Sadbhavana Diwas: నేడు మాజీ ప్రధాని రాజీవ్​ గాంధీ జయంతి

  • హైటెక్ భారతావనికి.. ఆద్యుడు రాజీవ్ గాంధీ

భారతదేశ ఐటీ, టెలికాం రంగాల పితామహుడు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. 'పయనీర్ ఆఫ్ డిజిటల్ ఇండియా', 'కంప్యూటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అని కూడా రాజీవ్​గాంధీని పిలుస్తారు. ఆయన హయాంలోనే దేశంలో ఐటీ, టెలికాం విప్లవానికి పునాదులు పడ్డాయి. 21వ శతాబ్దిలో దేశాన్ని కొత్త దిశగా నడిపించి దిశానిర్దేశం చేశారు.  దేశ ప్రధానిగా, ప్రతిపక్ష నేతగా యువతరంలో శక్తిమంతమైన మార్పును రాజీవ్ కాంక్షించారు.  ప్రపంచంతో దేశం పోటీపడేలా అడుగులు వేశారు.  ఆచరణలో  నేటి తరానికి మార్గదర్శిగా నిలిచారు.  భారత్ 7వ  ప్రధానమంత్రిగా1984 నుంచి1989 వరకు సేవలందించారు. తనకు ఇష్టమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై దృష్టి పెట్టి దేశాన్ని  అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా చేశారు.  40 ఏండ్ల వ‌‌య‌‌సులో రాజీవ్​ గాంధీ భార‌‌త యువ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలోనే అతి పిన్న వ‌‌య‌‌స్కులైన దేశ ప్రభుత్వాధినేత‌‌ల్లో ఒక‌‌రుగా రాజీవ్​ ప్రఖ్యాతి పొందారు.  

అనివార్యంగా రాజకీయాల్లోకి..

రాజీవ్‌‌గాంధీ  రాజ‌‌కీయ కుటుంబానికి  చెందినవారైనా అనుకోని పరిస్థితుల్లో అనివార్యంగా రాజ‌‌కీయాల్లోకి వచ్చారు. ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీలకు పెద్ద కుమారుడిగా 1944 ఆగ‌‌స్టు 20న రాజీవ్​గాంధీ జన్మించారు. స్కూల్ చ‌‌దువు పూర్తి చేసుకుని లండన్ వెళ్లి  కేంబ్రిడ్జి ట్రినిటీ కాలేజీ,  ఇంపీరియ‌‌ల్ కాలేజీల్లో 
మెకానిక‌‌ల్ ఇంజినీరింగ్ డిగ్రీ చదివారు. ఇండియాకు తిరిగొచ్చి ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్​లో పైలెట్ లైసెన్సు పొందారు. దేశీ విమాన సంస్థ ఇండియ‌‌న్ ఎయిర్‌‌లైన్స్​లో  పైలెట్ గా జీవితం ప్రారంభించారు. 

రాజీవ్ ఏనాడూ రాజ‌‌కీయాల‌‌ను తన జీవిత గమ్యం అనుకోలేదు. ఆస‌‌క్తి కూడా చూప‌‌లేదు. సైన్స్, ఇంజినీరింగ్‌‌లకు చెందిన ఎన్నో  గ్రంథాలు ఆయన బీరువాల నిండా ఉండేవ‌‌ని అతని స‌‌హచర విద్యార్థులు చెబుతుండేవారు. తన చుట్టూ రాజ‌‌కీయ కోలాహ‌‌లం ఉన్నప్పటికీ రాజీవ్​ మాత్రం ఆసక్తి చూపలేదు.  కానీ,1980లో సోద‌‌రుడు సంజ‌‌య్‌‌గాంధీ విమాన ప్రమాదంలో ఆకస్మికంగా మ‌‌ర‌‌ణించ‌‌డంతో ప‌‌రిస్థితి తారుమారైంది. అప్పట్లో అంత‌‌ర్గతంగా, బ‌‌హిర్గతంగా అనేక స‌‌వాళ్లు చుట్టుముట్టిన ప‌‌రిస్థితుల్లో త‌‌ల్లి ఇందిరకు అండగా నిలబడేందుకు రాజ‌‌కీయాల్లోకి  రావాల్సిందిగా ప్రజలు, పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. మొద‌‌ట్లో వ్యతిరేకించినా ఆ తర్వాత  రాజీవ్ రాజకీయాల్లోకి రాక తప్పలేదు. 

