత రేటైనా పెడతాం.  – మోనీశ్, బంజారాహిల్స్

సేల్స్​ బాగున్నాయి

కిందటేడుతో పోలిస్తే ఈసారి విగ్రహాల సేల్స్ పెరిగాయి. మెటీరియల్​కాస్ట్, లేబర్​చార్జీలు, రెంట్లు పెరగడంతో విగ్రహాల ధరలు కూడా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే దాదాపు 20 శాతం ధరలు పెరిగాయి. అయినప్పటికీ సేల్స్ పై ఎఫెక్ట్ పడలేదు. ఈ ఏడాది అయోధ్య రామ్​లల్లా విగ్రహాలు బాగా సేల్​అవుతున్నాయి. మేమ తయారుచేసిన రామ్​లల్లా విగ్రహాలన్నీ అమ్ముడైపోయాయి.  – గోపాల్, ధూల్ పేట, విగ్రహాల వ్యాపారి

రేట్లు ఎక్కువగా ఉన్నయ్​

మేము మహబూబ్​నగర్​నుంచి వచ్చినం. ధూల్ పేట అంతా తిరిగాం. గణేశుడి విగ్రహాలు చాలా బాగున్నాయి. ఏ విగ్రహం చూసిన కొనాలనిపిస్తోంది. కానీ, రేట్లే ఎక్కువ చెప్తున్నరు. మేము ఒక బడ్జెట్​అనుకొని వచ్చాం. ఇక్కడ విగ్రహాలు చూశాక ధర ఎక్కువైనా పర్లేదు మంచి విగ్రహం కొనుక్కొని వెళ్లాలని డిసైడ్​అయ్యాం. 

మహేశ్, మహబూబ్​నగర్​