హైదరాబాద్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హుస్సేన్​ సాగర్ ​తీరాన నిర్వహించిన ‘సద్దుల బతుకమ్మ సంబురం’ అంగరంగ వైభవంగా జరిగింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో వేలాది మంది ఆడపడుచులు ట్యాంక్​బండ్​పైకి తరలివచ్చారు. ర్యాలీ ఆకట్టుకుంది. బోనాలు ఎత్తుకొన్న ఆడబిడ్డలు, ఆదివాసీలు, ఒగ్గుడోలు కళాకారులు, లంబాడీలు, విన్యాసాలతో పోతురాజులు, శివమూగుతూ శివసత్తులు ముందు కదలడం అబ్బురపరిచింది. ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టు ఎగిసిపడిన తారాజువ్వల వెలుగుల ప్రతిబింబాలు సాగర అలలపై కనువిందు చేశాయి. 

మంత్రి సీతక్కతోపాటు మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులంతా పదం.. పాదం కదిపారు. ‘మాయమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. పోయిరా గౌరమ్మా ఉయ్యాలో’, ‘మళ్లీ మళ్లీ రావే బతుకమ్మ నేరియాలో.. ఎల్లి రావే బతుకమ్మ నేరియాలో’ అంటూ సద్దుల బతుకమ్మకు ఘనంగా వీడ్కోలు పలికారు. కూకట్​పల్లి, ఎల్​బీనగర్, సికింద్రాబాద్, రాంనగర్, ముషీరాబాద్ వంటి ప్రాంతాల్లోనూ సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. 

కూకట్​పల్లిలోని రామాలయం, హనుమాన్ ​ఆలయాల నుంచి వందల మంది మహిళలు ఊరేగింపుగా ఐడీఎల్ చెరువు వద్దకు చేరుకుని బతుకమ్మ ఆడారు. ఇక్కడ భారీ బతుకమ్మలు ఆకట్టుకున్నాయి.  మిగిలినచోట్ల సంబురాలు సందడిగా సాగాయి. – సిటీనెట్​వర్క్, వెలుగు