రాజీవ్​ గాంధీ సారథ్యంలో 401 ఎంపీ స్థానాల్లోవిజయంతో  కాంగ్రెస్ ​రికార్డ్​

సంజయ్  మృతితో ఖాళీ ఏర్పడిన అమేథీ స్థానానికి జ‌‌రిగిన ఉప ఎన్నిక‌‌లో రాజీవ్‌‌గాంధీ పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించి ఎంపీగా పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు.  దేశ చ‌‌రిత్రలోనే భారీ మెజార్టీ సాధించారు. అనంతరం 1984 అక్టోబ‌‌ర్ 31న తన తల్లి, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హ‌‌త్యకు గురైన తర్వాత  అంత్యక్రియ‌‌లు పూర్తికాగానే ఆయ‌‌న వెంటనే లోక్‌‌స‌‌భ ఎన్నిక‌‌ల‌‌కు ఆదేశించారు. ఈ ఎన్నిక‌‌ల్లో  అంత‌‌కుముందు ఏడుసార్లు లోక్ సభకు జరిగిన  ఎన్నిక‌‌ల కంటే అత్యధిక సీట్లను కాంగ్రెస్​ సాధించింది. 401 సీట్లలో రాజీవ్​ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్​పార్టీ గెలుపొంది రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఆ రికార్డు ఆయన పేరిట పదిలంగా ఉంది.  ఇందిరాగాంధీ దారుణ హ‌‌త్యకు గురైన స‌‌మ‌‌యంలో ప్రధాన‌‌మంత్రిగా, జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టక తప్పలేదు.  వ్యక్తిగ‌‌త దుఃఖాన్ని, విచారాన్ని అణ‌‌చుకొని జాతీయ బాధ్యత‌‌ను ఎంతో హుందాగా, ఓర్పుగా త‌‌న భుజస్కంధాలపైకి ఎత్తుకున్నారు. దేశంలో త‌‌రం మార్పుకు సంకేతంగా నిలిచారు. 

ప్రపంచ దేశాధినేతల ప్రశంసలు

అణుబాంబుల ద్వారా మానవాభివృద్ధి సాధించలేమని, శాంతి, స్వేచ్ఛ, సమానత్వం ద్వారా మానవాభివృద్ధి సాధించవచ్చని ఆనాడు యెమెన్‌‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో  సందేశం ఇచ్చారు. దీంతో రాజీవ్​ను  ప్రపంచ దేశాధినేతలు ఎంతో ప్రశంసించారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని సంకల్పించాడు.  అందుకే, ఓటు వేయడానికి కనీస వయస్సును 21 నుంచి 18 ఏండ్లకు తగ్గించారు. రాజకీయాల్లో వ్యాపారీకరణను నియంత్రించేందుకు 1985లో రాజ్యాంగానికి 52వ సవరణ ద్వారా రాజకీయాల్లో అవినీతిని అంతం చేయడానికి డిఫెక్షన్ నిరోధక చట్టాన్ని ప్రవేశపెట్టాడు.  దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం  ఘనత ఆయనకే  చెందుతుంది.  ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ద్వేషం, వివక్ష లేని సమ్మిళిత సమాజంగా భారతదేశాన్ని రూపొందించడం, మానవత్వంతో అభివృద్ధి,  ఐక్యతకు కృషి చేయడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. ప్రతి ఏడాది  ఆగస్టు 20న రాజీవ్​గాంధీ జయంతిని సద్భావనా​​ దివస్​గా నిర్వహిస్తారు.

ఐటీ, కమ్యూనికేషన్ల విప్లవానికి నాంది

ఆధునిక భావాలు, నిర్ణయాత్మక శ‌‌క్తి క‌‌లిగిన రాజీవ్‌‌గాంధీ అత్యాధునిక సాంకేతిక ప‌‌రిజ్ఞానంతో దేశాన్ని 21వ శ‌‌తాబ్దంలోకి తీసుకువెళ్లడం లక్ష్యమని పదేపదే తన సహచర నేతలతో చెప్పేవారు. పబ్లిక్ కాల్ ఆఫీస్ (PCO ) విప్లవం చేపట్టి  గ్రామీణ, పట్టణ ప్రాంతాలను మాత్రమే కాకుండా బయటి ప్రపంచానికి కమ్యూనికేషన్  కనెక్టివిటీ కల్పించారు.  అత్యాధునిక టెలికమ్యూనికేషన్ టెక్నాలజీని దేశీయంగా అభివృద్ధి చేయడానికి 1984లో సెంటర్ ఫర్ డెవలప్‌‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT) స్థాపించారు. 1986లో MTNL (మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్) స్థాపించారు. 1985లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖను ప్రారంభించారు. దీనికి మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావును తన కేబినెట్​లో మంత్రిగా నియమించు కున్నారు. 

1984లో యూఎస్ నుంచి తన మిత్రుడు శామ్ పిట్రోడాను దేశానికి రప్పించుకుని సలహాదారుడిగా నియమించుకుని టెలికమ్యూనికేషన్ వ్యవస్థను ఆధునీకరించారు.  ఇలా దూరదృష్టితో కూడిన విధానంతో  రాజీవ్ గాంధీ దేశంలో ఐటీ కమ్యూనికేషన్ల విప్లవానికి నాంది పలికారు.  1986లో కొత్త నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ (NPE)ని అమలులోకి తెచ్చారు. ఇది మహిళలు, దళిత, గిరిజన  విద్యలో సమాన అవకాశాలను కల్పించడం లక్ష్యంగా ప్రారంభించారు. 1987లో ఆపరేషన్ బ్లాక్‌‌ బోర్డ్ స్కీమ్​ను రూపొందించారు. 1985లో విద్యను సార్వత్రికీకరించడానికి ఇందిరా గాంధీ నేషనల్  ఓపెన్ యూనివర్సిటీ  ఏర్పాటు చేశారు.  

- వెలుగు ఓపెన్ పేజీ డెస్క్